నాకు మద్దతివ్వండి!.. ‘ఆంధ్రజ్యోతి’ని విమర్శించండి

ABN , First Publish Date - 2020-08-09T08:37:33+05:30 IST

రిటైర్డ్‌ జడ్జిలు, ప్రస్తుత న్యాయమూర్తులను దుర్భాషలాడుతూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జస్టిస్‌ ఈశ్వరయ్య వివాదంలో కొత్త కోణం బయటపడుతోంది. తనకు మద్దతు ఇవ్వాలని, ఈ విషయం

నాకు మద్దతివ్వండి!.. ‘ఆంధ్రజ్యోతి’ని విమర్శించండి

  • జస్టిస్‌ ఈశ్వరయ్య వివాదంలో కొత్త కోణం
  • బీసీ సంఘాలపై ఒత్తిళ్లు, విన్నపాలు
  • సున్నితంగా తిరస్కరించిన ప్రతినిధులు
  • ఇది వ్యక్తిగతమని, బీసీ కోణం లేదని స్పష్టీకరణ

 (అమరావతి - ఆంధ్రజ్యోతి)

రిటైర్డ్‌ జడ్జిలు, ప్రస్తుత న్యాయమూర్తులను దుర్భాషలాడుతూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జస్టిస్‌ ఈశ్వరయ్య వివాదంలో కొత్త కోణం బయటపడుతోంది. తనకు మద్దతు ఇవ్వాలని, ఈ విషయం బయటపెట్టిన ‘ఆంధ్రజ్యోతి’కి వ్యతిరేకంగా మాట్లాడాలని ఆయన పలువురు బీసీ సంఘాల నేతలను కోరుతున్నట్లు తెలిసింది. వ్యక్తిగతంగా వ్యాఖ్యలు, విమర్శలు చేసి... వివాదం బయటపడగానే, ఈ విషయం మొత్తాన్ని వెనుకబడిన వర్గాలపై దాడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణతో జస్టిస్‌ ఈశ్వరయ్య సంభాషణల పూర్తి వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. జస్టిస్‌ ఈశ్వరయ్య వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ కుల సంఘాలను సంప్రదిస్తూ... ‘ఆంధ్రజ్యోతి’కి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని, పత్రికా ప్రకటనలు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే... ఆయన వెనుక ఉన్న శక్తులు, ఆయన ఉద్దేశాలు స్పష్టంగా ఉండటంతో  ఈ ‘పిలుపునకు’ సానుకూల స్పందన రాలేదని తెలిసింది. 


ఆ రోజు నుంచే ఒత్తిడి... 

జస్టిస్‌ ఈశ్వరయ్య ఫోన్‌ సంభాషణను శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. ఆ వెంటనే... హైదరాబాద్‌లో, విజయవాడలో బీసీ సంఘాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరిగాయి. దీనిని ‘బీసీలపై జరిగిన దాడి’గా చిత్రీకరించాలని సూచనలు అందాయి. ఒత్తిళ్లు కూడా వచ్చాయి. ‘ఇలాంటి సమయంలోనే మనమంతా ఏకం కావాలి. ఆంధ్రజ్యోతిపై నిరసన తెలపాలి’ అంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ... ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించిన బీసీ నాయకులు ఇందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.


‘‘జస్టిస్‌ ఈశ్వరయ్య ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన పలువురు జడ్జిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందులో బీసీలపై దాడి కోణం ఎక్కడుంది’’ అని తేల్చి చెబుతూ నిరసనలు, ఆందోళనల ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వలేదు. ప్రభుత్వ పెద్దల సొంత అజెండాను అమలు చేసేందుకు... సస్పెన్షన్‌లో ఉన్న దళిత జడ్జి రామకృష్ణపై ‘వల’ విసిరినట్లు ఆయన మాటల్లోనే స్పష్టమవుతోందని చెబుతున్నారు. నేరుగా న్యాయ వ్యవస్థపై బురదజల్లుతూ.. తనకు మద్దతు ఇవ్వాలంటే ఎలా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. ప్రభుత్వ పదవిలో ఉంటూ న్యాయమూర్తులపై జస్టిస్‌ ఈశ్వరయ్య చేసిన వాఖ్యలను బీసీ కోణంలో చూడటం సరికాదని రెండు రాష్ట్రాల్లోని అనేక మంది బీసీ నేతలు తేల్చిచెప్పారు.


ఒక వేళ వాటిని బీసీ కోణంలో చూడటమంటే, న్యాయ వ్యవస్థపై జస్టిస్‌ ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యలను సమర్థించడమే అవుతుందని తెలిపారు. ‘‘ఆడియో క్లిప్‌లో ఉన్న గొంతు తనది కాదని జస్టిస్‌ ఈశ్వరయ్య రుజువు చెయ్యగలిగితే... ఆయనకు మద్దతుగా రంగంలోకి దిగుతాం’’ అని మరి కొందరు బీసీ నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జస్టిస్‌ ఈశ్వరయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అంశంపై ఆయన ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా నియంత్రణ మండలి చైర్మన్‌గానే తన అభిప్రాయాలు చెప్పుకోవాలని, కులం ప్రస్తావన తీసుకురాకుండా ఉంటేనే బాగుంటుందని పలువురు బీసీ నేతల నుంచి సూచనలు వెళ్లినట్లు తెలిసింది.

Updated Date - 2020-08-09T08:37:33+05:30 IST