కల్యాణ రసం

ABN , First Publish Date - 2020-02-29T17:04:53+05:30 IST

టొమాటోలు-2 (ముక్కలుగా చేసి), పచ్చిమిర్చి- 3, చింతపండు-సగం నిమ్మచెక్క పరిమాణం, వెల్లుల్లి రెబ్బలు-4, కరివేపాకు-గుప్పెడు, పసుపు-పావు టీస్పూన్‌, ఉప్పు- సరిపడా,

కల్యాణ రసం

కావలసినవి: టొమాటోలు-2 (ముక్కలుగా చేసి), పచ్చిమిర్చి- 3, చింతపండు-సగం నిమ్మచెక్క పరిమాణం, వెల్లుల్లి రెబ్బలు-4, కరివేపాకు-గుప్పెడు, పసుపు-పావు టీస్పూన్‌, ఉప్పు- సరిపడా, కుక్కర్‌లో- ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి, సాంబారుపొడి-రెండు టీస్పూన్లు, కారం-పావు  టీస్పూను, తరిగిన కొత్తిమీర. కందిపప్పు-చిన్న గ్లాసుడు తీసుకుని బాగా కడిగి కుక్కర్‌లో విడిగా ఉడికించి మెత్తగా చేసి రెడీగా పెట్టుకోవాలి.


తయారీ: కుక్కర్‌లో టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. వీటిలో ఒక గ్లాసు నీరు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకూ స్టవ్‌ మీద ఉడికించాలి. 

కుక్కర్‌ నుంచి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత పప్పుగుత్తితో కుక్కర్‌లోని మిశ్రమాన్ని మరింత మెత్తగా చేయాలి. ఆ తర్వాత కుక్కర్‌ని మళ్లీ స్టవ్‌ మీద పెట్టి అందులో రెండు టీస్పూన్ల సాంబారుపొడి, పావు టీస్పూన్‌ కారం వేసి కలపాలి. అందులో తరిగిన కొత్తిమీరను కాడలతో సహా వేయాలి.

మళ్లీ మరో గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి. ఉప్పు తక్కువవుతందనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు. మధ్యమధ్యలో కలుపుతూ రసాన్ని బాగా మరిగించాలి. ఈ రసం ఒక పొంగుకు వచ్చిన తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మరిగించాలి. తరువాత ఉడికించి మెత్తగా చేసిన పప్పును రసంలో  కలపాలి.

రసం ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది కాబట్టి దాన్ని పదిహేను నిమిషాలపాటు మరిగించాలి. రసం మరుగుతుండగానే ఒక చిన్న కడాయి తీసుకుని అందులో ఒక టీస్పూను నూనె, ఒక టీస్పూను ఆవాలు వేసి అవి చిటపటలాడేటప్పుడు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని, రెండు మూడు ఎండు మిర్చి ముక్కలను తాళింపులో వేయాలి. అవి కాస్త వేగినట్టయిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేయాలి. 

చిటపటలాడుతున్న తాలింపును ఉడుకుతున్న రసంలో వేసి మరో రెండు మూడు నిమిషాలు మరిగించాలి. అంతే నోరూరించే కల్యాణ రసం రెడీ. ఈ రసం వేసవిలో చాలా మంచిది.

Updated Date - 2020-02-29T17:04:53+05:30 IST