Abn logo
Nov 28 2020 @ 00:27AM

కల్యాణం... కమనీయం

శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు

నేత్రపర్వంగా శ్రీనివాసుడి కల్యాణం 

తరలివచ్చిన భక్తజనం 

అట్టహాసంగా స్వామివారి ఎదుర్కోలు

ఘనంగా అన్నదానం

ఖానాపూర్‌, నవంబరు 27: కల్యాణం.. కమనీయం.. కనివిని ఎరుగని శుభతరుణం... అన్నట్లుగా ఖానాపూర్‌లో శుక్రవారం శ్రీలక్ష్మీవేంకటేశ్వరుల కల్యాణ ఘట్టం జరిగింది. మండల కేంద్రంలోని పద్మావతినగర్‌ కాలనీలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ 36వ బ్రహ్మోత్సవాలు గత రెండు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ప్రారంభమైన స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో బాగంగా శుక్రవారం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరుల కళ్యాణ ఘట్టాన్ని ఆలయ కమిటి ఆద్వర్యంలో నేత్ర పర్వంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని పురష్కరించుకుని నిర్మల్‌ జిల్లా నలుమూలల నుండే కాకుండా జగిత్యాల, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండి భక్తుల తాకిడి మొదలైంది. ఈ సందర్భంగా పట్టణంలోని తిమ్మాపూర్‌ పద్మశాలి సంఘం ఆద్వర్యంలో అమ్మవారికి మంగళసూత్రం, మెట్టెలు, తదితర ఆభరణాలు, పట్టువస్ర్తాలను ఓడిబియ్యాన్ని సమర్పించారు. మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ అనూషా దంపతులు పట్టువస్ర్తాలు, తలంబ్రాలను ఊరేగింపుగా తెచ్చి శ్రీలక్ష్మీ వేంకటేశ్వరులకు సమర్పించారు. అనంతరం ఉదయం 10 గంటల సమయంలో పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌక్‌ నుండి లక్ష్మీదేవి, వేంకటేశ్వర స్వామిల ఉత్సవ విగ్రహాల ఎదుర్కోలును అట్టహాసంగా నిర్వహించారు. ఎదుర్కోలు సందర్భంగా భక్తులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.  వందలాది మంది భక్తులు తిలకిస్తుండగా యజ్ఞాచార్యులు చక్రపాణి వాసుదేవాచార్యుల పర్యవేక్షణలో వేదపండితులు చక్రపాణి నరసింహమూర్తి, నిమ్మగడ్డ సందీ్‌పశర్మలు ఉదయం 11 గంటలకు శ్రీలక్ష్మీ వేంకటేశ్వరుల కళ్యాణఘట్టాన్ని నయనానందకరంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇక్కట్లు కలుగకుండా ఆలయకమిటి, భక్తబృందం ఆద్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.  మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ దంపతులు, టిజీవో జిల్లా అధ్యక్షులు అజ్మీరా శ్యాంనాయక్‌, ఆలయకమిటి అధ్యక్షులు అడ్డగట్ల రాజన్న ,మార్కెట్‌ కమిటి చైర్మన్‌ గంగనర్సయ్య, పీఏసిఎస్‌ వైస్‌ చైర్మన్‌ కరిపె శ్రీనివాస్‌, ఏడవ వార్డు కౌన్సిలర్‌ గుగ్లావత్‌ కిషోర్‌నాయక్‌, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు బండారి కిషోర్‌, నిమ్మల రమేష్‌, తుమ్మనపెల్లి లక్ష్మణ్‌, రము, భీమన్న, అంజయ్య, ద్యావతి రాజేశ్వర్‌, ఎనగందుల నారాయణ తదితరులున్నారు.

Advertisement
Advertisement