ప్రజల అవసరం తీరిపోయిందా సీఎం గారూ..?

ABN , First Publish Date - 2021-11-27T05:36:51+05:30 IST

వరదలతో పుట్టెడు కష్టంలో ఉన్న రైతు భుజం తట్టి భరోసా కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి లేదా అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు.

ప్రజల అవసరం తీరిపోయిందా సీఎం గారూ..?
మాట్లాడుతున్న నెహ్రూ, కొండబాబు

కాకినాడ సిటీ, నవంబరు 26: వరదలతో పుట్టెడు కష్టంలో ఉన్న రైతు భుజం తట్టి భరోసా కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి లేదా అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ  ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. సీఎం చర్యలతో ఆయనకు ప్రజల అవసరం తీరిపోయిందనే భావన కలుగుతోందని అన్నారు.  కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అధికారంలోకి రావడానికి వేల కిలోమీటర్ల పాదయాత్ర  చేసిన జగన్మోహనరెడ్డి ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం పలకరించేందుకు తీరిక లేదా అని ప్రశ్నించారు. బోర్ల కింద వరి సాగు చేయొద్దని ప్రభుత్వం చాలా ఆలస్యంగా చెప్పిందని, ఈ విషయాన్ని రెండు నెలల క్రితం చెప్పాలని అన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ఇప్పటికే రైతులు వరి సాగు చేశారన్నారు. కరువు కాటకాలతో అల్లాడిన రాయలసీమ ప్రాంతాల్లో ఎప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో వరదలు వచ్చి  రైతులు, అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే చేసి వెళ్లిపోవడం చాలా బాధాకరమన్నారు.     జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉండి కూడా రైతుల నష్టాన్ని అంచనా వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్యమంత్రి సలహాదారులు రాబోయే కాలంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడుతుందని మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అనేక సోలార్‌ పవర్‌ ప్లాంట్‌లు ఒడిదుడుకుల్లో ఉన్నాయని, ప్రభుత్వం వీటిని ఉపయోగించుకుని విద్యుత్‌ సంక్షోభం నుంచి బయట పడవచ్చన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి నష్టం అంచనాను కేంద్రానికి పంపాలన్నారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి ప్రజలకు కుడి చేత్తో వంద ఇచ్చి ఎడమ చేతితో వెయ్యి లాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఇచ్చిన గృహాలకు ఒన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ అంటూ డబ్బు వసూలు చేస్తున్నారని, ఎవరూ సొమ్ములు కట్టనవరం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా పట్టాలు ఇస్తుందన్నారు. 

Updated Date - 2021-11-27T05:36:51+05:30 IST