ఆట మొదలుపెట్టిన కమల్.. అన్నాడీఎంకే, డీఎంకేల్లో గుబులు..

ABN , First Publish Date - 2020-10-06T16:56:12+05:30 IST

మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు, ఉలగనాయగన్‌ కమల్‌హాసన్‌ పొలిటికల్‌ గేమ్‌షో అట్టహాసంగా ఆరంభమైంది. ఆదివారం సాయంత్రం బిగ్‌బాస్‌ సీజన్‌-4 ప్రారంభోత్సవంలో కమల్‌

ఆట మొదలుపెట్టిన కమల్.. అన్నాడీఎంకే, డీఎంకేల్లో గుబులు..

చెన్నై: మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు, ఉలగనాయగన్‌ కమల్‌హాసన్‌ పొలిటికల్‌ గేమ్‌షో అట్టహాసంగా ఆరంభమైంది. ఆదివారం సాయంత్రం బిగ్‌బాస్‌ సీజన్‌-4 ప్రారంభోత్సవంలో కమల్‌ రాజకీయ ప్రచారం ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే పంచ్‌ డైలాగులతో కమల్‌ తన పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కమల్‌ ప్రారంభించిన డిజిటల్‌ రాజకీయ ప్రచారం... కరోనా లాక్‌డౌన్‌ కారణంగా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించలేని స్థితిలో ఉన్న అన్నాడీఎంకే, డీఎంకేల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ రెండు పార్టీలు ఇక కమల్‌ ప్రచారానికి అడ్డుకట్ట వేయలేని పరిస్థితిలో ఉన్నాయి. బిగ్‌బాస్‌ షో వ్యాఖ్యాతగా కమల్‌ మరోమారు విశ్వరూపం ప్రదర్శించనున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా 5 నెలల పాటు ఇంటివద్దే ఉంటూ ట్విట్టర్‌లో సందేశాలిస్తూ రాజకీయ వ్యవహారాలు నడిపిన కమల్‌కు బిగ్‌బాస్‌ గేమ్‌షో ప్రత్యక్ష రాజకీయ వేదికగా మారింది. అందివచ్చిన ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌-4 ప్రోమోలోనే కమల్‌ పంచ్‌ డైలాగుల ద్వారా పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రోమోలో ‘తప్పు జరిగితే నిలదీస్తా... మంచి జరిగితే ప్రోత్సహిస్తా’ నంటూ తమిళ డైలాగులతో కమల్‌ ప్రేక్షకులను అలరించారు.


ఆచితూచి అడుగేసిన కమల్‌ 

అసెంబ్లీ ఎన్నికలు వచ్చే యేడాది ఏప్రిల్‌, మే నెలలో జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహరచనల్లో తలమునకలయ్యాయి. అదే సమయంలో కమల్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీదిమయ్యం పార్టీలో 5 నెలలుగా ఎలాంటి సందడి కనిపించలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలవక పోయినా కమల్‌ పార్టీకంటూ ప్రత్యేక ఓటు బ్యాంక్‌ ఏర్పడింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో కనీసం పదివేలకు పైగా ఓట్లు సంపాదించుకోగలిగారు. ఆ ఓటు బ్యాంక్‌ కలిగించిన ఉత్సాహంతో కమల్‌ పార్టీని ఎన్నికల వైపు మళ్లించేందుకు అనువుగా బిగ్‌బాస్‌ గేమ్‌షోను రాజకీయ వేదికగా మార్చుకోవటంలో సఫలీకృతులయ్యారు.


తృతీయ కూటమి...

అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలతో నిమిత్తం లేకుండా తృతీయ కూటమి ఏర్పాటు చేయాలని కమల్‌ భావిస్తున్నారు. ఇటీవల పార్టీ బూత్‌కమిటీలను ఏర్పాటు చేసే విషయమై జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో కమల్‌ ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా, కొన్ని పార్టీలతో తృతీయ కూటమిగా బరిలోకి దిగినా గెలుపు మనదే నంటూ పార్టీనేతల్లో ఉత్సాహం నింపారు. లాక్‌డౌన్‌లో ట్విట్టర్‌కే పరిమితమై పార్టీ వ్యవహరాలు నడిపిన కమల్‌కు బిగ్‌బాస్‌ గేమ్‌ షో రాజకీయ ప్రచార వేదికగా మారింది. ఆ షోలో వారానికి రెండుసార్లు అంటే శని, ఆదివారాల్లో కోట్లాదిమంది ప్రేక్షకులు చూస్తుండగా కమల్‌ తన మనసులోని మాటలను పార్టీ ప్రచారాస్త్రాలుగా సంధించబోతున్నారు. ఈ విషయమే ప్రస్తుతం మక్కల్‌ నీదిమయ్యమ్‌ నేతలు, కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు. తన రాజకీయ లబ్ధి కోసం ఓ టీవీ గేమ్‌షోను ఉపయోగించుకోవడం భావ్య మేనా అంటూ ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శలను సైతం కమల్‌ సునాయాసంగా తిప్పి కొడుతున్నారు. బిగ్‌బాస్‌ గేమ్‌షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి, సినిమాల్లో నటించడానికి ప్రధాన కా రణం తన పార్టీకి నిధులు సమ కూర్చుకోవడానికేనని కమల్‌ బాహాటంగా ప్రకటించారు.


ప్రధాన పార్టీల్లో కలవరం

కమల్‌ బిగ్‌బాస్‌ గేమ్‌షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించడం అన్నాడీఎంకే, డీఎంకే నేతలకు వణుకు పుట్టిస్తోంది. కారణంగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో ఎక్కడా ప్రచార సభలు, పార్టీ సమావేశాలు జరుపలేని స్థితిలో ఉన్నాయి. కరోనా నిరోధక నిబంధనల వల్ల అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా మహనాడు, నేతల వర్ధంతి, జయంతి వేడుకల సాకుతో బహిరంగ సభలు నిర్వహించలేక పోయాయి. ప్రత్యేకించి వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరుతామనే ఆకాంక్షతో ఉన్న డీఎంకే ప్రస్తుతం ఎక్కడా సభలు, సమావేశాలు, మహా నాడులు నిర్వహించలేక వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ జిల్లా శాఖ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ కాలయాపన చేస్తోంది. అన్నాడీఎంకే ప్రభుత్వ కార్యక్రమాలు కాస్త ప్రచార సభలుగా మార్చుకోగలుగుతోంది. అయినా కరోనా నిబంధనల కారణంగా ఆ కార్యక్రమాలకు జనసమీకరణ చేయలేకపోతోంది. ఈ రెండు పార్టీల కూటముల్లోని పార్టీల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. అయితే మక్కల్‌ నీదిమయ్యం నేత కమల్‌ మాటలను వారానికి రెండు సార్లు బిగ్‌బాస్‌ గేమ్‌షో ద్వారా కోట్లాదిమంది ప్రేక్షకులు వినబోతున్నారు. కరోనా కాలంలో కమల్‌కు ఈ గేమ్‌షో ప్లస్‌పాయింట్‌గా మారింది. తొలిరోజే కమల్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ నిర్మాణశైలిని వివరిస్తూ పరోక్షంగా పొలిటికల్‌ పంచ్‌ డైలాగులు విసిరారు. కిచెన్‌లో గ్యాస్‌ స్టౌకు నాలుగు బర్నర్లున్నాయి. వాటిలో రెండు బర్నర్లు  మాత్రమే మండుతాయి. హౌస్‌మేట్ల కడుపు మండుతుంది అంటూ చెణకు విసిరారు. ఆ తర్వాత గేమ్‌షో వేదికపై కరోనా బాధితులకు సేవలందించిన వారిని కమల్‌ కొనియాడుతూ ప్రసంగించారు.. కరోనా బారినపడి మృతి చెందిన సీఐ సతీమణి, బాధితులకు నిర్విరామంగా సేవలందించిన వైద్యులు, నర్సులు, సంఘసేవకులు, పారిశుధ్య కార్మికులతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా మాట్లాడి వారికి చేతులెత్తి మొక్కారు. వారి సేవలను కీర్తించారు. ఈ సంఘటన ప్రేక్షకుల మదిలో బలంగా నాటుకుంది.


నిరసనలు... నిబంధనలు

బిగ్‌బాస్‌ గేమ్‌షోను అడ్డుకునేందుకు ఎప్పటిలాగే తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆ గేమ్‌షో జరుపకూడదంటూ కొన్ని వర్గాలు వాదించాయి. అయితే గేమ్‌షో నిర్వాహకులు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామంటూ ప్రకటించి, ఆ షోను అట్టహాసంగా ప్రారంభించారు. హౌస్‌మేట్లకు కరోనా ముందస్తు వైద్యపరీక్షలు జరిపారు. బిగ్‌బాస్‌ భవంతిని రోజూ క్రిమిసంహారక మందుతో శుభ్రం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే కమల్‌ ప్రేక్షకుల ఎదుట నిలిచి మాట్లాడే వేదిక చూపరులను మైమరపించే విధంగా రూపొందించారు. ఈ బ్రహ్మాండమైన వేదికపై కమల్‌ ఒంటరిగా నిల్చుని, తన ముందు గతంలో మాదిరి ప్రేక్షకులున్నట్లుగా భావించి తొలిరోజే వ్యాఖ్యాతగా అందరినీ ఆకట్టుకోగలిగారు. వందరోజులపాటు సాగే ఈ బిగ్‌బాస్‌ గేమ్‌షోలో వారానికి రెండు సార్లు కమల్‌హాసన్‌ రాజకీయ అంశాలపై తన మనసులోని భావాలను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించి పరోక్షంగా పార్టీ ప్రచారాన్ని సజావుగా సాగించి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కానున్నారు. అందివచ్చిన ఈ అవకాశాన్ని కమల్‌ నూటికి నూరుపాళ్లు సద్వినియోగం చేసుకుని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలకంటే ముందుగా దూసుకెళ్తారని తెలుస్తోంది. కమల్‌ చేసే ఈ గేమ్‌షో రాజకీయ ప్రచారాలను ప్రధానమైన ద్రావిడపార్టీలూ రెండు ఎలా ఎదుర్కొంటాయో వేచి చూడాల్సిందే!

Updated Date - 2020-10-06T16:56:12+05:30 IST