Abn logo
May 7 2021 @ 04:05AM

దేవరయాంజాల్‌ రైతులకు న్యాయం చేయాలి

అదనపు కలెక్టర్‌కు సంఘం వినతి 


శామీర్‌పేట, మే 6: ‘‘మా తాతల నాటి (1920) నుంచి ఈ భూముల్లో సాగు చేస్తున్నాం, మా భూములను మాకే చెందేలా న్యాయం చేయాలి’’ అని దేవరయాంజాల్‌ రైతు సమాఖ్య కోరింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంట మునిసిపాలిటీలోని దేవరయాంజాల్‌లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఐఏఎస్‌ అధికారులు రఘునందన్‌రావు, శ్వేతామహంతి, భారతీహోళికేరి, ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, రాష్ట్ర విజిలెన్స్‌, ఎండోమెంట్‌, రెవెన్యూ అధికారులు గురువారం వచ్చారు. అధికారులు ఆలయానికి సంబంధించి భూముల వ్యవహారంపై రికార్డులను పరిశీలించి, విచారణ జరిపారు.


ఈ సందర్భంగా ఆలయం వద్దకు వచ్చిన జిల్లా అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డిని ఆలయానికి సంబంధించిన భూములను సాగు చేస్తున్న పలువురు రైతులతో కలిసి రైతు సమాఖ్య నాయకులు పన్నాల వీరారెడ్డి, చింతల శ్రీనివా్‌సరెడ్డి కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. గత 100 ఏళ్లుగా ఎన్నో ప్రభుత్వాలు మారినా ఆ భూములకు సంబంధించిన రికార్డులను సరిచేసి ఇవ్వడం లేదని, ప్రస్తుతం కేసీఆర్‌ ప్రభుత్వానికి కూడా ఎన్నోసార్లు మొరపెట్టుకున్నామన్నారు. కానీ భూముల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  

Advertisement
Advertisement
Advertisement