నిబంధనలు కాదన్నా మరోసారి!

ABN , First Publish Date - 2021-06-21T09:07:15+05:30 IST

జస్టిస్‌ కనగరాజ్‌.. ఆంధ్రప్రదేశ్‌లో నిరుడు ఏప్రిల్‌ వరకు ఎవరికీ తెలియని పేరిది..

నిబంధనలు కాదన్నా మరోసారి!

65 ఏళ్లుదాటిన వారు పీసీఏ చైర్మన్‌గా అనర్హులు

అయినా 75 ఏళ్ల జస్టిస్‌ కనగరాజ్‌కు పట్టం

నియామక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

నాడు ఎస్ఈసీగా నియామకంలోనూ ఇంతే

(అమరావతి-ఆంధ్రజ్యోతి): జస్టిస్‌ కనగరాజ్‌.. ఆంధ్రప్రదేశ్‌లో నిరుడు ఏప్రిల్‌ వరకు ఎవరికీ తెలియని పేరిది.. అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తప్పించడం కోసం ఆగమేఘాలపై ఆర్డినెన్స్‌ తెచ్చి.. దేశవ్యాప్తంగా కొవిడ్‌ లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా.. రాత్రికి రాత్రి చెన్నై నుంచి విజయవాడకు తీసుకొచ్చి మరీ కొత్త కమిషనర్‌ను చేసిన జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు ఆయన కోసం మళ్లీ నిబంధనలను తోసిరాజంది. ఆయన్ను రాష్ట్ర పోలీసు కంప్లయింట్‌ అథారిటీ (పీసీఏ) చైర్మన్‌గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ ముఖ్య కార్యదర్శి, ఆపై స్థాయిలో పనిచేసి రిటైరైన ఐఏఎ్‌సలే కాకుండా రిటైర్డ్‌ జడ్జిని కూడా ఆ పోస్టుకు అర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టాన్ని మార్చి.. నిరుడు రాత్రికి రాత్రి ఆర్డినెన్స్‌ జారీ చేయడం.. తెల్లవారేసరికి ఎన్నికల కమిషనర్‌ గా జస్టిస్‌ కనగరాజ్‌ బాధ్యతల స్వీకారం వెంటవెంటనే జరిగిపోయిన సంగతి తెలిసిందే.


నాడు కొత్త కమిషనర్‌ను నియమించాలనుకుంటే.. రాష్ట్రంలో ముఖ్య కార్యదర్శి, ఆపై స్థాయిలో రిటైరైన వారు చాలా మందే ఉన్నారు. కేవ లం జస్టిస్‌ కనగరాజ్‌ కోసమే రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిని కూడా అర్హుడిని చేస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాతి పరిణామాల్లో ఆర్డినెన్స్‌ను న్యాయస్థానం కొట్టివేయ డం.. నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరించడంతో.. ఆయన మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. తన నియామకం రద్దు కావడంతో మూడు నెలలు తిరగకుండానే జస్టిస్‌ కనగరాజ్‌ చెన్నై తిరుగుపయనమయ్యారు. సుమారు ఏడాది తర్వాత ప్రభుత్వం మళ్లీ ఆయన్ను తెరపైకి తెచ్చి.. పీసీఏ చైర్మన్‌ పదవిని కట్టబెట్టింది. పోనీ ఈ నియామకమైనా సజావుగా జరిగిందా అంటే అదీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు కంప్లయింట్‌ అథారిటీ రూల్స్‌- 2020లోని సెక్షన్‌ 4(ఏ) ప్రకారం రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిని చైర్మన్‌గా నియమించాలి. అయితే ఆయన 65 ఏళ్ల వయసు వచ్చేవరకు.. లేదంటే మూడే ళ్లు.. ఏది ముందైతే అప్పటి వరకు ఆ పదవిలో ఉండొచ్చు. 65 ఏళ్లు దాటిన వారు ఈ పోస్టులో కొనసాగడానికి వీల్లేదు. కనగరాజ్‌ వయస్సు దాదాపు 75 ఏళ్లు. రూల్స్‌ ప్రకారం అయుతే ఆయన ఆ పోస్టుకు అనర్హులు.  


జిల్లాల్లోనూ అథారిటీలు

పీసీఏ చైౖర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌ మూడేళ్లు కొనసాగుతారని రాష్ట్రప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అథారిటీలో ఒక్కో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ఐపీఎస్‌ అధికారి, స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. వీరిని ప్రభుత్వం త్వరలో ఎంపిక చేస్తుంది. జిల్లా స్థాయిలోనూ పీసీఏలు ఏర్పాటవుతాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు పీసీఏని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీసులెవరైనా ప్రజల ఫిర్యాదులు స్వీకరించకపోయినా.. దర్యాప్తులో న్యాయం చేయకున్నా బాధితులు అథారిటీని ఆశ్రయించవచ్చు.  

Updated Date - 2021-06-21T09:07:15+05:30 IST