మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌ రావు మృతి

ABN , First Publish Date - 2020-05-11T10:29:38+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌ రావు (92) ఆదివారం తెల్లవారుజామున కన్ను మూశారు.

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌ రావు మృతి

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

పాల్గొన్న మంత్రులు హరీష్‌ రావు, ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి


కరీంనగర్‌ అర్బన్‌/కరీంనగర్‌ రూరల్‌/జగిత్యాల/ధర్మపురి, మే 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌ రావు (92) ఆదివారం తెల్లవారుజామున కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మృతివార్త తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ చల్మెడ ఆస్పత్రికి చేరుకొని ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆదివారం అధికార లాంఛనాలతో ఆయన స్వగ్రామమైన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జగిత్యాల  కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్‌ రాజేశం, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్‌ కుమార్‌, విద్యాసాగర్‌ రావు, శ్రీధర్‌బాబు, పెద్దపెల్లి జడ్పీ చైర్మెన్‌ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యేలు హాజరై నివాళులర్పించారు.


సర్పంచ్‌ నుంచి అమాత్యుడి వరకు..

జువ్వాడి రత్నాకర్‌ రావు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో 1929లో అక్టోబరు 4న జన్మించారు. ఆయ నకు భార్య సుమతి, కుమారులు నర్సింగారావు, కృష్ణారావు, చంద్రశేఖర్‌ రావు ఉన్నారు. హెచ్‌ఎస్సీ చదువుకున్న ఆయన స్వాతంత్ర్యానికి ముందు పలు ఉద్యమాల్లో పని చేశారు. 1952లో సోషలిస్ట్‌ పార్టీలో చేరిన ఆయన 1953లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ సభ్యుడిగా, కార్యదర్శిగా, ఏఐసీసీ సభ్యుడిగా పని చేశారు. 1966లో తిమ్మాపూర్‌ సర్పంచ్‌గా ఎన్నికైన ఆయన 1977 వరకు కొనసాగారు. 1977 నుంచి 1983 వరకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నృసిం హ స్వామి దేవస్థానం చైర్మన్‌గా పని చేశారు. 1981లో జగిత్యాల సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1989లో బుగ్గారం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా  పోటీ చేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989 నుంచి 1994 వరకు వ్యవసాయ విశ్వ విద్యాలయం బోర్డు మెంబర్‌గా పని చేశారు. 1994లో బుగ్గారం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999, 2004 ఎన్నికల్లో బుగ్గారం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2007లో వైఎస్‌ కేబినేట్‌లో దేవాదాయ, ధర్మాదాయ, స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రిగా 2009 వరకు పని చేశారు. అదే సమయంలో దూప దీప నైవేద్య పథకానికి రూ పకల్పన చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో మెట్‌పల్లి, బుగ్గారం నియోజకవర్గాఆలు రద్దయి కోరుట్ల నియోజకవర్గంగా రూపాంతరం చెందగా, 2009లో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


పలువురి నివాళి

 మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, మంఽథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు, మాజీ డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ రత్నాకర్‌రావు మృతదేహం నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరుట్ల పశు వైద్య కళాశాలకు రత్నాకర్‌ రావు పేరును పెట్టాలని సూచించారు.  మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, మాజీ ఎంపీ కవిత, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజేశంగౌడ్‌, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌, ఓసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ పొలాడి రామారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి  కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, కాంగ్రెస్‌ నాయకులు చల్మెడ లక్ష్మీనర్సింహారావు, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, టీడీపీ కరీంనగర్‌ నియోజకవర్గ కన్వీనర్‌ కల్యాడపు ఆగయ్య, జగిత్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌, వైస్‌ చైర్మన్‌ హరిచరణ్‌రావు, జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి ప్రవీణ్‌,  టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజన్న రత్నాకర్‌ రావు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. 


స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్‌ గోదావరి వద్ద రత్నా కర్‌రావు అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ పక్షాన అధికార లాంఛనాలతో నిర్వహించారు. రత్నాకర్‌రావు ఆకాంక్ష మేరకు కరీంనగర్‌ నుంచి మధ్నాహ్నం తిమ్మాపూర్‌కు పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ప్రత్యేక వాహనంలో తీసుక వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2020-05-11T10:29:38+05:30 IST