ప్రభుత్వ లాంఛనాలతో కల్యాణ్‌సింగ్ అంత్యక్రియలు పూర్తి

ABN , First Publish Date - 2021-08-23T23:28:26+05:30 IST

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ అంత్యక్రియలు ముగిసాయి. బులంద్‌షహర్‌లోని...

ప్రభుత్వ లాంఛనాలతో కల్యాణ్‌సింగ్ అంత్యక్రియలు పూర్తి

లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ అంత్యక్రియలు ముగిసాయి. బులంద్‌షహర్‌లోని నరోరా టౌన్‌  బన్సీ ఘాట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. కల్యాణ్ సింగ్ చితికి ఆయన కుమారుడు రాజ్‌వీర్ సింగ్ నిప్పుపెట్టారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు బీజేపీ నేతలు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మంత్రులు ప్లహ్లాద్ పటేల్, వీకే సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితర నేతలు చివరిసారిగా తమ ప్రియతమ నేతకు నివాళులర్పించారు. దీనికి ముందు లక్నోలోని అహిల్యాబాయ్ హోల్కర్ స్టేడియం నుంచి కల్యాణ్ సింగ్ పార్థివదేహాన్ని వాహనంలో ఉంచి 'అంతిమయాత్ర' నిర్వహించారు.


కాగా, కల్యాణ్ సింగ్‌తో బీజేపీ అనుబంధాన్ని హోం మంత్రి అమిత్‌షా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, బాపూజీ (కల్యాణ్ సింగ్) మృతి బీజేపీకి తీరని లోటని అన్నారు. ఆయన లేని లోటు భర్తీ చేయడం చాలా కష్టమని చెప్పారు. రామమందిర్‌ నిర్మాణానికి శంకుస్థాపన రాయి వేయగానే ఆయన తన జీవితాశయం నెరవేరిందని చెప్పారని, రామజన్మ భూమి ఆందోళన కోసం రెండో ఆలోచనకు కూడా తావులేకుండా తన ముఖ్యమంత్రి పదవి వదులుకున్నారని గుర్తుచేశారు.

Updated Date - 2021-08-23T23:28:26+05:30 IST