హైకోర్టు సీజేగా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి ప్రమాణం

ABN , First Publish Date - 2021-01-07T09:06:50+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి ప్రమాణస్వీకారం చేశారు.

హైకోర్టు సీజేగా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి ప్రమాణం

  • చేయించిన గవర్నర్‌ హరిచందన్‌
  • ఆ వెంటనే పదవీ బాధ్యతల స్వీకరణ
  • జస్టిస్‌ ప్రవీణ్‌తో కలిసి కేసుల విచారణ
  • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా


అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం 10.15 నిమిషాలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామితో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ భానుమతి... జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామిని ఏపీ హైకోర్టుకి బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను చదివి వినిపించారు. ఏపీ హైకోర్టుకు బదిలీ కావడానికి ముందు ఆయన సిక్కిం చీఫ్‌జస్టి్‌సగా సేవలందించారు. ఏపీ హైకోర్టు చీఫ్‌జస్టి్‌సగా ఉన్న జేకే మహేశ్వరి..సిక్కిం హైకోర్టుకు బదిలీ కావడంతో, ఆయన స్థానంలో జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి నూతనంగా బాధ్యతలు స్వీకరించారు.


ఈ ఇద్దరూ సీకేలు బుధవారమే ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలను స్వీకరించారు. చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ఏపీ, తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తులు, పలువురు రాష్ట్ర మంత్రులు, అనేకమంది న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గవర్నర్‌, ముఖ్యమంత్రి వేర్వేరుగా చీఫ్‌జస్టిస్‌ అరూప్‌ని శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందించారు. బాధ్యతలు చేపట్టిన చీఫ్‌ జస్టి్‌సకు న్యాయమూర్తులు, న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో ధర్మాసనం పంచుకొని ఆయన కేసులను విచారించారు. 


చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌ నేపథ్యం.. 

చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి 1961 మార్చి 11న అస్సోంలోని జార్‌హట్‌లో జన్మించారు. గువాహటి యునివర్సిటీ పరిధిలోని కాటన్‌ కాలేజీ నుంచి 1981లో డిగ్రీ(ఎకనామిక్స్‌) పూర్తి చేశారు. 1985లో గువాహటి ప్రభుత్వ లాకాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం ఆగస్టు 16వ తేదీన అస్సోం, నాగాలాండ్‌, మేఘాలయ, మణిపూర్‌, త్రిపుర, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ప్రధానంగా సివిల్‌, క్రిమినల్‌, రాజ్యంగ, సర్వీస్‌ అంశాల కేసులు వాదించారు. 2004 డిసెంబరు 21న గౌహతి హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. అదే విధంగా గౌహతి హైకోర్టుకు స్టాండింగ్‌ కౌన్సిల్‌ గా పనిచేశారు.


అస్సోం ప్రభుత్వ విద్యాశాఖ సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2011 జనవరి 24వ తేదీన గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన... 2012 నవంబరు 7న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నాగాలాండ్‌, అస్సోం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. 2018 సెప్టెంబరు ఆరు నుంచి అక్టోబరు 29వ తేదీవరకు; 2019 మే24 నుంచి అక్టోబరు ఆరు వరకు గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 అక్టోబరు 15 నుంచి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతల్లో ఉన్నారు. తాజాగా అదే హోదాలో ఏపీ హైకోర్టుకు బదిలీ మీద వచ్చారు.  

Updated Date - 2021-01-07T09:06:50+05:30 IST