కొంచెం మంచితనం కావాలి

ABN , First Publish Date - 2020-06-12T06:02:55+05:30 IST

మనుషులు తామే కేంద్రంగా, తమలో తాముగా బతకడానికే పరిస్థితులు, వ్యవస్థలు ప్రోత్సహిస్తూ ఉంటాయి. తమను తాము దాటుకుని, పరుల కోసం ఆలోచించడానికి, కొంత వదులుకోవడానికి, మరికొంత పంచుకోవడానికి కలిగే ప్రేరణలు తక్కువ...

కొంచెం మంచితనం కావాలి

మనుషులు తామే కేంద్రంగా, తమలో తాముగా బతకడానికే పరిస్థితులు, వ్యవస్థలు ప్రోత్సహిస్తూ ఉంటాయి. తమను తాము దాటుకుని, పరుల కోసం ఆలోచించడానికి, కొంత వదులుకోవడానికి, మరికొంత పంచుకోవడానికి కలిగే ప్రేరణలు తక్కువ. కొందరు ఎప్పుడూ ఉంటారు, ఉన్నది అపసవ్యంగా ఉన్నప్పుడు, అన్యాయమే న్యాయంగా చెలరేగుతున్నప్పుడు, ప్రపంచాన్ని సరిదిద్దడానికి స్వార్థాన్నే వదిలిపారేసే వీరులు ధీరులు ఎప్పుడూ ఉంటారు. కానీ, ఒక మానవజాతిగా, ఒక సమాజంగా, ఒక సమూహంగా కారుణ్యం వెలిగించుకుని, జీవనసార్థక్యాన్ని మంచితనంలో వెదుక్కునే అవసరం, సందర్భం ఇప్పుడు వచ్చింది. కరోనా వైరస్‌ వలె లోలోపలినుంచి ఊపిరిని తొలిచివేసే ద్వేషం, కార్పణ్యం, క్రౌర్యం ఆవరించిన ప్రపంచంలో అందరి నుంచీ అంత మానవతను ఆశించలేము కానీ, మనిషితనం మునిగిపోకుండా ఒడిసిపట్టుకున్న కొన్ని ద్వీపాలు ఉన్నాయి. ప్రస్తుత మానవీయ విషాదాన్ని చూసి, గడ్డకట్టిన నిర్లిప్తతను వదిలించుకుని పైకి తేలిన దీవులు కూడా ఉన్నాయి. ఎప్పటికయినా వాళ్లు లోకానికి ఆశలు. పెద్దలు చెప్పినట్టు, సూర్యుడూ చంద్రుడూ ఉదయిస్తున్నారంటే వారి వల్లనే. 


వలసకార్మికుల పాదాల పగుళ్లను చూసి, తలలపై మోస్తున్న సంసారాల్ని చూసి, దారి పక్కన చలివేంద్రాలుగా, దారిని వెలిగించే నమ్మకాలుగా, గమ్యాన్ని చేర్చే చేదోడుగా మారినవారిని చూశాం. వాళ్ల నోటికి అన్నం అందించినవారు, సేద తీరడానికి నీడ ఇచ్చినవారు, మాడు మండే ఎండలో చంటిపిల్లల నెత్తికి చలువచుట్టు చుట్టినవారు, సమాజం పడిన అప్పును తమ జేబుల నుంచి చెల్లగొట్టినవారు– వీరంతా వెలుతురు పిట్టలు. ఇదంతా జరుగుతున్న సమయంలో భద్రజీవితపు కుటీరంలో కళ్ళూచెవులూ మూసుకున్నవారనేకం. ఖాళీ పళ్లేల మోతతో కరోనా పారిపోతుందనుకోవడమే తప్ప, ఆవరించిన నిర్బంధంలో ఎవరి విస్తరిలో అయినా అన్నం పెట్టాలన్న సోయి లేనివారనేకం. జాతీయ రహదారుల మీద పడిన కోట్లాది పాదాల అడుగుల చప్పుడు, ఈ దేశ నేతలను, భోక్తలను చాలా కాలం వెంటాడుతుంది.


వారే కాదు, లాక్‌డౌన్‌ నిశ్శబ్ద నిర్బంధం వేధించినవారు చిన్న చిన్న దారుల్లోను, ఇరుకు ఇరుకు సందుల్లోను కూడా ఉన్నారు. ఒక టాక్సీ డ్రైవర్‌, ఒక ఆటో అతను, ఇంటిలో పనిమనిషి, రోడ్డుపక్కన కిళ్లీ వాలా, గుడి ముందు పూలమ్మి, హోటల్‌ సర్వర్‌, సైకిల్‌కు గాలికొట్టే కుర్రవాడు, భవనాల కాలనీలకు ఆనుకుని ఉండే చిన్న బస్తీలో ఉండేవారందరికీ పన్నెండు కిలోల బియ్యంతో, పదిహేనువందల సొమ్ముతో నెల గడిచిందా? సరే, ఎంత చెట్టుకు అంత గాలి. ఎంతటి చిన్నవాడికైనా ఎంతో కొంత పరపతి ఉంటుంది. దగ్గర్లోని కిరాణాకొట్టులో ఖాతా ఉంటుంది, తెలిసిన మిత్రుడు చేబదులిస్తాడు. బస్తీ పెద్ద ఎవరో వడ్డీకి అప్పు కూడా ఇవ్వవచ్చు. కానీ ఎంత కాలం గడుస్తుంది? రెండు నెలల లాక్‌డౌన్‌ తరువాత, ఎంతగా సడలింపులు ఇచ్చినప్పటికీ, జనజీవనం ఇంకా సాధారణ స్థాయికి చేరని దశలో, గతంలో ఇచ్చిన 1500 రూపాయలు కూడా లేని స్థితిలో ఎట్లా గడుస్తుంది? పట్నాలలోనే కాదు, పల్లెల్లో కూడా పేదలకు ఎన్నో నగదు అవసరాలుంటాయి, రెక్కాడితే కానీ గడవని వృత్తులుంటాయి. వీరందరి జీవితాల మీద పడ్డ వేటు చిన్నది కాదు. వలసకూలీలను ఆదుకున్నట్టు, వారిని ఒక నిర్దిష్ట సహాయంతో ఆదుకోలేము. నిజానికి వందలు, వేలు మైళ్ల నడక తరువాత, మంచి మనుషుల సహాయంతో ఏదో వాహనం దొరికి ఇళ్లకు చేరిన తరువాత, ఆ కార్మికులంతా ఇళ్ల దగ్గర ఎట్లా ఉన్నారో, ఆ పల్లెలన్నీ వారికి దీర్ఘకాలం ఆదరణ ఇవ్వగలవా?


కానీ, మనుషులుగా అందరూ, ముఖ్యంగా కాసింత చదువు, కొంత స్థితి, కొంత విచక్షణ కలిగిన వారు, లాక్‌డౌన్‌ అనంతర కరోనా విజృంభణ దశలో కూడా సాటివారికి సాయం చేసే మార్గాలు కనుగొనాలి. ప్రభుత్వాల చేత చేయించాలి కానీ, ప్రజలు స్వచ్ఛందంగా ఎంతకని చేయగలరు– అన్న ప్రశ్న వస్తుంది. ఆలోచించవలసిన ప్రశ్నే. పోనీ ప్రభుత్వాల చేత చేయించగలిగినవారు ఆ పని కూడా చేయవచ్చు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు, ప్రభుత్వం ద్వారా రేషన్‌ తదితర సహాయాలు పొందుతున్న వారి ఖాతాలకు నేరుగా నెలకు పదివేలు చొప్పున రెండు మూడు నెలలు జమ చేసినా, 20 లక్షల కోట్ల ప్యాకేజీ అర్థవంతంగా ఉండేది, ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవహించి, కొంత ఉద్దీపన కూడా జరిగేది. ఆత్మనిర్భరత పేరుతో ప్రకటించిన ప్యాకేజీలో విధాన ప్రకటనలు, దీర్ఘకాలిక కార్యక్రమాలు తప్ప, కరోనా బాధిత పేద ప్రజలకు ఒరిగేదేమీ లేకపోయింది. తలుపులు అన్నీ మూసివేసినప్పుడు, తన బాధ్యత ఉన్నదని భావించి ప్రభుత్వం ఎంతో కొంత విదిలించింది. ఇప్పుడు తలుపులు తెరిచాము అన్న తరువాత, ఆ నైతిక భారాన్ని కూడా వదిలించుకున్నది. ఇప్పటి భయంభయం జనజీవనంలో చిన్న చిన్న ఉపాధులెట్లా? బడుగు జీవితాలెట్లా?


ఎవరో ఒక సున్నిత మనస్కులు సామాజిక మాధ్యమంలో సూచించినట్టు– కరోనా విధ్వంసపు స్పృహతో అందరూ మెలగాలి. దానికి బాధితులయినవారి పట్ల సహానుభూతి ఉండాలి. పూర్తి లాక్‌డౌన్‌లో మీ అవసరాలను తీర్చిన కిరాణా కొట్టును మరచిపోకండి, తెరిచారు కదా అని బడా మాల్స్‌కు పరిగెత్తకండి. వీధి చివర ఉన్న టీ కొట్టుకు చిన్న గిరాకీ ఇవ్వడం, తోపుడు బండ్ల మీద పండ్లుకొనడం, కూరగాయలను చిన్న చిన్న అంగళ్ల నుంచే, జాగ్రత్తలు తీసుకునే సుమా, కొనడం చేయండి. గిరాకీ ప్రవాహాన్ని పెంచండి. చిన్న చిన్న కొనుగోళ్లే, చిన్నవారి దగ్గర చేయండి. మీ ఇళ్లలో పనిచేసే వారికి, మీకు సేవలు చేసేవారికి చిన్నచిన్న అప్పులివ్వండి, పెద్ద హృదయం ఉంటే తిరిగి ఇవ్వనక్కరలేని సాయమే చేయండి. స్పందన ఉన్నవారికి, తాము మెరుగుగా జీవిస్తున్న ఎరుక కలిగి ఇతరులతో పంచుకోవాలనుకునే తపన ఉన్నవారికి, ఏమి చేయాలో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దేవుడో, ప్రభుత్వమో, నాయకుడో మాత్రమే రక్షిస్తున్నాడా ఏమిటి, ఈ లోకాన్ని? మనమే, మనలోని మంచితనమే కదా దానికి ఇరుసు?

Updated Date - 2020-06-12T06:02:55+05:30 IST