కల్తీ కమాల్‌

ABN , First Publish Date - 2022-01-17T05:09:07+05:30 IST

జిల్లాలో కల్తీ పదార్థాల విక్రయాలు జోరందుకుంటున్నాయి. చిరువ్యాపారుల నుంచి మొదలుకుని పెద్దపెద్ద హోటళ్ల వరకు తక్కువ ధరలకు పదార్థాలు, నూనెలు, నెయ్యి, పాల పదార్థాలు దొరుకుతుండడంతో వాటినే వినియోగించి ప్రజలను అనారోగ్యపాలు చేస్తున్నారని తెలుస్తోంది.

కల్తీ కమాల్‌
దేవునిపల్లి కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

- జిల్లా కేంద్రంలో కల్తీ పదార్థాల తయారీ

- నూనె, నెయ్యి, పాల పదార్థాలు కల్తీమయం

- నాసిరకం సరుకులతో పదార్థాల తయారీ

- వీటినే హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో వినియోగం

- ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో పట్టుబడిన కల్తీ నెయ్యి తయారీ కేంద్రం


కామారెడ్డి టౌన్‌, జనవరి 16: జిల్లాలో కల్తీ పదార్థాల విక్రయాలు జోరందుకుంటున్నాయి. చిరువ్యాపారుల నుంచి మొదలుకుని పెద్దపెద్ద హోటళ్ల వరకు తక్కువ ధరలకు పదార్థాలు, నూనెలు, నెయ్యి, పాల పదార్థాలు దొరుకుతుండడంతో వాటినే వినియోగించి ప్రజలను అనారోగ్యపాలు చేస్తున్నారని తెలుస్తోంది. జిల్లాలో ఫుడ్‌సేఫ్టీ అధికారి కార్యాలయం అనేది లేకపోవడం ఇతర జిల్లాల అధికారులను జిల్లాకు ఇన్‌చార్జీలుగా నియమించడంతో వారు పట్టించుకున్న పాపానపోవడం లేదు.దీంతో కల్తీరాయుళ్ల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. పలు సందర్భాల్లో తనిఖీల పేరిట వస్తున్న ఫుడ్‌సేఫ్టీ అధికారులు తూతూ మంత్రంగా వచ్చి తనిఖీలు చేస్తూ ఎక్కడైన లోపాలు కనిపిస్తే వారి వద్ద నుంచి ముడుపులు తీసుకుంటూ చర్యలు మాత్రం తీసుకోవడం లేదని సమాచారం. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో నూనె కల్తీ పదార్థాల తయారీకి స్థావరంగా మారుతోంది. ఇటీవల దేవునిపల్లి ప్రాంతంలోని ఓ ఇంట్లో కల్తీ నెయ్యిని తయారు చేస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేసి పట్టుకోవడం ఉదాహరణగా చెప్పవచ్చు. ఆ కల్తీ పదార్థాలనే పలు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు వినియోగిస్తూ అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

పెరిగిన హోటల్‌ కల్చర్‌

పట్టణ ప్రాంతంలో హోటల్‌ కల్చర్‌ పెరుగుతోంది. సంపన్నులు మొదలుకొని రోజు వారి కూలీల వరకు వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వస్తూ అవసరాన్ని బట్టి టిఫిన్‌, భోజనం కోసం హోటళ్లను, స్వీట్‌హోంలను ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా ఫాస్ట్‌ఫుడ్‌ తినేవారు సైతం ఎక్కువవుతున్నారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు రద్దీగా కనిపిస్తున్నాయి. చాలాచోట్ల కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా రంగులను కలుపుతూ క్యాన్సర్‌, గుండెజబ్బుల వంటి ప్రాణాంతకమైన రోగాలకు కారణమవుతున్నారు. కొంతమంది యజమానులు ట్రేడ్‌, ఫుడ్‌సేఫ్టీ లైసెన్స్‌ లేకుండానే హోటళ్లను యథేచ్ఛగా నడిపిస్తున్నారు. మరికొందరైతే మాంసం విక్రయాలు చేసే వారితో భేరం కుదుర్చుకుని రోగంతో చనిపోయిన, గాయాలపాలైన వాటిని సైతం తక్కువ ధరకు తీసుకువచ్చి వంటకాలు చేస్తున్నారు. ఉదయం పూట లభించే పాల నుంచి వంటకాల్లో వండే నూనెల వరకు కల్తీమయంగా ఉండడం, తక్కువ ధరకే బ్రాండెడ్‌ల పేరుతో విక్రయాలు జరపడంతో ప్రజలు సైతం వాటిని ఉపయోగించి వాటి వల్ల కలిగే అనర్థాలు తెలియక వాటినే వాడుతున్నారు. పలువురు హోటల్‌ నిర్వాహకులు, వ్యాపారులు తక్కువ ధరకు వస్తుందని కల్తీ పదార్థాలతోనే వంటకాలు చేసి ప్రజలకు అంటగడుతున్నారు.

కల్తీ జోరు.. చర్యలు తీసుకునే వారే లేరు

ఇటీవల పప్పులు మొదలుకొని నూనెల వరకు అన్నీ కల్తీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేపట్టి ర్యాండమ్‌గా నమూనాలు తీయాలి. ఆహార పదార్థాలపై క్యాన్సర్‌ కారకరంగులు(ఆర్సెనిక్‌) వంటి రంగులు వేస్తే వాటిపై చర్యలు తీసుకోవాలి. టీ పొడి నుంచి పాల వరకు ఇలా ప్రతీ ఒక్కదానిపైన నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం, తనిఖీలు నిర్వహించాలి. ఈ క్రమంలో నెలకు కనీసం 12 నమూనాలు తీసి ఎఫ్‌ఎస్‌ఎల్‌(ఫుడ్‌సేఫ్టీ ల్యాబోరేటరీకి) పంపించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం కల్తీ అయినట్లు నిర్ధారణ అయితే కేసులు నమోదు చేయడంతో పాటు తీవ్రతను బట్టి సదరు హోటల్‌ను సీజ్‌చేసే అధికారం కూడా వారికి ఉంటుంది. కానీ జిల్లాలో ఇలాంటి చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌లు ఉంటారనే విషయం కూడా ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో ఇటీవల పలు దుకాణాల్లో తనిఖీలు చేసిన ఫుడ్‌సేఫ్టీ అధికారులు పైపైనే చూసి లైసెన్స్‌ రెన్యూవల్‌ చేశారని తెలుస్తోంది. పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో కల్తీనూనె, నెయ్యి అమ్మకాలు జరుగుతున్న అసలు వారు దృష్టిలో లేదంటే హాస్యాస్పదంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో పట్టుబడిన కల్తీ నెయ్యి తయారీ కేంద్రం

ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు గాని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ గాని లేకపోవడంతో కల్తీ రాయుళ్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. జిల్లా కేంద్రంలో కల్తీనూనె, కల్తీనెయ్యి, పాల పదార్థాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు చేకూరేలా చేస్తున్నా దృష్టి సారించకపోవడంను చూస్తేనే అర్థమవుతోంది. ఎంతమేర ప్రజల ఆరోగ్యానికి అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారనేది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి ప్రాంతంలో ఓ ఇంట్లో కల్తీనెయ్యి తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేసి పలువురిని ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. వీటితో పాటు కల్తీనూనె సైతం పెద్ద మొత్తంలో మార్కెట్‌లో అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నూనెను ప్రజలు వినియోగించడంతో చాలా వరకు కాలేయవ్యాధి, క్యాన్సర్‌కు గురవుతున్నారని తెలుస్తోంది. ఈ కల్తీరాయుళ్ల జోలికి ఎవరు రాకుండా ప్రజాప్రతినిధులు, పలువురు పెద్దపెద్ద వ్యాపారులు వారికి అండగా నిలుస్తున్నారని సమాచారం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతస్థాయి అధికారులు పెద్ద ఎత్తున ఆయా వ్యాపార సముదాయాలలో, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు చేపడితే మరిన్ని కల్తీ వస్తువుల తయారీ కేంద్రాలు బయటపడే అవకాశం ఉంది.

Updated Date - 2022-01-17T05:09:07+05:30 IST