జస్టిస్ పతంజలి శాస్త్రి ధర్మ నిర్దేశం

ABN , First Publish Date - 2020-05-30T06:26:08+05:30 IST

‘పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే విషయంలో సదా మెలకువతో, ఏం జరుగుతుందో అన్న జాగరూకతతో నిరీక్షిస్తుండే రక్షకుడు (a sentinel on the qui vive) పాత్రను ఈ సర్వోన్న...

జస్టిస్ పతంజలి శాస్త్రి ధర్మ నిర్దేశం

‘పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే విషయంలో సదా మెలకువతో, ఏం జరుగుతుందో అన్న జాగరూకతతో నిరీక్షిస్తుండే రక్షకుడు (a sentinel on the qui vive) పాత్రను ఈ సర్వోన్నత న్యాయస్థానానికి మన మౌలిక శాసనం (భారత రాజ్యాంగం) అప్పగించిందని’ ద్వితీయ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పతంజలి శాస్ర్తి (1951--–54) ఉద్ఘాటించారు. ఈ సమున్నత పాత్రను నిర్వహించడంలో సర్వోన్నత న్యాయస్థాన నిబద్ధతకు పరీక్ష మళ్ళీ మళ్ళీ ఎదురవుతూనే వుంటుంది. డిమానిటైజేషన్, అధికరణ 370 రద్దు, కశ్మీర్ విభజన కేసులు సుప్రీంకోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలో జస్టిస్ పతంజలి శాస్త్రి నిర్దేశించిన ఉదాత్త కర్తవ్య నిర్వహణకు సర్వోన్నత న్యాయస్థానం కట్టుబడి వుండాలని దేశ ప్రజలు ముక్తకంఠంతో ఆకాంక్షిస్తున్నారు. 


న్యాయమూర్తులు ధర్మమూర్తులే (మినహాయింపులు ఉండవచ్చుగాక). మన గణతంత్ర రాజ్యం తొలినాళ్ళలో సర్వోన్నత న్యాయస్థానం నెలకొల్పిన ఒక ఉదాత్త ధర్మం గురించి ప్రస్తుత సందర్భంలో తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా వున్నది. 

వి.జి.రో ఒక బారిస్టర్ . మద్రాస్ హై కోర్టు ఆయన వృత్తి నెలవు. వామపక్ష భావజాలం వైపు మొగ్గు చూపే ఉదారవాది బారిస్టర్ రో. ప్రాకృతిక విజ్ఞానశాస్త్రాల స్ఫూర్తి వికాసానికి, రాజకీయ విద్యా చైతన్యానికి; కళలు, సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు అంకితమైన పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీని అభివృద్ధిపరిచిన వారిలో ఆయన ఒకరు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రజా జీవనాన్ని స్వేచ్ఛా భావన ఆవహించింది. ముఖ్యంగా అధికరణ 19 హామీ ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛ మొదలైన హక్కులు దేశ పౌరులలో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించి, అపూర్వ కార్యాచరణకు పురిగొల్పాయి. ‘ అసోసియేషన్లు లేక యూనియన్లను ఏర్పాటు చేసుకోవడం’ ఆ స్వేచ్ఛా హక్కులలో ఒకటి. 

కమ్యూనిస్టులను తీవ్రంగా వ్యతిరేకించే ఆనాటి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం 1950 మార్చి 10న ‘పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ని ‘చట్టవిరుద్ధ సంఘం’గా ప్రకటించింది. ‘ఇండియన్ క్రిమినల్ లా అమెండ్ మెంట్ ఆక్ట్-1908’ (అవును, వలసపాలనా కాలపు 1908 చట్టం) కింద ఆ ‘ప్రజాసంఘాన్ని’ నిషేధించారు. 1908 నాటి చట్టాన్ని, మద్రాసు ప్రభుత్వ ఉత్తర్వును హైకోర్టులో సవాల్ చేశారు. ఆ ఉత్తర్వు సమర్థింపరానిదన్న వాస్తవాన్ని గ్రహించిన మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. ‘‘ మాతృచట్టం నిబంధనలను ‘ పటిష్ఠ’ పరిచేందుకు, ‘సహేతుకమైన’ కార్యసరళిని సమకూర్చేందుకు’’ ఆ సవరణలను తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఒక న్యాయాత్మక కట్టుకథ తో పూర్వపు ఉత్తర్వులకు ఆ కొత్త సవరణలను అనువర్తింప చేశారు. 


మద్రాసు రాష్ట్ర ప్రభుత్వ ఈ కుతర్కం హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం (చీఫ్ జస్టిస్ రాజమన్నార్, జస్టిస్ సత్య నారాయణరావు, జస్టిస్ విశ్వనాథ శాస్త్రి) ముందు నిలవలేదు. 1950 మార్చి 10 నాటి ప్రభుత్వ ఉత్తర్వుకు తీసుకువచ్చిన సవరణలను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టులో మద్రాసు రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తిరస్కరించింది. ధర్మాసనం తరపున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పతంజలి శాస్త్ర్తి తీర్పును వెలువరిస్తూ ఇలా వక్కాణించారు: ‘ఈ దేశంలో న్యాయస్థానాలు ఇటువంటి అతిముఖ్యమైన, ఏ మాత్రం సులభసాధ్యం కాని కర్తవ్య పాలనకు వెనుకాడవు. శాసన వ్యవస్థపై ధర్మయుద్ధంచేయాలనే ఆకాంక్షతో గాక, రాజ్యాంగం న్యాయవ్యవస్థపై మోపిన కర్తవ్యాన్ని నిర్వహించేందుకే ఈ సంక్లిష్ట విధిని నిర్వహిస్తున్నాము. మరీ ముఖ్యంగా ‘ప్రాథమిక హక్కుల’కు సంబంధించిన వ్యవహారాలలో ఈ న్యాయస్థాన నిబద్ధత తిరుగులేనిది, అచంచలమైనది. ఎందుకంటే పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే విషయంలో సదా మెలకువతో , ఏం జరుగుతుందో అన్న జాగరూకతతో నిరీక్షిస్తుండే రక్షకుడు లేదా కావలివాడు (a sentinel on the qui vive) పాత్రను ఈ సర్వోన్నత న్యాయస్థానానికి మన మౌలిక శాసనం 


(భారత రాజ్యాంగం) అప్పగించింది’. ఇది, మన సుప్రీంకోర్టుకు ఎప్పటికీ శిరోధార్యమైన విజ్ఞతాయుత నిర్దేశం కాదూ? 

కాల క్రమంలో, మరే ఇతర దేశంలోనైనా మరే ఇతర సంస్థల వలే మన సర్వోన్నత న్యాయస్థానం కూడా పలు ముఖ్యమైన సందర్భాలలో తడబాటుపడింది. తప్పుడు తీర్పులు వెలువరించింది. ఇది వాస్తవం. అయితే జరిగిన పొరపాటును సత్వరమే గ్రహించి, అన్యాయాన్ని సరిదిద్ది, న్యాయాన్ని నిలబెట్టింది. తన నైతిక వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నది. ఇది మరీ నిజం. కనుకనే ఈ దేశ ప్రజలు , ఎన్ని లొసుగులు, లోపాలు ఉన్నప్పటికీ మన న్యాయవ్యవస్థలో, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానంలో పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగివున్నారు. ఎందుకీ ఉపోద్ఘాతం? ఇంకా తుది తీర్పులు వెలువడని, ఈ దేశంలో చట్టబద్ధ పాలన భవిష్యత్తును ప్రభావితం చేయగల రెండు కేసుల విషయంలో సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న విమర్శలను తగ్గించేందుకే నేను ఈ సుదీర్ఘ ప్రస్తావన చేశాను. ఆ రెండు కేసులలో మొదటిది డిమానిటైజేషన్ కేసు (పెద్ద నోట్ల రద్దు కేసు) 2016 నవంబర్ 8న రూ.1000, రూ.500 కరెన్సీ నోట్లు చట్ట విరుద్ధమైనవిగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం ప్రతి ఒక్కరికీ విదితమే. ఆ చర్య దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తిరోగమింపచేసింది. 2017-18 చివరి త్రైమాసికం లో స్థూల దేశియోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు పతనం ప్రారంభమయింది. ఆ దిగజారుడు వరుసగా ఏడు త్రైమాసికాల పాటు కొనసాగింది. ఎనిమిదో త్రైమాసికం (2020 జనవరి-మార్చి) లో కూడా అది మరింతగా పతనమయి వుంటుందనడంలో సందేహం అవసరం లేదు. ఇంతలో కరోనా వైరస్ విపత్తు విరుచుకుపడింది. మన దృష్టి అనివార్యంగా కరోనా నెదుర్కోవడంపై కేంద్రీకృతమయింది. అయితే ఒక పచ్చి నిజాన్ని మీరు విస్మరించకూడదు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ విధింపునకు పూర్వమే ప్రారంభమయిందన్నదే ఆ నిజం.. 


డి మానిటైజేషన్ ను సుప్రీం కోర్టులోనూ, పలు హైకోర్టులలోనూ పలువురు సవాల్ చేశారు. 2016 డిసెంబర్ 16న చీఫ్ జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఒక ఉత్తర్వును జారీ చేసింది. డిమానిటైజేషన్ కు వ్యతిరేకంగా దాఖలైన రిట్ పిటిషన్లను విచారణకు సుప్రీం కోర్టు స్వీకరించింది. తొమ్మిది కీలక ప్రశ్నలపై విచారణ జరపనున్నట్టు పేర్కొంది. హైకోర్టులలో పెండింగ్ లో ఉన్న ఇదే విధమైన కేసులను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరే న్యాయస్థానమూ డిమానిటైజేషన్ పై ఎటువంటి పిటిషన్ నూ ఆమోదించ కూడదని, సంబంధిత కేసులపై తీర్పులు వెలువరించకూడదని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. ప్రజాప్రాధాన్యంగల వ్యవహారం గనుక డిమానిటైజేషన్ పై పిటిషన్లన్నిటినీ ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపాలని చీఫ్ జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది. గత నాలుగు సంవత్సరాలుగా డిమానిటైజేషన్ కేసు వ్యవహారం దాదాపుగా అక్కడనే నిలిచిపోయింది. 

రెండో కేసు ‘జమ్మూ-కశ్మీర్ , అధికరణ 370’కు సంబంధించినది. 2019 ఆగస్టు 5న రాష్ట్ర పతి రెండు రాజ్యాంగ ఉత్తర్వులను జారీ చేశారు. అవి అధికరణ 370ని రద్దు చేశాయి; భారత రాజ్యాంగ నిబంధనలన్నిటినీ జమ్మూ-కశ్మీర్ కు వర్తింప చేశాయి. పర్యవసానంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆ సరిహద్దు రాష్ట్రంలో ఒక మహోపద్రవాన్ని సృష్టించాయి. జమ్మూ -కశ్మీర్ కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి రద్దయింది.; ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు; రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ ను విధించారు; శాసన మండలిని రద్దుచేశారు; శాసనసభనూ రద్దుచేశారు; రాష్ట్రపతి పాలనను తొలుత కొనసాగించి, ఆ తరువాత గవర్నర్ పాలనను ప్రవేశపెట్టారు; రాష్ట్ర మానవహక్కుల కమిషన్ మొదలైన శాసనవిహిత సంస్థలన్నిటినీ రద్దుచేశారు; వందలాది రాజకీయ నాయకులు, కార్యకర్తల ను నిర్బంధంలోకి తీసుకున్నారు (మెహబూబా ముఫ్తీ, సైఫుద్దున్ సోజ్ సహా పలువురు నాయకులు ఇప్పటికీ ఎటువంటి ఆరోపణలు లేకుండానే గృహనిర్బంధంలో మగ్గుతున్నారు);రాష్ట్ర చట్టాలలో పెనుమార్పులు చేశారు; మీడియా హక్కులతో సహా పలు పౌర హక్కులను తాత్కాలికంగా నిలిపివేశారు. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2020 మార్చి 2న ఒక ఉత్తర్వులో పిటిషన్లు లేవనెత్తిన నిర్దిష్ట ప్రాథమిక అభ్యంతరాలను తిరస్కరించింది. అధికరణ 370 రద్దు, కశ్మీర్ విభజనకు సంబంధించిన కేసులన్నిటినీ విచారణ చేపడతామని పేర్కొంది. ఇంతలో కరోనా కల్లోలం చెలరేగింది. మార్చి 25 నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. కశ్మీర్ విభజన సంబంధిత కేసులపై విచారణ ప్రారంభంకాలేదు. కశ్మీర్ లో ఇంటర్నెట్, 4 జిపై నిషేధానికి సంబంధించిన కేసులో మే 4న ఒక ఉత్తర్వు జారీచేయడం మాత్రం జరిగింది. 


పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే విషయంలో సదా మెలకువతో, ఏం జరుగుతుందో అన్న జాగరూకతతో నిరీక్షిస్తుండే రక్షకుడు లేదా కావలివాడు (a sentinel on the qui vive) పాత్రను నిర్వహించడంలో సర్వోన్నత న్యాయస్థాన చిత్తశుద్ది, నిబద్ధత మళ్ళీ మళ్ళీ పరీక్షింపబడుతూనే వుంటుందనే వాస్తవాన్ని స్పష్టంగా పేర్కొనడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. దేశ సర్వోన్నత న్యాయస్థానం తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వహించడంలో ఎప్పటికీ ఎట్టి పరిస్థితులలోనూ ఏ విధంగానూ వెనుకాడకూడదు. ప్రస్తావిత రెండు కేసులతో సమానమైన ప్రాధాన్యమున్న ఇతర అంశాలు కూడా ఇటీవల కోర్టుల ముందుకు వచ్చాయి. అయితే అవి ఇప్పుడు సంభవిస్తున్న సంఘటనలు గనుక వాటిపై నా వ్యాఖ్యను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాను. భవిష్యత్తులో వాటిపై నా భావాలు, అభిప్రాయాలు భవిష్యత్తులో విపులంగా వెల్లడిస్తాను. సరే, ఇప్పుడు దేశ పౌరులందరూ ముక్తకఠంతో ఆకాంక్షిస్తున్నదేమిటి? ‘ భారత గణతంత్ర రాజ్య సర్వోన్నత న్యాయస్థాన ద్వితీయ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పతంజలి శాస్త్రి నిర్దేశించిన ఉదాత్త కర్తవ్య నిర్వహణకు దేశంలోని ఉన్నత న్యాయస్థానాలు సుదృఢంగా కట్టు బడి వుండాలన్నదే కాదూ? 





పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-05-30T06:26:08+05:30 IST