కాబా... ఇప్పుడిలా!

ABN , First Publish Date - 2020-06-26T05:30:00+05:30 IST

సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న కాబా ప్రపంచంలోనే అతి పెద్ద మసీదుగా ఖ్యాతి పొందింది. అంతేకాదు భూమండలం మీద మొదటి ప్రార్థనా మందిరం ఇదేనని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది...

కాబా... ఇప్పుడిలా!

సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న కాబా ప్రపంచంలోనే అతి పెద్ద మసీదుగా ఖ్యాతి పొందింది. అంతేకాదు భూమండలం మీద మొదటి ప్రార్థనా మందిరం ఇదేనని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. ముస్లిమ్‌ల హజ్‌, ఉమ్రా (మక్కా తీర్థయాత్ర)లకు ఇదే కేంద్ర బిందువు. సుమారు మూడున్నర లక్షల చదరపు మీటర్ల పైచిలుకు విస్తీర్ణంలో ఉండే కాబా ఎప్పుడూ భక్త సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా హజ్‌ యాత్ర సందర్భంలో కాబా ఆవరణలో ఇసకేస్తే రాలనంత జనం ఉంటారు. అలాంటిది కరోనా మహమ్మారి కారణంగా కాబా ఇప్పుడు దాదాపు నిర్మానుష్యమైపోయింది. తెల్లటి పాలరాతి గచ్చులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేల ఏళ్ళ కాబా చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదని ఆ మసీదు వర్గాలు చెబుతున్నాయి. హజ్‌ యాత్రపై కూడా నియంత్రణలు ఈసారి అమలు అవుతున్నాయి.


ముస్లింల పవిత్ర నగరమైన సౌదీ అరేబియాలోని మక్కాకు భక్తులు చేసే యాత్రను ‘హజ్‌’ అంటారు. ఇస్లామ్‌ ధర్మానికి అయిదు మూల స్తంభాల్లో ఈ యాత్ర ఒకటి. ఆరోగ్యం, ఆర్థిక స్థోమత ఉన్న ముస్లిమ్‌లు జీవితంలో ఒకసారైనా చేయాలన్నది నిర్దేశం. యాత్రను ఇస్లామ్‌ కేలండర్‌లో 12వదైన అయిన జిల్‌హజ్జ నెలలో దీన్ని ఆచరిస్తారు. నలభై రోజులు సాగే ఈ పవిత్ర యాత్రకు అనుమతి అవసరం.


గతంలో కూడా...

హజ్‌ యాత్ర రద్దు కావడం చరిత్రలో ఇదే మొదటిసారి కాదు. వ్యాధులూ, ఘర్షణలూ, బందిపోట్లూ, ఆక్రమణదారుల దాడుల కారణంగా గతంలో అనేక సందర్భాల్లో ఈ యాత్ర రద్దు అయింది. సౌదీ రాజు అబ్దుల్‌ అజీజ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఆర్కైవ్స్‌ చెబుతున్న ప్రకారం చరిత్రలో కనీసం 40 సార్లు హజ్‌ యాత్ర రద్దు కావడమో, యాత్రికులను పరిమితమైన సంఖ్యలో అనుమతించడమో జరిగింది. ఈ ఏడాది కేవలం స్థానికంగా ఉన్న వెయ్యిమందిని మాత్రం అనుమతిస్తారట.


Updated Date - 2020-06-26T05:30:00+05:30 IST