ఈ వార్త హృదయాన్ని కలచివేసింది: పవన్

ABN , First Publish Date - 2021-05-08T20:39:25+05:30 IST

కడప జిల్లాలోని మామిళ్లపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే.

ఈ వార్త హృదయాన్ని కలచివేసింది: పవన్

అమరావతి: కడప జిల్లాలోని మామిళ్లపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈఘటన విషాదకరమన్నారు. జిలిటెన్ స్టిక్స్ పేలి 10 మంది మృత్యువాత పడ్డారనే వార్త హృదయాన్ని కలచివేసిందన్నారు. ఈ విషాదకర ఘటనలో చనిపోయినవారిని గుర్తించలేని పరిస్థితి ఉందని చెప్పారు. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ప్రభుత్వం తక్షణమే మృతుల కుటుంబాలకు న్యాయబద్ధమైన పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. గని యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  


కడప : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కలసపాడు మండలంలో మామిళ్లపల్లె గ్రామ శివారులో ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించింది. ముగ్గు రాళ్ల గనిలో ఉన్న 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ముగ్గురాళ్లను తొలగించడానికి పేలుడు పదార్థాలను వినియోగించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.



Updated Date - 2021-05-08T20:39:25+05:30 IST