Abn logo
Sep 19 2021 @ 01:09AM

మేయర్‌ ఇంటి వద్ద అవిశ్వాస హైడ్రామా

మేయర్‌ ఇంటి తలుపునకు నోటీసు అతికిస్తున్న ఉద్యోగులు

అందుబాటులో లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసు అతికించిన ఉద్యోగులు
కార్పొరేషన్‌(కాకినాడ), సెప్టెంబరు18: అవిశ్వాసం నోటీసు అందజేసే సమయంలో కాకినాడ నగర మేయర్‌ సుంకర పావని ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. కలెక్టర్‌ జారీ చేసిన అవిశ్వాసం నోటీసును మేయర్‌కు అందజేసేందుకు శనివారం కార్పొరేషన్‌, రెవెన్యూ, పోలీసుశాఖ ఉద్యోగులు మేయర్‌ ఇంటికి వెళ్లగా ఆమె అందుబాటులో లేరని సిబ్బంది తెలిపారు. దీంతో మేయర్‌ ఇంటి తలుపునకు నోటీసు అతికించి పంచనామా ప్రకారం ఇరుగుపొరుగు సంతకాలు తీసుకున్నారు. మేయర్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ 33 మంది కార్పొరేటర్లు సంతకాలతో కూడిన లేఖను కలెక్టర్‌కు అందజేసిన విషయం తెలిసిందే. దీనిపై వెంటనే కార్పొరేటర్ల సంతకాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి ఒక రోజులోనే నోటీసు సిద్ధం చేశారు. దీంతో అక్టోబరు 5న అవిశ్వాస సమావేశం ఏర్పాటుచేశారు.

విప్‌ నోటీసులు తీసుకోకండి : ద్వారంపూడి దిశనిర్దేశం

టీడీపీ అధిష్ఠానం నుంచి విప్‌ నోటీసులు వస్తే తీసుకోకండని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వైసీపీ అనుకూల టీడీపీ కార్పొరేటర్లకు దిశనిర్దేశం చేశారు. మేయర్‌పై అవిశ్వాసం ప్రకటించడంతో శనివారం ఎమ్మెల్యే ద్వారంపూడి వైసీపీ కార్పొరేటర్లు, అనుకూల టీడీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అవి శ్వాస సమావేశం నోటీసులు వచ్చిన వెంటనే తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో టీడీపీ నుంచి వచ్చే విప్‌ నోటీసులు అనుకూల టీడీపీ కార్పొరేటర్లుగాని, వారి కుటుంబ సభ్యులుగాని తీసుకోవద్దని తెలిపారు. కాగా టీడీపీ అధి ష్ఠానం విప్‌ జారీచేస్తే వైసీపీకి అనుకూలంగా ఉన్న టీడీపీ కార్పొరేటర్లతో క్యాంపె న్‌ ఏర్పాటు చేసేపనిలో ఎమ్మెల్యే ద్వారంపూడి నిమగ్నమయ్యారని తెలిసింది. వీరితోపాటు వైసీపీ అసంతృప్తి కార్పొరేటర్లను క్యాంపెన్‌కు తరలించనున్నారు. మేయర్‌ను ఎలాగైనా గద్దె దింపేందుకు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. అక్టోబరు 5న అవిశ్వాస సమావేశం ఉన్నందున అప్పటివరకు క్యాం పెన్‌ నిర్వహించి బుజ్జగించే విధంగా ప్రణాళికలు రచించినట్టు సమాచారం.