క్రికెట్ అసోషియేషన్ ఎన్నికల్లో కవిత.. అజారుద్దీన్ ఏమన్నారంటే?

ABN , First Publish Date - 2021-06-17T21:35:23+05:30 IST

నగర క్రికెట్ అభివృద్ధిలో హెచ్‌సీఏ పాత్ర అందరికీ తెలిసినదే. అయితే గత కొన్నిరోజులుగా అంతర్గత కుమ్ములాటలు అసోషియేషన్‌కు తీవ్ర నష్టం చేస్తున్నాయి.

క్రికెట్ అసోషియేషన్ ఎన్నికల్లో కవిత.. అజారుద్దీన్ ఏమన్నారంటే?

హైదరాబాద్: నగర క్రికెట్ అభివృద్ధిలో హెచ్‌సీఏ పాత్ర అందరికీ తెలిసినదే. అయితే గత కొన్నిరోజులుగా అంతర్గత కుమ్ములాటలు అసోషియేషన్‌కు తీవ్ర నష్టం చేస్తున్నాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు నోటీసుల వ్యవహారం చర్చనీయాంశమైంది. దీనిపై అజారుద్దీన్ స్పందించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తనపై అనర్హత వేటు వేసే హక్కు అపెక్స్ కౌన్సిల్‌కు లేదన్నారు. అంబుడ్స్‌మెన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. హెచ్‌సీఏ కార్యవర్గాన్ని రద్దు చేసే అధికారం అంబుడ్స్‌మెన్‌కు మాత్రమే ఉందన్నారు. కార్యవర్గాన్ని రద్దు చేసి హెచ్‌సీఏకు మళ్ళీ ఎన్నిక నిర్వహించాలనుకుంటే తాను సిద్ధమని వ్యాఖ్యానించారు. అధ్యక్షడి హోదాలో హెచ్‌సీఏను కంట్రోల్ చేసే బాధ్యత తనపై ఉందన్నారు. 25ఏళ్ళుగా హెచ్‌సీఏను కొందరు వ్యక్తులు దోచుకుంటున్నారన్నారు. కోట్ల రూపాయల ఫండ్స్ వస్తున్నా.. ఉప్పల్ స్టేడియం తప్ప ఒక్క గ్రౌండ్‌ కూడా ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. కొందరు వ్యక్తుల అవినీతికి అడ్డుపడుతున్నందుకే తనపై తిరుగుబాటు అని వ్యాఖ్యానించారు. హైద్రాబాద్ క్రికెట్ అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. 


ఇదిలా ఉంటే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తనయురాలు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడుగుపెడుతున్నారన్న వార్తలపై అజార్ స్పందించారు. క్రికెట్ అసోసియేషన్ గాడి తప్పిందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదన్నారు. అలాగే కవిత పోటీ విషయం కూడా తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా పోటీ చేయొచ్చని, తప్పేం లేదని చెప్పారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌పై కవిత దృష్టి పెట్టారన్న గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏను ప్రక్షాళన చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వెలువడ్డాయి. 



Updated Date - 2021-06-17T21:35:23+05:30 IST