కామారెడ్డిలో కదలని కాళేశ్వరం!

ABN , First Publish Date - 2020-10-21T09:19:08+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్‌లో భాగంగా చేపట్టిన 22వ ప్యాకేజీ పనులు ముందుకు సాగడం లేదు.

కామారెడ్డిలో కదలని కాళేశ్వరం!

నిలిచిన  22వ ప్యాకేజీ పనులు.. నిధులు లేక ఎక్కడి పనులక్కడే

భూ సేకరణకూ నిధులివ్వని సర్కార్‌

కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో 2.40 లక్షల ఎకరాలకు సాగునీరందేనా?


కామారెడ్డి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్‌లో భాగంగా చేపట్టిన 22వ ప్యాకేజీ పనులు ముందుకు సాగడం లేదు. కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని 2.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం ఐదేళ్ల క్రితం పనులకు శ్రీకారం చుట్టింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలంలోని భూంపల్లి రిజర్వాయర్‌ను నిర్మించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి కాల్వల తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. ఈ పనుల కోసం 2, 921 ఎకరాల భూమి అవసరమని ప్రణాళిక రూపొందించారు. ఇప్పటివరకు 1,239 ఎకరాలు మాత్రమే భూ సేకరణ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్యాకేజీ పనులు పూర్తయితే కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి, దోమకొండ, బీబీపేట్‌, భిక్కనూరు, మాచారెడ్డి, రాజంపేట్‌ మండలాల్లో 82,200 ఎకరాలకు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, సదాశివనగర్‌, లింగంపేట్‌, తాడ్వాయి మండలాల్లోని 95,200 ఎకరాలకు, బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ, నసురుల్లాబాద్‌, వర్ని మండలాలల్లో 12వేల ఎకరాలతో పాటు మెదక్‌ జిల్లాలో 16వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. 


ఆగిన సొరంగం పనులు

భూంపల్లి రిజర్వాయర్‌ నుంచి 100.80 కిలోమీటర్ల మేరకు కాల్వలు తవ్వాల్సి ఉంది. ఇందులో ఎడమ కాలువ 51 కిలోమీటర్లు, కుడి కాలువ 11.975 కిలోమీటర్లు, ప్రధాన కాల్వ 14.25 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ప్రధాన కాలువ (రిడ్జ్‌ కాలువ) దాదాపు పనులు పూర్తయ్యాయి. కుడి కాలువ(ఆర్‌ఎంసీ) తుది దశకు చేరుకుంది. ఎడమ కాల్వ(ఎల్‌ఎంసీ)కు సంబంధించి భూ సేకరణ పనులు కొలిక్కి వచ్చాయి. సొరంగమార్గం ద్వారా భూంపల్లి రిజర్వాయర్‌ వరకు 7.560 కిలోమీటర్ల వరకు కాలువ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ సొరంగమార్గ పనులు మాత్రం పూర్తి కావడం లేదు. ప్రస్తుతం అప్రోచ్‌ కాలువ తవ్వకం మాత్రమే పూర్తయింది.  


సర్వే పూర్తయినా.. సాగని పనులు

కాలువల నిర్మాణాలకు భూ సేకరణ సమస్య ఎదురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తాడ్వాయి, సదాశివనగర్‌, రాజంపేట, రామారెడ్డి మండలాల్లోని పలు గ్రామాల్లో 3 వందల ఎకరాల భూ సేకరణకు రైతులతో ఒప్పందం పూర్తయింది. రూ.21.23 కోట్లు విడుదల చేస్తేనే ఈ భూముల్లో పనులు ప్రారంభించవచ్చు. భూ సేకరణ కోసం నిధులు విడుదల కాకపోవడంవల్లే పనులు ముందుకు సాగడం లేదు. మరో 8 వందల ఎకరాల భూ సేకరణకు సర్వే పూర్తయింది. నిధులు లేని కారణంగా అధికారులు రైతులతో ఒప్పందం చేసుకునేందుకు ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది. 

Updated Date - 2020-10-21T09:19:08+05:30 IST