రాహుల్ గాంధీకి గట్టి కౌంటర్ ఇచ్చిన జ్యోతిరాదిత్య సింథియా

ABN , First Publish Date - 2021-03-09T19:56:03+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య

రాహుల్ గాంధీకి గట్టి కౌంటర్ ఇచ్చిన జ్యోతిరాదిత్య సింథియా

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా ఘాటుగా స్పందించారు. అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. ఆ రోజుల్లోనే శ్రద్ధపెట్టి ఉంటే, పరిస్థితులు వేరుగా ఉండేవని చెప్పారు. 


జ్యోతిరాదిత్య సింథియా గత ఏడాది మార్చిలో కాంగ్రెస్‌ను వదిలిపెట్టి, తన అనుచర ఎమ్మెల్యేలతో పాటు బీజేపీలో చేరారు. దీంతో మధ్య ప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది.  ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 


సోమవారం రాహుల్ గాంధీ కాంగ్రెస్ యువజన విభాగం సమావేశంలో మాట్లాడారు. జ్యోతిరాదిత్య సింథియాను పరోక్షంగా ప్రస్తావిస్తూ, పార్టీకి చాలా ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఆయన (సింథియా) కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే మధ్య ప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయి ఉండేవారని చెప్పారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో వెనుక వరుసలో కూర్చుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పని చేస్తూ సంస్థను బలోపేతం చేసే అవకాశం ఆయనకు అప్పట్లో ఉండేదన్నారు. ఏదో ఒక రోజు ముఖ్యమంత్రివవుతావని ఆయనకు తాను చెప్పానన్నారు. కానీ ఆయన వేరొక మార్గంలో వెళ్ళారన్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘‘రాసి పెట్టుకోండి. ఆయన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేరు. ఆ పదవి కోసం ఆయన మళ్ళీ కాంగ్రెస్‌లోకి రావలసిందే’’ అని చెప్పినట్లు తెలుస్తోంది. 


ఈ నేపథ్యంలో జ్యోతిరాదిత్య సింథియా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రస్తుతం ప్రదర్శిస్తున్న ఆందోళనను గతంలో తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే ప్రదర్శించి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవన్నారు. 


Updated Date - 2021-03-09T19:56:03+05:30 IST