Abn logo
Sep 25 2021 @ 00:55AM

రాజీనామా యోచనలో తనకల్లు జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి

జడ్పీ చైర్మన పదవి దక్కకపోవడంతో అసంతృప్తి

నేడు రాజీనామా ప్రకటన చేసే అవకాశం

అనంతపురం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): అధికార పార్టీలో పదవుల పందేరం అసంతృప్తులకు దారితీస్తోంది. ఇప్పటికే ఎంపీపీ పదవులు దక్కని ఆ పార్టీ నేతలు రాజీనామాలు సమర్పిస్తుండగా... మరికొందరు సిద్ధపడుతున్నారు. ఆ పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీలోని అసంతృప్తి వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రకంపనలు జడ్పీటీసీ సభ్యుల రాజీనామాలకు దారితీస్తుండటం గమనార్హం. జడ్పీ చైర్మన పదవిని ఆశించినప్పటికీ... దక్కకపోవడంతో తనకల్లు జడ్పీటీసీ సభ్యు రాలు జక్కల జ్యోతి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ ముఖ్యుల ద్వారా అందిన సమాచారం. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినా గుర్తించకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే... ఓ వైపు జడ్పీ చైర్మన ఎన్నిక సాగుతున్న సమయంలోనే... తనకల్లు జడ్పీటీసీ సభ్యత్వానికి జక్కల జ్యోతి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు రాజీనామా పత్రాన్ని జడ్పీ సీఈఓకు సమర్పించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జ్యోతి భర్త జక్కల ఆదిశేషు ఆ పార్టీ పెద్దలను కలిసినప్పటికీ.. భరోసా ఇవ్వకపోవడంతో ఆ యన కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పదవులు ఆశించి దక్కకపోవడంతో వెల్లువెత్తుతున్న అసంతృప్తుల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో  చూడాలి మరి.