బియ్యం బొక్కేస్తున్నారు..!

ABN , First Publish Date - 2020-10-28T08:55:00+05:30 IST

పేదలకందాల్సిన బియ్యాన్ని కొందరు పెద్దలు బొక్కేస్తున్నారు. కార్డుదారులకు రిక్తహస్తం చూపించి వాటిని బ్లాక్‌మార్కెట్‌కు తరలించి రూ.కోట్లు పోగేసుకుంటున్నారు.

బియ్యం బొక్కేస్తున్నారు..!

 దారి మళ్లుతున్న రేషన్‌ బియ్యం

 డీలర్ల చేతివాటం

 కొన్ని చోట్ల కార్డుదారుల నుంచి కొనుగోలు

 పాలిష్‌ చేసి బెంగుళూరుకు తరలింపు

 బియ్యం మాఫియాకు అధికార పార్టీ అండ


(కడప - ఆంధ్రజ్యోతి ): పేదలకందాల్సిన బియ్యాన్ని కొందరు పెద్దలు బొక్కేస్తున్నారు. కార్డుదారులకు రిక్తహస్తం చూపించి వాటిని బ్లాక్‌మార్కెట్‌కు తరలించి రూ.కోట్లు పోగేసుకుంటున్నారు. బియ్యం మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన రెవెన్యూ, సివిల్‌ సప్లై అధికారులు నోట్లకు ఆశపడి చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలున్నాయి. రూపాయి బియ్యాన్ని పాలిష్‌ పట్టి ఎంచక్కా మార్కెట్‌లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కడప నగర శివార్లలోని పాలెంపల్లె వద్ద ఉన్న సప్తగిరి మోడరన్‌ రైస్‌మిల్లు, వరలక్ష్మి అగ్రి ఇండస్ర్టీస్‌లో మంగళవారం విజిలెన్స్‌ బృందం దాడులు చేయగా అక్కడ ఉన్న బియ్యం నిల్వ చూసి అధికారులకే కళ్లు బైర్లు కమ్మాయి. వంద క్వింటాళ్లు.. రెండు వందల క్వింటాళ్లు కాదు.. 50 కేజీల బస్తాలు 5210 దొరికాయి.


దాదాపు 2500 టన్నులకు పైగా బియ్యం నిల్వ ఉండడాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. మార్కెట్‌లో వీటి విలువ 91 లక్షల వరకు ఉంటుందని అధికారుల అంచనా. విజిలెన్స్‌ డీఎస్పీ శ్రీకాంత్‌, ఎస్‌ఐ రవికుమార్‌, విజిలెన్స్‌ ఎంపీడీవో ఖాదర్‌బాషా, సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ మిల్లులు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి వరుసకు బంధువుకు చెందినవిగా చెబుతున్నారు. విజిలెన్స్‌ దాడుల్లో పెద్ద ఎత్తున బియ్యం దొరకడంతో జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమాలపై చర్చ సాగుతోంది. జిల్లాలో 1739 చౌకదుకాణాలున్నాయి. అన్ని రకాల కార్డులు 8.31 లక్షలున్నాయి. రైస్‌కార్డులకు ప్రతి నెలా 12,200 టన్నులు బియ్యాన్ని పంపిణీ చేస్తారు. 


స్టాకు పాయింట్‌ల నుంచి అక్రమాలకు బీజం

పేదలకందాల్సిన బియ్యాన్ని కాజేసేందుకు స్టాకు పాయింట్ల నుంచే అక్రమాలు సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు డీలర్లు వారికి కేటాయించిన బియ్యంలో డీలర్లకిచ్చే బియ్యం బస్తా తూకాల్లో తేడాలున్నట్లు విమర్శలున్నాయి. 50 కేజీల ప్యాకెట్‌ 48 - 49 కేజీలే ఉంటున్నట్లు చెబుతున్నారు. డీలర్‌కు ఇచ్చే 50 కేజీల బస్తాలో దాదాపు రెండు కేజీలు తరుగు పోతోంది. ఆ తగ్గిన బియ్యాన్ని కొందరు డీలర్లు తూకాల్లో కిరికిరికి పాల్పడుతుండగా మరికొందరు కార్డుదారులకు ఇవ్వకుండానే బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్టాకు పాయింటు, కొందరు రెవెన్యూ అధికారులు, డీలర్ల కుమ్మక్కుతోనే గోల్‌మాల్‌ సాగుతున్నట్లు తెలుస్తోంది.


బియ్యం కొనుగోళ్లు

కొందరు డీలర్లు పల్లెల్లో పడి (ఒకటిన్నర కేజీ) 12 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. వాటిని బియ్యం మాఫియాకు రూ.16 నుంచి 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. కొందరైతే కార్డుదారులకే బియ్యం బదులు వేరే సరుకులు ఇస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని రైస్‌మిల్లులకు చేర్చి అక్కడ పాలిష్‌ పట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన బియ్యం పాలిష్‌ వ్యవహారం ఇప్పుడు పోరుమామిళ్ల, బద్వేలు, ప్రొద్దుటూరు, కడప, రాయచోటి, గాలివీడు, రైల్వేకోడూరు.


రాజంపేట ప్రాంతాలకు విస్తరించింది. ప్రొద్దుటూరు, పులివెందుల నుంచి కొందరు పాలిష్‌ పట్టి బియ్యాన్ని బెంగుళూరుకు తరలిస్తున్నారు. డీలర్ల వద్ద నుంచి బియ్యం కొనుగోలు, పాలిష్‌ పట్టి ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్‌పోర్టు చేస్తే కిలో బియ్యానికి రూ.30 వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ రూ.36లకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. కొందరు అధికారులు, రాజకీయ నాయకులకు వాటాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అధికార అండతో బియ్యం మాఫియా చెలరేగిపోతోంది. కడప, ప్రొద్దుటూరు, బద్వేలులో ఉండే మాఫియాకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు చెబుతున్నారు. 


క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.. సౌభాగ్యలక్ష్మి, డీఎ్‌సవో

పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే తహసీల్దార్లకు ఆదేశాలిచ్చాం. 


Updated Date - 2020-10-28T08:55:00+05:30 IST