Abn logo
Apr 7 2021 @ 02:31AM

సుప్రీం పీఠానికి తెలుగు వెలుగు

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ 

రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు

48వ సీజేగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియామకం

ఈనెల 24న రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం

55 సంవత్సరాల తర్వాత మరోసారి ‘తెలుగు కీర్తి’

వచ్చే ఏడాది ఆగస్టు 26 దాకా పదవీకాలం

విద్యార్థి ఉద్యమాలు.. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం

ప్రజాప్రయోజన వ్యాజ్యాలతో న్యాయవాదిగా పేరు

చరిత్రాత్మక తీర్పులతో న్యాయమూర్తిగా గుర్తింపు 


అమ్మ భాషకు అభిమాని... 

జస్టిస్‌ రమణకు మాతృభాషపై మమకారం ఎక్కువ. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం తెలుగులోనే సాగింది. సభలు, సదస్సుల్లోనూ తప్పనిసరైతే తప్ప ఆంగ్లంలో మాట్లాడరు. ఢిల్లీలో తన అధికార నివాసం ముందు ఇంగ్లీషుతోపాటు తెలుగులోనూ ఆయన పేరు ఉంటుంది. తెలుగులో మాట్లాడటానికి, కేసులను తెలుగులో వాదించటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. మాతృభాషలోనే తీర్పులు ఉంటే ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని బలంగా నమ్ముతారు. తెలుగులో న్యాయపాలనకు ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. జుడీషియల్‌ అకాడమీ అధ్యక్షుడిగా... అధికార భాషా సంఘంతో కలిసి ‘తెలుగులో న్యాయపాలన’ అనే అంశంపై హైదరాబాద్‌లో ఒకరోజు సెమినార్‌ నిర్వహించారు. ఆయనకు తెలుగు సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రంపై అభిరుచి ఎక్కువ. ప్రముఖ నవలా రచయిత రావిశాస్త్రి రచనలు ఆయనకెంతో ఇష్టం. న్యాయవ్యవస్థ గురించి రావిశాస్త్రి రాసిన రచనల్ని చదవాలని న్యాయవాదులకు చెబుతారు. 


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): భారత దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని అచ్చ తెలుగు బిడ్డ అధిష్టించడం ఖాయమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదేశాలు జారీ చేశారు. దాని మేరకు కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి బరుణ్‌ మిశ్రా మంగళవారం ఉదయం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ‘‘భారత రాజ్యాంగంలోని 124వ అధికరణ క్లాజు 2 ప్రకారం తనకు సంక్రమించిన అధికారాల ప్రకారం రాష్ట్రపతి...  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 2021 ఏప్రిల్‌ 24వ తేదీ నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయి’’ అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.


దీంతో ఐదున్నర దశాబ్దాల తర్వాత ఒక ఆంధ్రుడు మళ్లీ దేశంలో అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్టించడం ఖరారైంది. 1966లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జస్టిస్‌ కోకా సుబ్బారావు భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు... 55 సంవత్సరాల తర్వాత కృష్ణా జిల్లాకు చెందిన జస్టిస్‌ ఎన్వీ రమణ భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్‌ జడ్జిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం రివాజు. సీజే పదవిలో ఉన్న న్యాయమూర్తి... సీనియారిటీలో తన తర్వాతి స్థానంలో ఉన్న జడ్జిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కేంద్రానికి సిఫారసు చేస్తారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ఈనెల 23న పదవీ విరమణ చేయనున్నారు.


తన తర్వాత అత్యంత సీనియర్‌ జడ్జిగా ఉన్న జస్టిస్‌ ఎన్వీ రమణను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేస్తూ జస్టిస్‌ బాబ్డే గత నెల 24వ తేదీన కేంద్రానికి లేఖ రాశారు. ఆ వెంటనే... జస్టిస్‌ రమణను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు అవసరమైన కసరత్తు మొదలైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదంతో మంగళవారం దీనిపై కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ లాంఛనంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 24వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో జరిగే అధికారిక కార్యక్రమంలో జస్టిస్‌ రమణ  చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.  జస్టిస్‌ ఎన్వీ రమణ వచ్చే ఏడాది ఆగస్టు 26న పదవీ విరమణ చేస్తారు. అంటే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 16 నెలలకుపైగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.


జస్టిస్‌ రమణ న్యాయ పయనం..

1983 ఫిబ్రవరి 10 న్యాయవాదిగా నమోదు

2000 జూన్‌ 27 ఏపీ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు

2013 సెప్టెంబరు 2 ఢిల్లీ హైకోర్టు సీజేగా నియామకం

2014 ఫిబ్రవరి 7 సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు

2021 ఏప్రిల్‌ 24 భారత చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు

Advertisement
Advertisement
Advertisement