డ్రైనేజీలనూ వదలరా..?

ABN , First Publish Date - 2020-08-02T11:18:03+05:30 IST

డ్రైనేజీలనూ వదలరా..?

డ్రైనేజీలనూ వదలరా..?

మురుగుకాల్వల ఆక్రమణ.. వాటిపైనే వ్యాపారాలు

కుచించుకుపోతున్న కాలువలు, రోడ్లు

పారిశుధ్య పనులు.. మురుగు పారుదలకు అవరోధం

చోద్యం చూస్తున్న పట్టణ ప్రణాళిక యంత్రాంగం

పట్టణాల్లో దోమల వ్యాప్తికి ఇదీ ఓ కారణం


(కడప-ఆంధ్రజ్యోతి): కొండలు గుట్టలు ప్రభుత్వ పరంబోకు స్థలాలే కాదు.. చివరికి మురుగు కాలువలనూ వదలడంలేదు. మురుగు కాలువలు అక్రమించి మెట్లు, ర్యాంపులు నిర్మిస్తున్నారు. ప్రధాన వీధుల్లో బండలు ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. పట్టణ ప్రణాళిక అధికారులు ఆక్రమణలు తొలగించకపోవడంతో పారిశుధ్య కార్మికులు పూడిక తీయలేక చేతులెత్తేస్తున్నారు. డ్రైనేజీలు దోమల నిలయాలుగా మారాయి. పారిశుధ్యం కోసం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. పట్టణాల్లో మురుగు కాల్వల ఆక్రమణపై కథనం.

జిల్లాలో కడప నగరం, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల, రాయచోటి, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు పురపాలక సంఘాలు ఉన్నాయి. ఆయా పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీల నిర్మాణాల కోసం ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రజల రాకపోకలకు అనుగుణంగా డ్రైనేజీలపై అక్కడక్కడ స్లాబులు నిర్మించారు. మిగిలిన ప్రాంతాల్లో ఓపన్‌గా వదిలేశారు. డ్రైనేజీలు ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత పట్టణ ప్రణాళిక (టౌన్‌ ప్లానింగ్‌) విభాగం అధికారులది. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోకుండా, మురుగు నిల్వ ఉండకుండా చూడాల్సింది ప్రజారోగ్య శాఖ అధికారులది. 


ఎక్కడికక్కడ ఆక్రమణలు

కడన నరగరంతో పాటు మున్సిపల్‌ పట్టణాల్లోని ప్రధాన వీధుల్లో మురుగు కాలువలు అక్రమించి.. వాటిపై బండలు వేసి యథేచ్ఛగా వ్యాపారులు చేస్తున్నారు. కొన్ని వీధుల్లో కాలువలపైనే ఏకంగా మెట్లు, ర్యాంపు వంటివి నిర్మిస్తున్నారు. దీంతో రోడ్లు కుచించుకుపోయి ట్రాఫిక్‌ సమస్య జఠిలం అవుతోంది. అంతేకాదు.. వ్యర్థాలు డ్రైనేజీల్లో వేస్తుండడంతో కుళ్లి దర్గంధం వెదజల్లుతోంది. దోమలకు నిలయాలుగా మారాయి. దోమల బెడదతో ప్రజలకు కంటిపై కునుకు కరువవుతోంది. డ్రైనేజీలపై ఆక్రమణలు తొలగించి పారిశుధ్య పనులు, మురుగు పారుదలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన పట్టణ ప్రణాళిక విభాగం యంత్రాంగం మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు. 


ఆక్రమణల్లో కొన్ని


కడన నగరంలో ఏఎ్‌సఆర్‌ నగర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ ఏరియా, వై జంక్షన్‌, మెడ్రాస్‌ రోడ్డు, సెవన్‌రోడ్స్‌ సర్కిల్‌, హోమియోపతి కళాశాల రోడ్డు తదితర ప్రాంతాల్లో మురుగు కాలువలు ఆక్రమణకు గురయ్యాయి.


రాయచోటి పట్టణంలో కొత్తపల్లి, కొత్తపేట, బోస్‌నగర్‌, బట్టవీధి ప్రాంతాల్లో డ్రైనేజీలు ఆక్రమణలో ఉన్నాయి. 


ప్రొద్దుటూరు పట్టణంలో మడూరు కాలువ, కొత్తపల్లి కాలువ, దొరసానిపల్లి, ప్రొద్దుటూరు-1, 2 కాలువ ప్రాంతాల్లో డ్రైనేజీలు ఆక్రమణకు గురయ్యాయి. పట్టణంలో పలు చోట్ల కాలువలపైనే నిర్మాణాలు చేపట్టారు.


బద్వేలు పట్టణంలో సిద్ధవటం రోడ్డు, నెల్లూరు రోడ్డు, పోరుమామిళ్ల రోడ్డు, మైదుకూరు రోడ్డు ప్రాంతాల్లో మురుగు కాలువలను అక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు.


రాజంపేట మున్సిపాలిటీలో ఎర్రబెల్లి, రామ్‌నగర్‌, మన్నూరు, ఉస్మాన్‌నగర్‌, బలిజపల్లి, హైదర్‌నగర్‌, కొలిమివీధి, నూనేవారిపల్లి రోడ్డు ప్రాంతాల్లో మురుగు కాలువలు ఆక్రమణకు గురయ్యాయి.


మైదుకూరు పట్టణంలో ఎర్రచెరువు అలుగు ఆక్రమణకు గురైంది. 36 అడుగుల వెడల్పు ఉండాల్సి ఉండగా ఆక్రమణలవల్ల మూడు అడుగులకు కుచించుకుపోయింది. ఎక్కడికక్కడ మురుగు కాలువలు ఆక్రమించి వాటిపైనే వ్యాపారాలు చేస్తున్నారు. 


ప్రధాన మురుగు కాలువ కబ్జా చేశారు - నర్సమ్మ, ఏఎ్‌సఆర్‌ నగర్‌, కడప

ఏఎ్‌సఆర్‌ నగర్‌లో ప్రధాన మురుగు కాలువ కొన్నేళ్ల క్రితమే కబ్జా చేశారు. ఏఎ్‌సఆర్‌ నగర్‌ నుంచి ఎస్‌బీఐ కాలనీ మీదుగా బిల్టప్‌ ఏరియాలో పెద్ద కాలువలో కలవాలి. మధ్యలో ఆక్రమించేశారు. పరమేశ్వరా స్కూల్‌ నుంచి ఆచారి కాలనీకి వచ్చే హోమియోపతి కళాశాల రోడ్డు వరకు డ్రైనేజీ ఆక్రమణకు గురైంది. ఎక్కడ మురుగు అక్కడే ఆగి దుర్గంధం వెదజల్లుతోంది. వానొస్తే ఈ ప్రాంతం జలమయం అవుతోంది. 


ఆక్రమణలు తొలగించాలి - పి.వెంకటరమణ, బద్వేలు

బద్వేలు పట్టణంలో ప్రధాన మురుగుకాలువలు ఆక్రమణకు గురయ్యాయి. నాలుగురోడ్ల కూడలిలో డ్రైనేజీ కాలువలపై ఆక్రమణలు ఉండడంతో పారిశుధ్య కార్మికులు మురుగు కాలువలు శభ్రం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా మురుగంతా రోడ్లపైకి వస్తోంది.


ఆక్రమణలతో పారిశుధ్య సమస్య - షేక్‌ అల్లీషేర్‌, ఎర్రబల్లి, రాజంపేట

రాజంపేటలో అనేక చోట్ల డ్రైనేజీ కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. కాలువలపై ఉన్న ఆక్రమణల వల్ల పారిశుధ్య సమస్య ఏర్పడుతోంది. దీనివల్ల డ్రైనేజీ కాలువల్లో మురుగు నీరు నిలిచిపోయి దోమలు పెరుగుతున్నాయి. మున్సిపల్‌ అధికారులు స్పందించి కాల్వలపై ఉన్న ఆక్రమణలు తొలగించాలి.


ఆక్రమణలు గుర్తించి చర్యలు తీసుకుంటాం - కృష్ణసింగ్‌, పట్టణ ప్రణాళిక అధికారి, కడప కార్పొరేషన్‌ 

నగర పరిధిలో అక్కడక్కడ మురుగు కాలువలు ఆక్రమణకు గురైనట్లు మా దృష్టికి వచ్చింది. అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఔట్ల ద్వారానే కబ్జాకు గురవుతున్నాయి. మురుగు కాలువల ఆక్రమణలపై సర్వే చేస్తాం. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తాం. అప్పటికీ తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2020-08-02T11:18:03+05:30 IST