ప్రపంచతంత్రంలో కాబూల్

ABN , First Publish Date - 2021-08-27T06:06:51+05:30 IST

సిఐఎ డైరెక్టర్ ఒకరు వెళ్లి కాబూల్‌లో తాలిబన్లతో రహస్యచర్చలు జరుపుతారు. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రత్యక్షంగా అఫ్ఘానిస్థాన్ వెళ్లారో లేదో తెలియదు కానీ, సుమారుగా రెండు నెలల నుంచి...

ప్రపంచతంత్రంలో కాబూల్

సిఐఎ డైరెక్టర్ ఒకరు వెళ్లి కాబూల్‌లో తాలిబన్లతో రహస్యచర్చలు జరుపుతారు. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రత్యక్షంగా అఫ్ఘానిస్థాన్ వెళ్లారో లేదో తెలియదు కానీ, సుమారుగా రెండు నెలల నుంచి ఆయన రాబోయే తాలిబన్ ప్రభుత్వం కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితుల మీదనే పనిచేస్తున్నారు. ఎప్పుడూ స్థానిక, దేశీయ వార్తల మీదనే ఆసక్తి చూపే చదువరులను, ప్రేక్షకులను మినహాయిస్తే, అఫ్ఘానిస్థాన్‌లో నేడు నెలకొన్న పరిస్థితి అనూహ్యమైనదీ, ఆశ్చర్యకరమైనదీ కాదు. చర్చలు, సంప్రదింపుల ద్వారా అంగీకారం పొందిన పర్యవసానాలే ఇవి. అంతో ఇంతో అనూహ్యత ఎక్కడంటే, అమెరికా పెట్టే బేడా సర్దుకోకముందే, తాలిబన్లు కాబూల్‌ను పట్టుకున్నారు.


ఇప్పుడిక, అఫ్ఘానిస్థాన్ భవితవ్యం ఏమిటని, అక్కడి అస్థిర పరిస్థితులలో ప్రజల భద్రత ఏ స్థాయిలో ఉన్నదని సమాచార, ప్రసార సాధనాలు చర్చిస్తున్నాయి కానీ, వాస్తవంలో, కుదుటపడ్డ తరువాత ఆ దేశం ప్రపంచరాజకీయాలలో, ఇరుగుపొరుగు సంబంధాలలో ఎటువంటి వైఖరి అనుసరిస్తుందన్నదే ప్రపంచదేశాలను కలవరపరుస్తున్న ప్రశ్న. ప్రపంచాన్ని ఉద్ధరించడం తెల్లవాడి బాధ్యత అని ఒకప్పుడు ఐరోపా వలసవాదులు అనుకున్నట్టు, ఇప్పుడు ప్రతి ఒక్క దేశమూ అఫ్ఘానిస్థాన్‌ను ఎట్లా స్థిరీకరించాలా అని ఆలోచిస్తున్నది. తాలిబన్ సాయుధబృందాలు పూర్తి అధికారం చేపట్టాక, తమకు అప్రియమైన పనులు చేయకుండా ఉండాలని కొందరు, తమతోనే వాణిజ్యసంబంధాలు పెట్టుకోవాలని మరికొందరు, ఆసియా ఖండంలోని భౌగోళిక రాజకీయాలను తారుమారు చేయరాదని ఇంకొందరు ఆశిస్తున్నారు. బలవంతులు కేవలం ఆశించడం మాత్రమే చేసి ఊరుకోరు, అందుకోసం కావలసిన ఒత్తిడులు కూడా ప్రయోగిస్తారు. అఫ్ఘానిస్థాన్‌లో అరాచకమనీ, అల్లకల్లోలమని, అంతర్యుద్ధమనీ, సభ్యతానాగరికతలకు ఇక చరమగీతమని ప్రపంచమంతా వినిపిస్తున్న గగ్గోలు కూడా ఈ ఒత్తిడులలో భాగమే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాదు, అమెరికా తనకు అఫ్ఘాన్‌లో జరిగిన దారుణ పరాభవాన్ని మరుగుపరచడానికి గందరగోళ వాదనలను ప్రయోగిస్తున్నదని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. 


అఫ్ఘానిస్థాన్‌కు పొరుగుకు పొరుగుదేశమైన భారత్‌ను ఈ సంక్షోభంలో భాగస్వామిగా ప్రపంచం గుర్తిస్తుందా? గుర్తించదేమోనన్న బెంగ మనదేశానికి ఉన్నది. అందుకనే, అన్ని దేశాల తలుపుతట్టి, మన ప్రమేయానికి ఉన్న హేతుబద్ధతను వక్కాణించవలసి వస్తున్నది. అఫ్ఘాన్ పోరాటానికి అండదండలిచ్చిన పాకిస్థాన్, చైనా అంటే కొత్త ప్రభుత్వానికి సానుకూల వైఖరి ఉండడం సహజం. అది కూడా భారత్ కలవరపాటుకు కారణం. అమెరికాతో చెట్టపట్టాలు వేసుకుని నడచిన చరిత్ర ఈ సందర్భంలో భారత్‌కు నష్టమే కలిగిస్తోంది. కాబూల్‌లోని భారత్ దౌత్యసిబ్బందిని సురక్షితంగా విమానాలెక్కించడానికి కూడా దోవల్‌కు అమెరికా పరపతి కావలసివచ్చింది. నెల రోజుల కిందట మన దేశానికి వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకిన్, దోవల్ సంప్రదిస్తూ ఉండే అమెరికా భద్రతా సలహాదారు జేక్ సులీవాన్ ఇద్దరూ అఫ్ఘాన్‌పై అమెరికా విధానంలో భారత్‌కు గొప్ప పాత్ర ఉంది అని భరోసా ఇచ్చినవారే. ఇప్పుడు అన్నీ ఖాళీచేసి వెళ్లిపోతున్న అమెరికాకే భవిష్యత్‌లో అఫ్ఘానిస్థాన్ విషయంలో ఎటువంటి ప్రమేయం ఉంటుందో తెలియనపుడు అమెరికా నేస్తంగా భారత్‌కు ఉండే పాత్ర ఏమిటి అన్న సందేహం సహజం. అంతర్జాతీయ ఒత్తిడుల వల్ల, అమెరికాకు ఇచ్చిన హామీల వల్ల కొన్ని విధానాల విషయంలో తాలిబన్లు రాజీకి రావచ్చు. కానీ, వారు ఒక ప్రభుత్వంగా స్థిరపడిన తరువాత, తమకు విశ్వసనీయ శక్తులనే ఆశ్రయిస్తారు. ఈ విషయంలో చైనా దూరదృష్టిని మెచ్చుకోవచ్చు. అఫ్ఘాన్‌ వాణిజ్య లోటు చిన్నది కాదు. అమెరికా ఇంతకాలం ఇస్తూ వచ్చిన బడ్జెట్ సహాయం ఇక ముందు ఉండదు. కాబట్టి, తాలిబన్లకు పెద్ద మిత్రుడు కావాలి. 


ఆ పెద్ద మిత్రుడికి అఫ్ఘానిస్థాన్‌లో ఉన్న వనరులు కావాలి. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, రక్షణ వంటి రంగాలకు ఆవశ్యకమైన అరుదైన ఖనిజాలు అఫ్ఘానిస్థాన్‌లో ఉన్నాయి. ఆ నిక్షేపాల విలువ లక్షలాది కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. ఆ ముడిసరుకుల ఆధారంగా నిర్వహించే తయారీ పరిశ్రమలలో చైనా అగ్రగామిగా ఉన్నది. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను మినహాయించి, తక్కిన ప్రపంచాన్నంతా చుట్టేయడానికి చైనా నిర్మిస్తున్న ‘బిఆర్ఐ’ ప్రాజెక్టుకు తాలిబన్లు పూర్తిగా సహకరించే అవకాశం కూడా ఉన్నది. ఆ ప్రాజెక్టుకు అభ్యంతరాలు చెబుతున్న భారత్ తన వైఖరిని సడలించుకోవలసి రావచ్చు. లేకపోతే, ఇరాన్‌తో సంయుక్తంగా చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు ఇబ్బంది కలగవచ్చు.


దక్షిణాసియాలో ఇరుగుపొరుగులో సత్సంబంధాలు పెద్దగా లేని భారత్, తనకు ప్రాంతీయంగా కూడా స్నేహితులు అవసరమన్న విజ్ఞతతో ఆచితూచి అడుగులు వేయాలి. చారిత్రకంగా ఎంతో సాన్నిహిత్యం ఉన్న అఫ్ఘానిస్థాన్‌తో సత్సంబంధాల కోసం ప్రయత్నించాలి.

Updated Date - 2021-08-27T06:06:51+05:30 IST