ఆంధ్రప్రదేశ్‌ను అంధకారంగా మారుస్తున్నారు: కళావెంకట్రావు

ABN , First Publish Date - 2021-09-01T01:51:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ను అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తూ విద్యుత్ వెలుగులు లేకుండా చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ను అంధకారంగా మారుస్తున్నారు: కళావెంకట్రావు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తూ విద్యుత్ వెలుగులు లేకుండా చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ రెండున్నరేళ్లలోనే రూ. 9069 కోట్లు విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపారన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఛార్జీలు పెంచమన్నారని ఇప్పటికే రాష్ట్రంలో 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. ఇప్పుడు 5వ సారి రూ.3669 కోట్లు పెంచడం మోసం కాదా?అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గినా వినియోగదారులపై ఎందుకు ఛార్జీలు పెంచుతున్నారు అని నిలదీశారు. అవినీతి, దుబారా అరికడితే ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అని ప్రశ్నించారు.


పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా  సీఎం జగన్మోహన్‌రెడ్డి రూ. 24,491 కోట్లు అప్పు తెచ్చారని, అయినా రూ. 9069 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి అది తన అవినీతికి, దుబారాకు జగనార్పణం చేసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రమాణస్వీకారోత్సవ సభలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు రెట్టింపు భారం మోపి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నా అప్పుల కోసం మోటార్లకు మీటర్లు పెడుతున్నారని ఇది రైతులకు ఉరితాడు బిగించడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఇతర రాష్ట్రాలకన్నా ఏపీలోనే విద్యుత్ రేట్లు ఎక్కువగా ఉండడంతో ఈ రాష్ట్రంలోకి పరిశ్రమలు రావట్లేదని వ్యాఖ్యానించారు.  జగన్ అనాలోచిత చర్యలతో నిరుద్యోగం మరింత పెరుగుతుందన్నారు.వైసీపీ నేతల లూటీకి, దుబారాకు విద్యుత్ వినియోగదారులు మోయలేని భారాలు మోయాలా? అని ప్రశ్నించారు.జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చిన అధునాతన టెక్నాలజీతో విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గుతున్నా  ఏపీలో మాత్రం ప్రజలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పి.జి.సి.ఐ.ఎల్) నెట్‌వర్క్‌ను వినియోగించుకున్నందుకు వసూలు చేసే స్థిర ఛార్జీలు మెగావాట్‌కు రూ. 5.5 లక్షల నుంచి రూ. 3.5 లక్షలకు తగ్గించిందని దీని ద్వారా రాష్ట్రానికి రూ. 400 కోట్లు ఆదా అయిందని తెలిపారు. కేంద్ర ఎనర్జీ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి 625 మెగావాట్ల థర్మల్ పవర్‌ భారాన్ని ఉపసంహరించుకోవడంతో ఏపీ డిస్కామ్‌లకు మరో రూ .1007 కోట్ల ఆర్థిక భారం కూడా తగ్గిందని కిమిడి కళావెంకట్రావు తెలిపారు.

Updated Date - 2021-09-01T01:51:26+05:30 IST