Abn logo
Jul 5 2021 @ 00:14AM

కల్లంచల బువ్వ

ఊరంతా 

చప్పుడు 

చేయని గువ్వై

మెలుకువ రెక్కలు 

తెరవక ముందే


కళ్లల్లో నిద్రని తుడిచి 

కడుపుసంచిలో 

ఉత్తపేగుల్ని తడుముతూ

ఈదుల్ని దారితాడుతో

చేదుకుంటూ యింటి నుండి 

మొదలైతుంది

మా నాయన పయనం 


పాదాలకంటిన మట్టి

తెరలు తెరలుగా రాలినట్లు

చీకటి జారిపోతుంటుంది

ఆయన అడుగుల్లోంచి


కనికరాళ్ల పొడితో 

చిల్లకట్టికి సానపట్టిన 

కత్తి గొడ్డలి

పార ఉలితో వనం గట్లపై 

నడిచే పడవ తను


తాటిచెట్టుకింద 

చేరిన బుద్ధుడై -

మా బతుకుబువ్వను దర్శించే 

సూత్రాన్ని కనుగొంటాడు


ఆయన వూపిరిస్పర్శని 

పసిగట్టిన చెట్లన్నీ

గౌరవ సూచకంగా

మబ్బుల దుప్పటిని మడతపెట్టి

గురువుముందు నిలబడిన 

విద్యార్థులవుతాయి


రైతు పొలంలో 

గుట్ట పుట్ట 

గుంత కల్లా కంపా 

ఊడ్చి అదనుకు

సిద్ధపర్చినట్లు -


చెట్టు తనువుకు పట్టిన 

పురుగూ బూసి

దుమ్మూ ధూళి

బరక బడికల్ని

అసను చేస్తాడు

కత్తి గొడ్డలితో...


బీడిముక్కను ఎలిగించి

దీర్ఘధ్యానముద్ర నుంచి 

బయటికొచ్చిన 

మనిషిలా తేలికపడి 


చెట్టు భాష ఎరిగినట్లు

ఆకుల రెప్పల 

పిలుపులు తెలిసిన మనిషై

గడప నుంచి గడపకు 

వెళ్లినంత సులువుగా

ఉత్సవ దేహమై తేలిపోతాడు

మొదలు నుంచి కొసనకు


మా నాయన చేతులు సోకిన

చెట్లన్నీ

ఆనంద ముగ్ధమైనట్లు 


తాడి చేతుల్లోని 

మంచు బిందువులన్నీ

లయబద్ధంగా అడుగులు పడుతున్న 

ఆయన తలపై 

పూలవానై కురిసేవి


ఉత్తకడుపుతో

మోకును ఎగేస్తూ

బరువునంతా చేతుల్లోనింపి 

నడుముని

ముందరికాళ్ళ బంధాన్నీ క్రమంగా కదుపుతూ

ఆయనలా చెట్టున ఎగసిపోతుంటే

తల్లి చనుబాలుకు ఎగబాకుతున్న

పసిపిల్లాడిలా అనిపించేది


మోకుతో పాకుతూ 

పారతో చెక్కి 

లొట్టికి మెలికకట్టి

ఉలితో గీయడం 

ఏ పుస్తకాల విద్దెకు అందని 

నేర్పరితనమే


చెట్టుమీద నిలిచిన 

మానాయన 

మా బతుకు 

‘దారిరెక్క’ లాంటోడు


తాను చెట్టెక్కే నేర్పరితనం

పర్వతారోహులకు

పాఠంలాంటిదే -

మబ్బులు తాకే చెట్టయిన

తన ముందు

సలామనాల్సిందే


చలకత్తితో మట్టలను 

తొలుస్తున్న శ్రద్ధ

వైద్యం చేస్తున్నట్లుగా

వుంటుంది


చెట్టుకు లేసిన గెలల

కల్లు ఊటల్ని తడుముతూ 

గీతకత్తితో

మెరల్ని తీసి -

వెన్నెలతుమ్మెదై

చెట్టుపై వాలినప్పుడు


చెట్టు పొదుగులు పితికి

బొట్టు బొట్టుగా కుండలోకి

అమృతాన్ని ఒంపిన మా నాయన -

కుండనిండా

కల్లు తొలుకుతుంటే

ఆయన ముఖం

చుక్కలు కాసిన ఆకాశమయ్యేది


కల్లు నిండిన పటవ 

చెట్టునుంచి దింపుతుంటే

ఆ రోజు మా యింటి

పంట పండినట్లుండేది


వానొచ్చినప్పుడు 

మాయింటి చూరల్లో చినుకులు 

వుటకలు కడతాయేమో కానీ

చెట్టు సుడిలో నీళ్లుదిగినా 

కల్లు కావడిలోకి

చుక్కకట్టనీయని మానాయనది 

గొప్ప ఇంజనీరు నైపుణ్యమే


మసక తుండుగుడ్డును చింపి

చెట్టు నుంచి దిగుతూ దిగుతూ

ఊరిదాక చేతుల్లో తెల్లపొద్దును

మా కడుపున మెతుకు మూలవాసాన్ని

కల్లంచలు కట్టి కాళ్లరిగేలా

మైళ్ళు దూరం వెంటేసుకొచ్చే

భగీరథుడు 


గాడిదపై కల్లు నింపిన

రెండు చర్మంతిత్తుల్ని

తగిలించుకుని

ఆ వెనుకాల నడిచొస్తుంటే

మా నాయన రాజులాగా అనిపించేది

అవ్వ చెప్పిన

‘రాజుతెచ్చిన బువ్వకథ’ గుర్తొచ్చేది

ఈ. రాఘవేంద్ర

94940 74022