కాంగ్రెస్సీకరణలో కమలనాథులు

ABN , First Publish Date - 2021-09-15T05:48:13+05:30 IST

‘నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని ముందే తెలిస్తే నా కుర్తా మార్చుకుని వెళ్లేవాడిని..’ అని గుజరాత్ ప్రభుత్వ కొత్త సారథి భూపేంద్ర పటేల్ తన సన్నిహితులతో చెప్పారు. ఆదివారం ఉదయం బిజెపి శాసనసభా పార్టీ సమావేశానికి వెళ్లినప్పుడు...

కాంగ్రెస్సీకరణలో కమలనాథులు

‘నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని ముందే తెలిస్తే నా కుర్తా మార్చుకుని వెళ్లేవాడిని..’ అని గుజరాత్ ప్రభుత్వ కొత్త సారథి భూపేంద్ర పటేల్ తన సన్నిహితులతో చెప్పారు. ఆదివారం ఉదయం బిజెపి శాసనసభా పార్టీ సమావేశానికి వెళ్లినప్పుడు, ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ పరిశీలకులు తననే ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తారని ఆయన ఊహించలేదు. ఆ రోజు సాయంత్రం తన బంధుమిత్రులతో కలిసేందుకు ఒక కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నారట. అయితే ఢిల్లీపెద్దలు ఎవరూ ఊహించని విధంగా భూపేంద్ర పటేల్‌ను అతి రహస్యంగా ఎంపిక చేసి ముఖ్యమంత్రిగా నియమించారని, పార్టీ శాసన సభ్యులు, సీనియర్ నేతలు, ఆఖరుకు ఆకస్మికంగా గద్దె దిగాల్సి వచ్చిన విజయ్ రూపానీకి కూడా ఈ మార్పు గురించి తెలియదని అహ్మదాబాద్‌లో పనిచేస్తున్న జాతీయ మీడియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు.


ఒక జాతీయపార్టీ పగ్గాలు పూర్తిగా ఒక వ్యక్తి హస్తగతం అయినప్పుడు రాష్ట్రాల్లో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఎంత బూటకంగా మారుతుందో చెప్పడానికి భూపేంద్ర ఎంపికే నిదర్శనం. ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఇదేవిధంగా మారేవారు. ఢిల్లీలో పార్టీ అధిష్ఠానం అడుగులకు మడుగులొత్తకపోతే ముఖ్యమంత్రులను రాత్రికి రాత్రి మార్చేసేవారు. ఆ తర్వాత తతంగం మామూలే. ఒకటి రెండు రోజుల సస్పెన్స్ తర్వాత ఢిల్లీ నుంచి పరిశీలకులు సీల్డ్ కవర్‌తో రాష్ట్ర రాజధానికి రావడం, శాసనసభ్యులతో మాట్లాడుతున్నట్లు నాటకం ఆడడం, చివరకు అధిష్ఠానం అనుకున్న వ్యక్తి పేరును ప్రకటించడం జరిగేది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క బ్రహ్మానంద రెడ్డి తప్ప ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రీ పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. 1971–1977, 1980–89ల మధ్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులను కాంగ్రెస్ అధిష్ఠానం 9 సార్లు మార్చింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాజస్థాన్, గుజరాత్, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఇదే తతంగం కొనసాగింది. ఈ సంస్కృతి వల్లే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ 1977లో కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు.


1982లో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి అంజయ్యను నాటి ప్రధానమంత్రి కుమారుడు రాజీవ్‌గాంధీ అవమానించిన ఉదంతాన్ని ఇప్పటి ప్రధాని మోదీ మూడేళ్ల క్రితం పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగిస్తూ స్వయంగా చెప్పారు. ఆ తర్వాత కూడా అనేక ప్రసంగాల్లో కాంగ్రెస్ సంస్కృతికి లోను కావద్దని తమ పార్టీ సభ్యులకు ఆయన హితవు చెప్పారు. 


విచిత్రమేమంటే ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ అనుసరించిన సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఏడు సంవత్సరాల పాలనలో స్వయంగా, సంపూర్ణంగా అలవర్చుకున్నట్టు స్పష్టమవుతోంది. ఢిల్లీ పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ మూడుసార్లు ముఖ్యమంత్రులను ఎంపిక చేసి గుజరాత్ ప్రజలపై రుద్దిన తీరు కాంగ్రెస్ సంస్కృతికి ఏ మాత్రం భిన్నంగా లేదు. అక్కడ పార్టీ శాసనసభ్యుల అభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇచ్చినట్లు లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితుడయ్యే నేతకు జనంలో ఆదరణ ఉండాలని; అతడు బలమైన, అనుభవం గల, అందరికీ ఆమోదయోగ్యమైన నేత అయి ఉండాలని ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ శాసనసభా పార్టీ సమావేశానికి ముందు విలేకరులకు చెప్పారు. ఆరుసార్లు శాసనసభకు ఎంపికై అనేక మంత్రిత్వశాఖల్ని నిర్వహించిన అనుభవం ఉన్న నితిన్ పటేల్‌కు రెండో సారి చేదు అనుభవం ఎదురైంది. ఆయన కూడా భూపేంద్ర పటేల్ మాదిరి గుజరాత్‌లో బలమైన పటేల్ వర్గానికి చెందిన నాయకుడే. ప్రజాస్వామికంగా శాసనసభా పార్టీ సమావేశం జరిగితే బహుశా ఆయననే ఎన్నుకునేవారేమో. కాని అధిష్ఠానం అత్యంత మెతకస్వభావుడు, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత, మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ అనుయాయుడు అయిన భూపేంద్ర పటేల్‌ను ఎంచుకుంది. ‘మా ముఖ్యమంత్రి కొన్ని కీలక అంశాలపై స్వంత నిర్ణయాలు తీసుకోరు. వాటిపై ఆయన ఢిల్లీ పెద్దల్ని సంప్రదించాల్సిందే’ అని గుజరాత్ సెక్రటేరియట్‌లో, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ హయాంలో పనిచేసిన ఒక అధికారి చెప్పారు. గుజరాత్ సిఎంఓలో మోదీకి అత్యంత సన్నిహితుడైన అధికారి కైలాష్ నాథన్‌కు పదవీవిరమణ చేసిన తర్వాత కూడా ఆరుసార్లు పొడిగింపు లభించడం, ఆయనే ఢిల్లీతో సంప్రదించి పరిపాలన సాగించడం ఇందుకు నిదర్శనం. ఇప్పుడు తాజా నేత భూపేంద్ర పటేల్ మరో నామమాత్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి ఏ మాత్రం సందేహించనవసరం లేదు. అంజయ్యను అవమానించి, తొలగించడం వల్ల తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని విమర్శించిన నరేంద్రమోదీకి గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి విషయంలో గుజరాతీల ఆత్మగౌరవం ఎందుకు గుర్తురాలేదన్న విషయం మాత్రం చర్చనీయాంశం. మన్మోహన్ సింగ్‌ను కీలుబొమ్మ ప్రధానమంత్రిగా అభివర్ణించిన వారే కీలుబొమ్మ ముఖ్యమంత్రులను ఎందుకు నియమిస్తున్నారన్న విషయం కూడా ఆలోచించవలసి ఉంటుంది.


ఈ ఏడాది మోదీ–అమిత్ షా లు మార్చిన ముఖ్యమంత్రుల్లో విజయ్ రూపానీ అయిదో నేత. ఉత్తరాఖండ్‌లో నాలుగునెలల్లో ఇద్దరు ముఖ్యమంత్రుల్ని మార్చారు. అస్సాంలో సర్బానంద సోనోవాల్ స్థానంలో హిమంత బిశ్వాస్‌ను నియమించారు. కర్ణాటకలో యడ్యూరప్ప బదులు బసవరాజ బొమ్మయిని కూర్చోపెట్టారు. మోదీ హయాంలో బిజెపి కూడా కాంగ్రెస్ మాదిరే అధిష్ఠానవర్గాన్ని అత్యంత బలోపేతంగా మార్చి ప్రజలు, వారెన్నుకున్న ప్రజా ప్రతినిధుల అభిప్రాయానికి విలువలేకుండా నిర్ణయాలు తీసుకుంటుందన్న అభిప్రాయం ఈ నియమకాలతో బలపడింది. కాంగ్రెస్‌లో ప్రతి నిర్ణయమూ కాంగ్రెస్ అధిష్ఠానవర్గం తీసుకోవడం, రాష్ట్రాల్లో నాయకత్వం స్వంత అభిప్రాయాలకు విలువ లేకుండా చేయడం అసహ్యించుకునే వారు బిజెపిలో కూడా అదే సంస్కృతి ప్రవేశించడంపై ఏ భావం వ్యక్తం చేయాలో తెలీని పరిస్థితి ఏర్పడింది.


గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ ఢిల్లీలో బిజెపి అధిష్టానం అంటే లెక్కలేనట్లుగా వ్యవహరించిన నరేంద్రమోదీయే ఇప్పుడు తాను ఢిల్లీ పీఠాన్ని అధిష్టించిన తర్వాత సర్వం తానే అయి వ్యవహరించడం మూలంగా ఈ పరిస్థితి తలెత్తింది. కేంద్రమంత్రులు, వ్యవస్థలు తన పట్టులోకి రాగా రాష్ట్రాల నాయకత్వాలు కూడా తన నియంత్రణలోకి పూర్తిగా వచ్చేందుకు ఆయన బలంగా ప్రయత్నాలు చేశారు. అస్సాంలో సర్బానంద సోనోవాల్ నాయకత్వంలో మంచి పరిపాలన అందించినందుకు జనం బిజెపిని రెండోసారి ఎన్నుకోగా మోదీ అస్సాం బిజెపి శాసనసభా పార్టీ అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా సోనోవాల్ బదులు హిమంత బిశ్వాస్ శర్మను ముఖ్యమంత్రిగా నియమించారు. ఇదే హిమంత బిశ్వాస్ శర్మ కాంగ్రెస్‌లో అధిష్ఠాన సంస్కృతికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బిజెపిలో చేరిన విషయం అందరికీ తెలుసు. నిజానికి ఉత్తరప్రదేశ్‌లో కూడా మోదీ, అమిత్ షాల అభీష్టమే సాగి ఉంటే యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కాదు. ఆయన వెనుక బలమైన శక్తులు ఉండడం వల్లే మోదీ ఆయనను విస్మరించలేకపోయారు. 


నిజానికి మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రాల్లో బిజెపిని బలోపేతం చేసిన నేతల్లో శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, మనోహర్ ఫరిక్కర్, యడ్యూరప్ప, సుశీల్ మోడీ వంటి నేతలు ఉన్నారు. వీరంతా ఆడ్వాణీ ప్రోత్సహించిన నేతలు. కానీ రాష్ట్రాల స్థాయిలో తన పట్టు బిగించే క్రమంలో భాగంగా మోదీ ఈ నేతల పట్టును నీరుకార్చే ప్రయత్నం చేశారు. పోనీ ప్రత్యామ్నాయంగానైనా బలమైన, ప్రతిభావంతులైన ప్రజానాయకులను నియమించారా అంటే అదీ లేదు. గుజరాత్‌లో మోదీ విధేయురాలైన ఆనందీబెన్ పటేల్ పటీదార్ల ఉద్యమం మూలంగా తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ విజయ్ రూపానీ కొవిడ్ రెండో ప్రభంజనం సమయంలో పూర్తిగా విఫలమై అసమర్థ ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. హర్యానాలో మనోహర్‌లాల్ ఖట్టర్ హయాంలో బిజెపి బలహీనపడి గత ఎన్నికల్లో మెజారిటీ సంపాదించలేక, దుష్యంత్ చౌటాలాతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవలిసి వచ్చింది. జార్ఖండ్‌లో రఘుబర్ దాస్ అధికారం కోల్పోయారు. హర్యానాలో మోదీని శ్రీరాముడు, కృష్ణుడుతో పోల్చిన ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ మహిళలతో సహా వివిధ వర్గాలపై పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేసి చివరకు తప్పుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రెండువారాల ముందు ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని పార్టీ నేతగా రంగంలోకి దించి అభాసుపాలు కావల్సి వచ్చింది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థులను ప్రకటించకుండా మోదీనే ప్రధాన సారథిగా ప్రచారరంగంలోకి దించడం, పార్టీ విజయం సాధిస్తే ఆ ఘనత మోదీకి ఇవ్వడం, ఓడిపోతే స్థానిక నాయకులను బాధ్యులను చేయడం బిజెపి సంస్కృతిగా కొనసాగుతోంది.


కాంగ్రెస్‌లో నేతల ఆకర్షణ కొనసాగినంత కాలం అధిష్ఠాన సంస్కృతి బాగానే విజయవంతం అయింది. అధిష్ఠానం బలంగా లేకపోయినా స్థానిక నేతలు బలంగా ఉండడం వల్ల పార్టీ నిలదొక్కుకోగలిగింది. మోదీ హవా కూడా ఆయన ఆకర్షణ ఓట్లు తేగలిగినంత కాలమే సాగుతుంది. స్థానికంగా బలహీనులైన, కీలుబొమ్మలైన నేతలను ప్రోత్సహిస్తే కేంద్రం బలహీనపడ్డప్పుడు తదనుగుణంగా రాష్ట్రాల స్థాయిలో కూడా బిజెపి కుప్పకూలిపోతుంది. బిజెపి కాంగ్రెస్సీకరణ దానితో సంపూర్ణమవుతుంది.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-09-15T05:48:13+05:30 IST