వైసీపీ ఎమ్మెల్యే నాపై కక్ష కట్టారు

ABN , First Publish Date - 2021-09-17T06:33:26+05:30 IST

ఎమ్మెల్యే..

వైసీపీ ఎమ్మెల్యే నాపై కక్ష కట్టారు
కాకినాడ నగర మేయర్‌ సుంకర పావని, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి

ద్వారంపూడి అక్రమాలను అడ్డుకున్నందుకే నాపై కక్ష..

కాకినాడ నగర మేయర్‌ సుంకర పావని

 

కార్పొరేషన్‌(కాకినాడ): ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అక్రమాలను అడ్డుకున్నందుకే తనపై కక్ష కట్టారని కాకినాడ నగర మేయర్‌ సుంకర పావని విమర్శించారు. గురువారం మేయర్‌ పావని మీడియాతో మాట్లాడారు. మహిళలకు పెద్దపీట వేశామని వైసీపీ ప్రభుత్వం ఒక పక్కన చెబుతుండగా, ఇక్కడ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేను ప్రభుత్వం ప్రశ్నించాలన్నారు. మహిళ మేయర్‌ అని చూడకుండా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు ధోరణిలో ఎమ్మెల్యే పయనించారన్నారు. నాలుగేళ్ల వరకు మేయర్‌ పదవి నుంచి దింపడానికి వీలులేకుండా చట్టం ఉండడం వల్లే ఇంతకాలం వేచి ఉన్నారన్నారు. అత్యధిక మెజారిటీతో ప్రజల మన్ననలతో గెలిచిన తనను అధికార దుర్వినియోగం చేసి మేయర్‌ పదవి నుంచి దించాలని చూస్తున్నారన్నారు. ఈ కుట్రను కచ్చితంగా ఎదుర్కొంటామని, రాబోయే కాలంలో తగిన విధంగా సమాధానం చెబుతామని మేయర్‌ పావని స్పష్టం చేశారు. 


నేడు కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం అందజేత..

నగర మేయర్‌ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని 34 మంది కార్పొరేటర్ల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని శుక్రవారం కలెక్టర్‌ సి.హరికిరణ్‌కు అందజేయనున్నారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సారథ్యంలో కార్పొరేటర్లు కలెక్టరేట్‌కు చేరు కోనున్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని కోరనున్నారు. 40వ డివిజన్‌ కార్పొరేటర్‌ సుంకర శివప్రసన్న ను మేయర్‌గా ఎంపిక చేసేందుకు దాదాపు ఖరారు అయినట్టు తెలిసింది. డిప్యూటీ మేయర్‌ పదవి వైసీపీ కార్పొరేటర్‌కు కట్టబెట్టేందుకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం.

Updated Date - 2021-09-17T06:33:26+05:30 IST