Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘న్యాయ’ పగ్గాలు అవసరమే!

సమస్య నమ్మకానికి సంబంధించినది. అపనమ్మకం బలంగా ఉన్నప్పుడు, ఏమి చేసినా, చేయాలని ప్రయత్నించినా చిత్తశుద్ధి ధ్వనించదు. కొవిడ్ నిర్వహణ విషయంలో కేంద్రప్రభుత్వం తీరు సరిగా లేదని సుప్రీంకోర్టు భావించి, అందుకు అనుగుణంగా వ్యాఖ్యలు, నిర్ణయాలు చేయడం మొదలుపెట్టింది. గత ఏడేళ్ళ కాలంలో అత్యున్నత న్యాయస్థానం ఎన్నడూ చేయని విధంగా కేంద్రప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టి ప్రశ్నిస్తున్నది. అది మంచిదా కాదా అన్నది లోతుగా చేయవలసిన చర్చ. ‘మీరు ఎక్కువగా కల్పించుకోకండి, కొవిడ్‌కు సంబంధించిన అంశాల నిర్వహణలో అనేక సవాళ్లు ఉంటాయి, వాటిని ఎదుర్కొనడానికి కేంద్రంలోని, రాష్ట్రంలోని కార్యనిర్వాహక వర్గాలు నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది’ అని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలియజెప్పింది. నిజమే, ప్రజాస్వామ్యంలోని మూడు ముఖ్యవ్యవస్థలూ ఎవరి పరిధిలో వారు పనిచేయాలి. శాసనకర్తలు, అధికారయంత్రాంగం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షిస్తూ ఉండడం, అందుకు అనుగుణంగా న్యాయనిర్ణయాలు చేయడం మాత్రమే న్యాయవ్యవస్థ పరిధి కావచ్చును. కానీ, గత ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో, న్యాయవ్యవస్థ అనేక సందర్భాలలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, రాజ్యాంగబద్ధతను కాపాడడానికి జోక్యం చేసుకోవలసి వచ్చింది. రాజ్యాంగ విలువలను తగినట్టుగా వ్యాఖ్యానించి మరీ న్యాయస్థానాలు కల్పించుకోవలసి వచ్చింది. కొవిడ్ విషయంలో కేంద్రప్రభుత్వం సరళిపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదన్న సూచనలు కూడా న్యాయవ్యవస్థకు అంది ఉంటాయి. మరెవరూ ఈ అంశాలలో కల్పించుకునే అవకాశం లేదని తెలిశాక, సుప్రీంకోర్టు క్రియాశీలంగా, కొంత కఠినంగా కూడా కేంద్రాన్ని నిలదీసింది. జాతీయ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టిఎఫ్)ను ఏర్పరచింది. 


రాజకీయ నాయకత్వం ఆధ్వర్యంలో పరిపాలన జరగడమే ఉత్తమమైన పద్ధతి. ప్రస్తుతం ఉన్నటువంటి విపత్కర పరిస్థితులను అనేక కోణాలలో చూసి, ప్రజాభీష్టానికి, ప్రజాశ్రేయస్సుకు తగిన నిర్ణయాలు పాలకులు తీసుకోవాలి. పాలకుల నిర్ణయాలు కూడా సమష్టిగా చర్చించి తీసుకున్నవి అయి ఉండాలి. ప్రధానమంత్రి తన తోటి మంత్రివర్గ సభ్యులతో ఏ మేరకు సంప్రదింపులు జరుపుతున్నారో తెలియదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దృశ్యసమావేశాలు ఏ మేరకు సమాన స్థాయిలో జరుగుతున్నాయో తెలియదు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అన్నట్టు, ఆ సమావేశాలన్నీ ఏకపక్షంగా జరుగుతున్నాయేమో, శ్రవణానికే తప్ప భాషణానికి ముఖ్యమంత్రులకు ఆస్కారం లేదేమో తెలియదు. కొవిడ్ కారణంగా గత పద్నాలుగు నెలలుగా ఉత్పన్నమయిన సమస్యలను ఎదుర్కొనడంలో కేంద్రానికి, రాష్ట్రాలకు ప్రయోజనాల ఘర్షణ ఏర్పడింది. జిఎస్‌టి పరిహారం దగ్గర నుంచి, రాష్ట్రాల రుణపరిమితి పెంపుదల దాకా మొదటి దశలో వివాదాలు రాగా, తరువాత టీకాల, ఔషధాల కోటా, ఆక్సిజన్ సరఫరా వంటి అంశాలలో సమస్యలు వచ్చాయి. రాష్ట్రాలకు మేము తగిన సూచనలు ఇచ్చాము, అవి వాటిని ఖాతరు చేయలేదని కేంద్రం, రెండో దశ ముప్పు ముందే తెలిసి కూడా మేల్కొనలేదని రాష్ట్రాలు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి. వీటన్నిటి నడుమ, సకల పక్షాలతో, మేధావులతో, నిపుణులతో జాతీయ కమిటీయో, వేదికో, టాస్క్ ఫోర్సో ఏర్పడి ఉండవలసింది. కానీ, మొత్తం వ్యవహారంలో పారదర్శకత లేకపోవడం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. టెస్టుల లెక్క, పాజిటివిటీల లెక్క, మరణాల లెక్క అన్నీ అనుమానాస్పదంగానే ఉంటున్నాయి. ఈ విపత్తు కోసం ప్రత్యేకంగా ఏర్పరచిన పిఎం కేర్స్ నిధి గురించి ఎవరూ అడగకూడదు. టీకాల ఉత్పత్తిని ఇబ్బడి ముబ్బడి చేయడానికి కావలసిన నిర్వాహక పెట్టుబడిని సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు, భారత్ బయోటెక్‌కు అందించడానికి ఏడాది సమయం అవసరమా? సమస్త అధికారాలను గుప్పిట్లో పెట్టుకుని కూడా కేంద్రప్రభుత్వం సకాలంలో చేయవలసిన పనులు అనేకం చేయలేదు. ఇవాళ పరిస్థితి ఇట్లా ముంచుకువచ్చిందంటే అందుకు కారణం కేంద్రప్రభుత్వమే. దీన్నంతా గమనిస్తూ ఉన్నది కాబట్టే సర్వోన్నత న్యాయస్థానం తాను స్వయంగా రంగంలోకి దిగవలసివచ్చింది. సుప్రీంకోర్టుకు స్వయంగా ఏ యంత్రాంగమూ ఉండదు, ప్రభుత్వాలే క్షేత్రస్థాయిలో పనిచేయాలి, కాకపోతే, సుప్రీంకోర్టుకు జవాబుదారీగా ఉండాలి. సరే, రేపు కేంద్రం వాదనను పరిగణనలోకి తీసుకుని, సుప్రీంకోర్టు ఒక అడుగు వెనకకు తీసుకున్నప్పటికీ, కేంద్రప్రభుత్వంలో ఒక కదలికను తెచ్చిన ఘనత న్యాయవ్యవస్థదే అవుతుంది. 


నిర్వర్తించవలసిన బాధ్యతలు నెరవేర్చకపోతే, కోర్టులు ఏమి చేయాలి? నిలదీయవలసిన ప్రతిపక్షాలు, పౌరసమాజం ఏదో కారణం చేత బలహీనంగా ఉన్నాయనుకుందాం, అప్పుడు ప్రభుత్వాలను అదిలించవలసింది ఎవరు? మహిళా కమిషన్ అధ్యక్షురాలి నియామకానికి ఏళ్ల తరబడి జాగు చేస్తుంటే, అది రాజ్యాంగబద్ధతకు, సమానత్వ హక్కులకు భంగకరమే కదా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవులన్నీ ఖాళీ అయి నెలలు గడుస్తున్నా నిద్రపోతుంటే, కల్పించుకుని నిరుద్యోగులకు కొంత మనోస్థైర్యాన్ని ఇవ్వడం సత్పరిపాలనకు దోహదం చేయడమే కదా? ఆ రీతిలోనే తెలంగాణ ప్రభుత్వం విషయంలో కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కరోనా కట్టడికి మార్గనిర్దేశనాలు చేయడం మొదలుపెట్టింది. కానీ, స్పందన అంతంత మాత్రమే. ఒక చర్చ లేదు, ఒక సమీక్ష లేదు, ఒక పాలకుడు లేదా ఒక అధికారి చేతిలోనే నిర్ణయాధికారాలు కేంద్రీకృతమయ్యాయి. లాక్‌డౌన్ వల్ల ఫలితం లేదని నిర్ధారించినా, లేదు, లాక్‌డౌన్ విధిస్తున్నామని నిర్ణయించినా అందుకు ప్రాతిపదికలు వ్యక్తి కేంద్రిత నిర్ణయాలే. సమావేశాలలో పదిమంది కనిపిస్తున్నా, అక్కడ జరిగేది ఏకపక్ష సంభాషణలే. ఏదో కఠినమైన ఆంక్షల నిర్ణయాన్ని తీసుకోవాలని హైకోర్టు సూచించినంత మాత్రాన, ఒకే ఒక్కరోజు వ్యవధి ఇచ్చి లాక్‌డౌన్‌ ప్రకటించమని కాదు కదా? ఆలోచించి ఉంటే అసౌకర్యాలకు తావు లేకుండా లాక్‌డౌన్‌లోకి సమాజాన్ని నడిపించడం సులువు అయ్యేది. మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని మందలించిన తీరు ఎంతో నిష్కర్షగా, కఠినంగా ఉన్నది. కొన్ని దశాబ్దాల కిందట ఇటువంటి అక్షింతలు పడితే, ప్రభుత్వం రాజీనామా చేసి వెళ్లిపోవలసి వచ్చేది.

Advertisement
Advertisement