కదిరి శనగ విరగ్గాసింది

ABN , First Publish Date - 2021-04-25T06:40:37+05:30 IST

ఒక వేరు శనగ చెట్టుకి సాధారణంగా 10 నుంచీ 40 కాయలు ఊరుతాయి.

కదిరి శనగ విరగ్గాసింది

తిరుపతి: ఒక వేరు శనగ చెట్టుకి సాధారణంగా 10 నుంచీ 40 కాయలు ఊరుతాయి. దిగుబడి అదిరింది అనుకోవాలంటే 50 కాయలు దిగుతాయి. అయ్యవారిపల్లి శంకర్‌ రెడ్డి పొలంలో మాత్రం చెట్టుకి 50 నుంచి 150 కాయలు దిగాయి. ఏ చెట్టు పెరికి చూసినా గుత్తులు గుత్తులుగా కాయలు కనిపిస్తున్నాయి. వాల్మీకిపురం సమీపంలోని అయ్యవారిపల్లెలో శంకర్‌రెడ్డి పేరు చెబితేనే, ప్రయోగాల రైతుగా అందరికీ ప్రసిద్ధి.  వ్యవసాయంలో ఆయనొక సంచలనం. నిరంతరం కొత్త పంటల వేటలో ఉంటారు. అధునిక వ్యవసాయ పద్ధతులు అన్వేషిస్తూ, అవలంభిస్తూ ఉంటారు.  తాజాగా ఒకరం పొలంలో కెఎల్‌ 1812 రకం వేరుశనగ విత్తనం నాటారు. ఇంకో పది రోజుల్లో పంట చేతికి  వస్తుంది. పొద్దస్తమానం పొలంలో గడిపే ఆ కుటుంబం కాయ ఎంత ఊరిందో చూద్దామని పెరికితే ఇదిగో ఇలా విరగకాసి కనిపించాయి. ఈ శనగ చెట్లు చూసి వారి ముఖాల్లో నవ్వులు విరబూశాయి. ‘కదిరి వ్యవసాయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన రకం ఇది. ఆరు నెలల కిందటే విడుదలైంది. గతంలోనూ కదిరి రకం వేరుశనగలో అధిక దిగుబడి సాధించిన నాకు ఈ కొత్త రకం పట్ల ఆసక్తి కలిగింది. దిగుబడి చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ రకం శనగ నాటినపుడు ఎరువుల ఖర్చు మాత్రం పెరుగుతుంది. అయినా దిగుబడితో పోలిస్తే అది నామమాత్రమే.’ అంటారు శంకర్‌రెడ్డి. గతంలోనూ ఎకరాకు వంద టన్నుల చెరకు దిగుబడి సాధించి రికార్డు సృష్టించారు శంకర్‌రెడ్డి. ప్రస్తుతం తన ఎకరా పొలంలో వేరుశనగ దిగుబడి 50 నుంచి 70 బస్తాల దాకా ఉండొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. సాధారణంగా నీటి ఆదరువుండే పొలంలో ఎకరాకు 40 బస్తాలు పండితే బాగా పండినట్టు.  ఎకరా విస్తీర్ణంలో పాలీహౌస్‌, మరొక ఎకరాలో షేడ్‌నెట్‌ నిర్మించుకుని వివిధ రంగుల చామంతి నారు పెంచి దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలకు వీరు సరఫరా చేస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులు కిరణ్‌, కిషోర్‌లు వెన్నంటి ఉండడంతో నిరంతరం కొత్త పంటలపై దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం ఎకరా విస్తీర్ణంలో రంగు లిల్లీలు నాటారు. లిల్లీపూలలో తెలుపు మాత్రమే అందరికీ తెలుసు. ఈయన గులాబి, పసుపు రంగు లిల్లీపూల సాగుకు శ్రీకారం చుట్టారు. శంకర్‌రెడ్డి వ్యవసాయ ప్రయోగాల పట్ల అనేక ప్రాంతాల రైతులు ఆసక్తి చూపుతుంటారు. ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.  శంకర్‌రెడ్డి వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న రైతులు 7674816718 నెంబరుకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

Updated Date - 2021-04-25T06:40:37+05:30 IST