నా కల మూడు నెలల్లో సాకారమవుతుందనుకోలేదు: జస్టిస్ ఎన్వీ రమణ

ABN , First Publish Date - 2021-08-21T01:16:20+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో అర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు తన కల అని, అది మూడనెలల్లోనే సాకారమవుతుందని అనుకోలేదని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ అన్నారు.

నా కల మూడు నెలల్లో సాకారమవుతుందనుకోలేదు: జస్టిస్ ఎన్వీ రమణ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు తన కల అని, అది మూడు నెలల్లోనే సాకారమవుతుందని అనుకోలేదని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ అన్నారు. ఈ రోజు తెలంగాణకు అదే విధంగా హైదరాబాద్ నగరానికి మరొక ముఖ్యమైన, చారిత్రాత్మకమైన రోజు అని  చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని అశోక్ విహార్ (తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసం) లో జరిగిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేంద్రం రిజిష్ట్రేషన్ కార్యక్రమంలో జస్టిస్ రమణ పాల్గొని మాట్లాడారు. నేను ఎప్పుడు అనుకోలేదు నా కల 3 నెలలలో సాకారమవుతుందని. దీనికి కారణమైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, చీఫ్ జస్టిస్ అఫ్ తెలంగాణ హిమా కోహ్లీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నేను జూన్ నెలలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా భాధ్యతలు తీసుకున్నాక ఇక్కడికి వచ్చానని, అప్పడు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం కొరకు ప్రతిపాధనలు పంపించవలసినదిగా కోరానని జస్టిస్ ఎన్వీరమణ తెలిపారు. 


ఎలాంటి ఆలస్యం లేకుండా జూన్ 30వ తేదీలోగా ఆర్బిట్రేషన్ కేంద్రం పై ప్రతిపాధనలు సమర్పించారని ఆయన చెప్పారు. దీనిపై  పరిశ్రమల ముఖ్య కార్యదర్శి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిలు జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు తో పలుమార్లు చర్చించారని అన్నారు. మొదటగా నేను ఇక్కడ జడ్జిగా ఉన్నప్పుడు నల్సార్ లో జరిగిన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అప్పటి జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా అప్పటి ముఖ్యమంత్రి 10 ఎకరాల భూమితోపాటు 25 కోట్లు రూపాయలు కేటాయించారు. కొన్ని అనివార్య పరిస్థితుల వలన అది కార్యరూపందాల్చలేదని అన్నారు. కాని ఇప్పుడు దానికి బదులుగా ఫైనాన్సియల్ జిల్లా ప్రాంతంలో కొంత భూమిని సొంత భవనం ఏర్పాటు చేసుకోవటానికి కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను జస్టిస్ ఎన్వీరమణ కోరారు.


భారత దేశంలో ఆర్ధిక సంస్కరణలకు పితామహుడైన తెలంగాణ బిడ్డ పి.వి.నర్సింహా రావు నాయకత్వంలో 1995 సంవత్సరంలో ఆర్ధిక సంస్కరణలు ప్రాంరంభమయ్యాయి. నేను ఇతర దేశాలకు చెందిన పెట్టుబడిదారులను ఇక్కడ పెట్టుబడులు పెట్టుమని అడిగితే వారు పెట్టడానికి సిద్దమే కాని ఇక్కడ లిటిగేషన్లు ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని భయపడుతున్నామని అన్నారని చెప్పారు. 1996 సంవత్సరంలో ఆర్బిట్రేషన్ చట్టం చేయటం జరిగిందని దీని ద్వారా ఆర్బిట్రేషన్ ప్రక్రియ వేగవంతమయిందని అన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రం మొదట 1926 సంవత్సరంలో పారిస్ లో ప్రారంభమయిందని తరువాత నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జస్టిస్ రమణ తెలిపారు.


ఈ మధ్యనే దుబాయ్ లో ప్రారంభమయిందని త్వరలో హైదరాబాద్ లో అమలులోకి వస్తుందని అన్నారు. హైదరాబాద్ లోని పరిస్థితులు ఈ కేంద్రం ఏర్పాటు కు చాలా అనుకూలమని ఇక్కడ వాతావరణం, సంస్కృతి, సాంకేతిక లభ్యత మొదలైనవి ఇందుకు దోహదపడుతాయని జస్టిస్ రమణ అన్నారు. ముఖ్యమంత్రి ఈ కేంద్రం ఏర్పాటు కు కావాల్సిన మౌళిక సదుపాయాలు, ఆర్ధిక సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి, చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీకి జస్టిస్ రమణ కృతజ్ఞతలు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టుజడ్జి జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామా రావు, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ , న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-21T01:16:20+05:30 IST