Abn logo
Oct 14 2021 @ 03:01AM

హైకోర్టు సీజేగా జస్టిస్‌ పీకే మిశ్రా ప్రమాణం

ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించిన సీఎం 


అమరావతి, విజయవాడ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా బదిలీపై వచ్చారు. బుధవారం విజయవాడలోని తుమ్మల్లపల్లి కళాక్షేత్రంలో ఆయనతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత జాతీయగీతాన్ని పోలీసు బ్యాండ్‌తో ఆలపించారు. జస్టిస్‌ పీకే మిశ్రాను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ భానుమతి చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను సత్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ బి.దేవానంద్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందరావు, జస్టిస్‌ దుర్గాప్రసాద్‌, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, జస్టిస్‌ ఎం.గంగారావు, జస్టిస్‌ కె.లలిత, జస్టిస్‌ మఠం వెంకటరమణ, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, వల్లభనేని బాలశౌరి, అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌, వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి, జడ్పీ చైర్మన్‌ హారిక, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

దుర్గమ్మను దర్శించుకున్న సీజే: ప్రమాణస్వీకారం అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పీకే మిశ్రా కుటుంబసభ్యులతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జి.వాణీమోహన్‌, జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద పండితులు వేదాశీర్వచనాన్ని అందజేశారు. 

ఆలయ ఈవో భ్రమరాంబ అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పైలా సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు.