కవిత విజయంపై టీఆర్ఎస్ పబ్లిసిటీ.. టార్గెట్ ఏంటి?

ABN , First Publish Date - 2020-10-15T17:51:16+05:30 IST

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కల్వకుంట్ల కవిత అసాధారణ విజయం సాధించారా? అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న ప్రచారం వెనక ప్రత్యేక ప్రణాళిక ఉందా?

కవిత విజయంపై టీఆర్ఎస్ పబ్లిసిటీ.. టార్గెట్ ఏంటి?

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో  కల్వకుంట్ల కవిత అసాధారణ విజయం సాధించారా? అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న ప్రచారం వెనక ప్రత్యేక ప్రణాళిక ఉందా? లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో వాస్తవానికి జరిగిందేమిటి? గులాబీ లీడర్లు ఆర్భాటంగా చేస్తున్న పబ్లిసిటీ ఏమిటి? ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు దక్కలేదని పదే పదే నొక్కి చెప్పడం వెనక రీజన్‌ ఏమిటి?  దుబ్బాక ఉప ఎన్నికలో ఇదే విషయాన్ని ప్రచార అస్త్రంగా ఎందుకు ఎంచుకున్నారు? అసలు అధికార పార్టీ టార్గెట్‌ ఏమిటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి నల్లేరుపై నడకే అయినా..అధికార పార్టీ వేసిన ఎత్తులు విపక్ష నాయకుల్లో హీట్‌ పెంచాయి. కల్వకుంట్ల కవిత ఎన్నిక లాంఛనప్రాయమే అయినా చివరి వరకు ప్రలోభాల పర్వం కొనసాగింది. నిజామాబాద్ ఎమ్మెల్సీలో మొత్తం 824 ఓట్లు వున్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ 413గా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నాటికి టీఆర్‌ఎస్ పార్టీకి సుమారు 610 ఓట్లు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితే కాదు సాధారణ వ్యక్తిని బరిలోకి దింపినా ఈ గెలుపు ఖాయం. కానీ ఇక్కడేదో అద్భుతం సాధించినట్లుగా అధికార పార్టీ గొప్పలు చెప్పుకుంటుంది. మీడియాలో కలర్‌ఫుల్‌ యాడ్స్‌ ఇస్తూ ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటుంది.  


ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ ప్రతినిధులను పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంది. ఈ చేరికల కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తీవ్రంగా శ్రమించారు. అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించారు. మొత్తానికి కవితకు రికార్డు స్థాయిలో మెజారిటీ కట్టబెట్టారు. పోల్ అయిన మొత్తం 823 ఓట్లలో కవితకు 728 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన పోతన్ కర్ లక్ష్మీనారాయణకు 56 ఓట్లు వచ్చాయి. లక్ష్మీనారాయణపై 672 ఓట్ల మెజారిటీతో కవిత విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి సుభాష్‌రెడ్డికి 29 ఓట్లు మాత్రమే దక్కాయి. వాస్తవానికి అధికార పార్టీకి ఉన్న ఓట్లతో పోల్చుకుంటే ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు దక్కే అవకాశం లేదు. కానీ విపక్ష పార్టీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయని గులాబీ నాయకులు ప్రచారంతో హోరెత్తించడం గమనార్హం. 


నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాజకీయం రసవత్తరంగా సాగింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకుని..అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న బీజేపీకి అధికార పార్టీ షాక్ ఇచ్చింది. ప్రధానంగా బీజేపీకి ఓట్లు గణనీయంగా తగ్గించడంపైనే దృష్టి సారించింది. వార్‌వన్ సైడ్‌గానే ఉన్నప్పటికీ అధికార పార్టీ బలం, బలగం పెంచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి కమలం పార్టీకి చెందిన ప్రతినిధులను ఒక్కొక్కరిగా గులాబీ గూటికి చేర్చుకుంటూ ఆ పార్టీ లీడర్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. 


నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అసాధారణ గెలుపు సాధించినట్లుగా టీఆర్‌ఎస్‌ చెప్పుకోవడం వెనక రాజకీయ కోణం ఉన్నట్లు తెలుస్తోంది.  దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ భారీ విజయం నమోదు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అయితే నిజామాబాద్‌లో ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా చేశామని..అదే సీన్‌ ఇక్కడ కూడా రీపిట్‌ అవుతుందని చెప్పడం ద్వారా..ఓటర్లను డిఫెన్స్‌లో పడేలా చేయాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని నాయకులు గోరంతలు కొండతలు చేస్తూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారన్న చర్చ సాగుతోంది. దుబ్బాక నియోజకవర్గంలో సోలిపేట రామలింగారెడ్డి చేసిన అభివృద్ధి పనులతో పాటు సెంటిమెంట్‌ కూడా కలిసొస్తుందని పార్టీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. దుబ్బాక ఉపఎన్నిక గెలుపుతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు, ఆ తర్వాత జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విక్టరీ సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నారట. మరి గులాబీ పార్టీ పెద్దల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. 

Updated Date - 2020-10-15T17:51:16+05:30 IST