‘కాలజ్ఞానం’లో కరోనా?

ABN , First Publish Date - 2020-03-29T09:21:36+05:30 IST

అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సమాజం మనది. గాలివార్తలను పుట్టించడం, ప్రచారం చేయడ ఓ సరదాగా మారింది. ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్టు చాలా తేలిగ్గా ఓ అబద్ధాన్ని జనం మీదకు వదులుతారు...

‘కాలజ్ఞానం’లో కరోనా?

16వ శతాబ్దానికి చెందిన నోస్ట్రడామస్ కానీ, 17వ శతాబ్దానికి చెందిన వీర బ్రహ్మం కానీ జ్యోతిష్యం చెప్పలేదు. ప్రాపంచిక జ్ఞానం ఫలితంగా, వారు భవిష్యత్తుకు సంబంధించిన ఓ ఊహా ప్రతిపాదన చేయగలిగారు. జనం ఎక్కువ గుమిగూడే ప్రాంతాల్లో అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉందని చెప్పారు. అంతేగానీ, సూరత్ లో ప్లేగు వస్తుందని, చైనాలో కరోనా వస్తుందని ఇతమిత్థంగా చెప్పలేదు. ఇప్పుడు కూడా మన మధ్య భవిష్యత్తును అంచనా వేయగలిగే శక్తి కలిగిన వారున్నారు. వారు దార్శనికులు అవుతారు తప్ప, కాలజ్ఞానులు కారు.


అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సమాజం మనది. గాలివార్తలను పుట్టించడం, ప్రచారం చేయడ ఓ సరదాగా మారింది. ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్టు చాలా తేలిగ్గా ఓ అబద్ధాన్ని జనం మీదకు వదులుతారు. మూఢ విశ్వాసాలను సుస్థిరం చేయడానికి విపత్తులకు మించిన సదవకాశం లేనట్టు ప్రవర్తిస్తారు. ఇది సరదాగా చేస్తారా? కాలక్షేపానికి చేస్తారా? ప్రచారం కోసం చేస్తారా? తమ ప్రాబల్యాన్ని కొనసాగించుకోవడానికి కొందరు వేసే ఎత్తుగడనా?  ఏమో ఏదైనా కావచ్చు.


పెద్ద పెద్ద విపత్తులు సంభవించినప్పుడు, అసాధారణ సంఘటనలు జరిగినప్పుడు ఈ జనాలకు హఠాత్తుగా పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి గుర్తొస్తాడు. ఫ్రెంచి కాలజ్ఞానిగా ప్రాచుర్యం పొందిన నోస్ట్రడామస్ గుర్తొస్తాడు. పాపం నాలుగైదు శతాబ్దాల కిందే చచ్చిపోయిన వారికి అర్జంటుగా ప్రాణప్రతిష్ట చేస్తారు. వారితో సమకాలీన అంశాలపై జ్యోతిష్యం చెప్పిస్తారు. ఇందుకోసం ఆడియో రికార్డులు సృష్టిస్తారు. తాళపత్ర గ్రంథాలను తేలేరు కాబట్టి, పాత గ్రంథంలోని పేజీలాగా కనిపించేటట్టు ఫోటోషాప్ సాఫ్ట్‌వేర్‌ను, ఫోటోఎడిట్ యాప్‌ను యమ పర్ఫెక్టుగా వాడేస్తారు. అలా పాత దానిలా తీర్చిదిద్ది, సోషల్ మీడియాలో ఫ్రెష్‌గా పోస్టులు పెడతారు.


ఇప్పుడు వీళ్లకు కొరోనా దొరికింది. ఇంకేం ఆడుకుంటున్నారు. ఎవరో గాలి వార్త పుట్టిస్తారు. మిగతా వాళ్లు దాన్ని షేర్ చేసేస్తారు. నా వార్తలు నా ఇష్టం అన్నట్లు సాగే సోషల్ మీడియాలో హద్దూ అదుపూ ఉండదు కదా. ఎప్పుడో చెప్పబడిన కాలజ్ఞానం అనే ముసుగుతో మోడరన్ హోక్స్ వైరల్ అవుతాయి. గతంలో సునామీ లాంటి విపత్తులు వచ్చినప్పుడు వాడినట్టే ఇప్పుడూ కాలజ్ఞానుల పేర్లు విచ్చలవిడిగా వాడేస్తున్నారు.


పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 2020లో కరోనా వస్తుందని ముందే చెప్పాడట. దానికి సంబంధించిన ఓ పద్యం కూడా రాశాడట. అది తాళపత్ర గ్రంథాల్లో ఉందట.

‘‘ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను

లక్షలాది ప్రజలు సచ్చేరయ

కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి

కోడిలాగ తూగి సచ్చేరయా’’

అనే పద్యం 114వ తాళపత్రంలో ఉందని కొందరు, 114వ పద్యంగా చెప్పాడని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. 2020కు ముందు ‘బ్రహ్మం గారి కాలజ్ఞానం’ పేరిట ప్రచురితమైన ఏ పుస్తకంలోనూ ఈ పద్యం లేదు. అంతకు ముందు ప్రచురితమైన పుస్తకాలకున్న విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకమే.


ఇక ఫ్రెంచ్‌ కాలజ్ఞాని నోస్ట్రడామస్ కూడా కరోనా గురించి ముందే చెప్పాడనే ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. ‘‘సుమారు 2020 నాటికి ఏ వైద్యానికి లొంగని జబ్బు భూ మండలమంతా వ్యాపిస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసనాళాలను దెబ్బతీసే న్యూమోనియా వంటి జబ్బు వస్తుంది. ఈ వ్యాధిని అంచనా వేయడానికి ప్రయత్నం ప్రారంభించే సరికే వేగంగా విస్తరిస్తుంది. అంతే వేగంగా అదృశ్యమవుతుంది. పది సంవత్సరాల తర్వాత మళ్లీ వ్యాపించి, తర్వాత పూర్తిగా అదృశ్యమవుతుంది’’ అని నోస్ట్రడామస్ చెప్పినట్టు ఓ గాలివార్త పుట్టించారు. ఈ మాటలు నోస్ట్రడామస్ చెప్పిన కాలజ్ఞానంతో రూపొందించిన ‘ది ప్రాఫెసీస్’ అనే పుస్తకంలోని 312వ పేజీలో ఉన్నట్లు కూడా అతికించినట్లు అబద్ధం ఆడేశారు.


బ్రహ్మం గారు చెప్పినట్లుగా, నోస్ట్రడామస్ ఊహించినట్లుగా ప్రచారం అవుతున్న విషయాలు ఎక్కడా దొరకవు.  కేవ లం సోషల్ మీడియాలో తప్ప. 2020కు ముందు ఈ ఇద్దరి పేర్ల మీద ప్రచురితమైన పుస్తకాల్లో కూడా ఈ ప్రస్తావన లేదు. నోస్ట్రడామస్ పేరు మీద వచ్చిన అనేక పుస్తకాల్లో ఎక్కడ వెతికినా ఈ సంగతి తెలియదు. మరి ఇంత పచ్చి అబద్ధాలను ఏ ఉద్దేశ్యంతో ప్రచారం చేస్తున్నారు. వారికదో తృప్తి అని సరిపెట్టుకోవాలా? అంతకు మించిన లక్ష్యం ఏమన్నా ఉందా? అర్థం కాదు.


నిజానికి, 16వ శతాబ్దానికి చెందిన నోస్ట్రడామస్ కానీ, 17వ శతాబ్దానికి చెందిన వీర బ్రహ్మం కానీ జ్యోతిష్యం చెప్పలేదు. భవిష్యత్తులో ఏ సమయంలో ఏది జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేదు. అప్పటికి సమాజంలో ఉన్న పరిస్థితిని గమనించి, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఓ అంచనా వేశారు. తాము సముపార్జించుకున్న ప్రాపంచిక జ్ఞానం ఫలితంగా, వారు భవిష్యత్తుకు సంబంధించిన ఓ ఊహా ప్రతిపాదన చేయగలిగారు. నదులు ఉప్పొంగుతాయని, బావులు, చెరువులు నీరు లేక ఎండిపోయే పరిస్థితి వస్తుందని ఊహించారు. అప్పటికే అతివృష్టులు, అనావృష్టులను చూశారు కాబట్టి వారు అలా చెప్పారు.  అంతేగాని సునామీని ప్రస్తావించలేదు. జనం ఎక్కువ గుమిగూడే ప్రాంతాల్లో అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉందని చెప్పారు. అంతేగానీ, సూరత్‌లో ప్లేగు వస్తుందని, చైనాలో కరోనా వస్తుందని ఇదమిత్థంగా చెప్పలేదు. ఇప్పుడు కూడా మన మధ్య భవిష్యత్తును అంచనా వేయగలిగే శక్తి కలిగిన వారున్నారు. వారు దార్శనికులు అవుతారు తప్ప, కాలజ్ఞానులు కారు.


కేవలం బ్రహ్మంగారు, నోస్ట్రడామస్‌లే కాదు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని మతాల్లో, అన్ని కాలాల్లో ఇలాంటి వారున్నారు. వీళ్లను కొందరు ఆస్ట్రాలజర్ (జ్యోతిష్కుడు) అని, మరికొందరు సూత్ సేయర్ (సోది చెప్పేవారు) అని పిలిచారు. వారు తమకు తోచిన విషయాలను తమ అనుచరులకు, సన్నిహితులకు చెప్పారు. అలా విన్నవారు వేమన పద్యాల మాదిరిగా కొన్నింటిని గ్రంథస్తం చేశారు. అంతే తప్ప వారేమీ పూసగుచ్చినట్టు భవిష్యత్తును రాసుకుపోలేదు. ఫ్యూచర్ డైరీని రూపొందించలేదు.


ఇక బ్రహ్మం గారు చెప్పినట్టు చెప్పబడే కాలజ్ఞానం విషయంలో అంతులేని అతి ఉంటుంది. ఆయన పేరు మీద తీసిన సినిమాల్లో అయితే అతిశయోక్తులకు కొదవే ఉండదు. అప్పటికే జరిగిన పరిణామాలన్నింటినీ పూసగుచ్చి, ఇదంతా బ్రహ్మం గారే చెప్పారు అనే విధంగా గోవింద వ్యాక్యాలు వినిపిస్తారు. అంబ రాజ్యమేలుతుందని బ్రహ్మం గారు చెప్పారు అని అంటారు. ఇందిరాగాంధి  విషయంలో నిజమైంది అంటారు. నిజానికి బ్రహ్మంగారి కాలానికన్నా ముందే రాణి రుద్రమ దేవి లాంటి వారు రాజ్యమేలారు. సినిమా తారలు రాజ్యాలేరుతారని బ్రహ్మం గారు చెప్పారట. బ్రహ్మంగారి కాలంలో అసలు సినిమాలే లేవు. కానీ ఎన్టీఆర్ సినిమా తీసే కాలానికి సినీ తారలు నాయకులయ్యారు. వర్తమాన సంఘటనలకు బ్రహ్మం గారి కాలజ్ఞానంతో లింకు పెట్టి జనం మీదకు వదిలారు. లాజిక్‌కు అందని ఇలాంటివి ఇంకా కోకొల్లలు. 2012లో యుగాంతం అవుతుందని నోస్ట్రడామస్ చెప్పినట్లు జరిగిన ప్రచారం ఎంత అపహాస్యం అయిందో మనకు తెల్వదా?


కాలజ్ఞానానికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన వాటి గురించి, జరుగుతున్న వాటి గురించి మాత్రమే చెబుతున్నారు. నిజంగా వారి కాలజ్ఞానంలో భవిష్యత్తులో ఈ  సమయానికి ఈ విపత్తు జరుగుతుందని చెప్పి ఉంటే దాన్ని బయట  పెట్టాలి. అలాంటిదేదీ ఇప్పటి వరకు జరగలేదు. సునామీ వస్తుందని ముందే చెప్పారని సునామీ వచ్చిన సందర్భం లో మాత్రమే చెప్పారు. అంతకుముందు చెప్పలేదు. మరి అప్పుడే 2020లో కరోనా వస్తుందని కాలజ్ఞానులు చెప్పిన విషయాన్ని ఎందుకు ప్రచారం చేయలేదు. 2020 వరకు సంగతి వదిలిపెట్టండి. 2021 నుంచి ఏమి ముప్పు వస్తుందో, ఎలాంటి అసాధారణాలు జరుగుతాయో, వాటి గురించి కాలజ్ఞానులు ఏమి ఊహించారో ముందే చెబితే మానవాళి మేలుకొంటుంది కదా! ప్రభుత్వాల పని కొంత సులువు అవుతుంది కదా!


ఈ కాలజ్ఞానం పేరిట జరుగుతున్న గాలివార్తల ప్రచారం ఓ వ్యూహం కాదు కదా? సనాతన ధర్మంగా ప్రచారంలో ఉన్న కొన్ని మూఢ విశ్వాసాలను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆపాదించే ‘నియో రివిజనిజం’ బాపతు లక్షణమేనా ఇది కూడా? ప్రపంచమంతా ఎవరో చెప్పినట్టు, ఆడిస్తున్నట్టు ఆడుతుంది అని, అదేంటో తమ లాంటి కొందరు దైవాంశ సంభూతులకు ముందే తెలిసి పోతుంది అని భ్రమింప చేసి పబ్బం గడుపుకునే శక్తుల కుట్రలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయా? ‘‘అబద్ధం అబద్ధమే. కానీ, అదే అబద్ధాన్ని వెయ్యి సార్లు చెబితే నిజంగా చలామణి అవుతుంది’’ అనే గోబెల్స్ వ్యూహమే వారికి ప్రేరణ. కరోనా కన్నా ప్రమాదరకమైనది ఈ వైరస్. మనిషి సృజనాత్మకతను, శాస్త్రీయ దృక్పథాన్ని పాతరేసే పాడురోగం. తస్మాత్ జాగ్రత్త.

గటిక విజయ్ కుమార్

Updated Date - 2020-03-29T09:21:36+05:30 IST