Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేటి నుంచి జేవీవీ రాష్ట్ర మహాసభలు

 భువనగిరిలో రెండురోజులపాటు నిర్వహణ 

  33 జిల్లాల నుంచి హాజరుకానున్న ప్రతినిధులు 

భువనగిరిటౌన్‌, నవంబరు 26: జనవిజ్ఞాన వేదిక నాలుగో రాష్ట్ర మహాసభలు యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో నేటినుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ మహాసభలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇందుకోసం భువనగిరిశివారులోని ఎస్‌ఎల్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. సామాన్య ప్రజానీకంలో శాస్ర్తీయ ఆలోచన దృక్పథాన్ని పెంచడం, ప్రజాసంక్షేమంకోసం శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహించడం, ప్రకృతి, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, ప్రగతికి విఘాతంగా మారుతున్న మూఢ నమ్మకాలపై ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న జేవీవీ మహాసభలను విజయవంతం చేయాలని సంస్థ ప్రతినిధులు కోరారు. మహాసభలకు ఆహ్వాన సంఘం ముఖ్య ప్రతినిధిగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, అధ్యక్షుడిగా ఎలిమినేటి ఇంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల వరప్రసాద్‌ వ్యవహరించనున్నారు. మహాసభల్లో వివిధ అంశాలపై సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌ మోహన్‌రావు, ఎన్‌ఐఎం మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ మెహతాబ్‌ ఎం.బామ్‌జీ, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి మనోహర్‌ ప్రసాద్‌, సామాజిక శాస్త్రవేత్తలు ప్రొఫెసర్‌, తుంగరాజన్‌ తదితరులు ప్రసంగించనున్నారు. రాబోయే రెండేళ్లకు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోనున్నారు. 

మహాసభలను విజయవంతం చేయాలి 

శాస్త్రవిజ్ఞాన అభివృద్ధిక్రమమే మానవజాతి చరిత్ర. ప్రజలను చైతన్యపరిచేందుకు 1988లో జేవీవీ ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం తెలంగాణ శాఖను ప్రారంభించాం. శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులతోపాటు అన్ని రంగాలకు చెందిన 30వేల మందికి పైగా రాష్ట్ర జేవీవీ ప్రజాసైన్స్‌ ఉద్యమంలో భాగస్వామ్యులయ్యారు. ఈక్రమంలో భువనగిరిలో నిర్వహిస్తున్న నాలుగో రాష్ట్ర జేవీవీ మహాసభలను శాస్ర్తీయవాదులు విజయవంతం చేయాలి.   

- డాక్టర్‌ అందె సత్యం, జేవీవీ, రాష్ట్ర అధ్యక్షుడు


Advertisement
Advertisement