సమీపిస్తున్న ఎన్నికలు.. కమల్ సరికొత్త వ్యూహం..!

ABN , First Publish Date - 2020-10-24T15:11:55+05:30 IST

మక్కల్‌ నీది మయ్యం నాయకుడు కమల్‌హాసన్‌ అసెంబ్లీ ఎన్నికలకు సరికొత్త వ్యూహరచన సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌-4 షోలో వీలునప్పుడల్లా పార్టీ లక్ష్యాల కోసం, రాష్ట్ర ప్రజలకు తాను చేయనున్న కొత్త సంక్షేమ పథకాలపై ప్రకటించాలన్నది తొలి నిర్ణయం.

సమీపిస్తున్న ఎన్నికలు.. కమల్ సరికొత్త వ్యూహం..!

చెన్నై : మక్కల్‌ నీది మయ్యం నాయకుడు కమల్‌హాసన్‌ అసెంబ్లీ ఎన్నికలకు సరికొత్త వ్యూహరచన సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌-4 షోలో వీలునప్పుడల్లా పార్టీ లక్ష్యాల కోసం, రాష్ట్ర ప్రజలకు తాను చేయనున్న కొత్త సంక్షేమ పథకాలపై ప్రకటించాలన్నది తొలి నిర్ణయం. ఇక పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా నాయకులతో పర్యటనలు చేయించి ప్రజల నుంచి విరాళాలు సేకరించాలన్నది రెండో నిర్ణయంగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోగా తృతీయ కూటమిని ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోతే ఒంటరి పోరుకు దిగాలన్నది  మూడో నిర్ణయంగా కనిపిస్తోంది. ఈ మూడు నిర్ణయాలను అమలు చేయడానికి కమల్‌హాసన్‌ తగిన సన్నాహాలు చేపడుతున్నారు. ఇటీవల జరిగిన  కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో సీనియర్‌ నేతలు పార్టీ అభివృద్ధికి నిధులు కొరత ఉందని కమల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్‌ల్లో పాల్గొనకపోవడం వల్ల సంపాదన కొరవడిందని, వీలైతే ప్రజల నుంచి పార్టీ కోసం విరాళాలు సేకరిద్దామని కమల్‌ సలహా ఇచ్చారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా అంగ, ఆర్థిక బలం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకుంటే ఎన్నికల ఖర్చులు కూడా తగ్గుతాయని కమల్‌ చేసిన సూచనకు పార్టీ నేతలంతా విస్తుపోయారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించడం కొత్తేమీ కాదని, రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఆ పద్ధతినే దశాబ్దాలుగా అనుసరిస్తున్నాయని కూడా కమల్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్నాడీఎంకే, డీఎంకేలు పలుమార్లు అధికారంలోకి వచ్చాయి గనుక ఆ పార్టీలు ప్రజల నుంచి నిధుల సేకరించాల్సిన స్థితిలో లేవని, మక్కల్‌నీదిమయ్యం లాంటి కొత్త పార్టీలు విరాళాల కోసం ప్రజల వద్ద చేతులు చాచక తప్పదని కమల్‌ స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవక ముందే పార్టీ లక్ష్యాలను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు బిగ్‌బాస్‌ సీజన్‌-4 వేదిక తనకు అన్ని విధాలా అనువుగా ఉందని కమల్‌ ఇటీవల తనను కలుసుకున్న పార్టీ సీనియర్‌ నేతలకు చెప్పారు. 


బిగ్‌బాస్‌ సీజన్‌-4 తొలివారంలోనే టీవీ ద్వారా నాలుగుకోట్ల మంది తమిళ ప్రజలు తన మాటలు విన్నారని, ఇక ప్రతి శని, ఆదివారాల్లో షోలో పాల్గొని పార్టీ ఆశయాలు, లక్ష్యాలు, ఎన్నికల మేనిఫెస్టోలో పొందపరచనున్న అంశాలను వివరిస్తానని కమల్‌ తెలిపారు. తాజాగా సెక్యులర్‌ కూటమిలోకి రమ్మంటూ కాంగ్రెస్‌ ఆహ్వానంపై ప్రస్తుతం కమల్‌హాసన్‌ సీనియర్‌ నేతలతో  చర్చిస్తున్నారు. డీఎంకే కూటమిలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ పార్టీ సీట్ల కేటాయింపుల సమయంలో వైదొలగుతుందని కమల్‌ భావిస్తున్నారు. కాంగ్రెస్‌... డీఎంకే కూటమి నుంచి బయటపడితే ఆ పార్టీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని కూడా కమల్‌హాసన్‌ యోచిస్తున్నారు.

Updated Date - 2020-10-24T15:11:55+05:30 IST