230 ఏళ్ల అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి !

ABN , First Publish Date - 2020-11-08T15:09:00+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. 230 ఏళ్ల ఆ దేశ చరిత్రలో తొలిసారి ఓ మహిళ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమెనే భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్(55).

230 ఏళ్ల అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి !

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. 230 ఏళ్ల ఆ దేశ చరిత్రలో తొలిసారి ఓ మహిళ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమెనే భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్(55). డెమొక్రటిక్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా గెలిచిన కమల జనవరి 20న అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌తో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్నారు. నల్లజాతీయులకు, ఆసియా అమెరికన్లకు, ప్రత్యేకించి భారత సంతతి వారికి అగ్రరాజ్యం గడ్డపై ఇంత పెద్ద అవకాశం లభించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఉపాధ్యక్షురాలిగా గెలిచిన కమలా... డెలావర్‌లో జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... "నా విజయం మహిళలకు నాంది. అమెరికా కార్యాలయంలో అడుగుపెట్టబోతున్న తొలి మహిళను నేనే.. కానీ చివరిదాని మాత్రం కాదు. నేనిప్పుడు సాధించిన ఈ విజయం తర్వాత వచ్చే మహిళ నేతలకు మార్గదర్శకం." అని అన్నారు. 


కాగా, కమల తల్లి శ్యామలా గోపాలన్ స్వస్థలం చెన్నై. వివాహానికి ముందే ఆమె అమెరికా వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండోలో స్థిరపడ్డారు. వృత్తిపరంగా డాక్టర్ అయిన జమైకాకు చెందిన హ్యారిస్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 1964 అక్టోబర్ 20వ తేదీన కమలా హ్యారిస్ జన్మించారు. ఇక న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన  కమలా... 2003లో శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా గెలిచారు. 2016లో నిర్వహించిన అమెరికా ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే తొలి ప్రయత్నంలోనే ఆమె సెనెట్‌కు ఎంపిక కావడం విశేషం. ఈసారి ఏకంగా అధ్యక్ష రేసులో దూసుకొచ్చారు. అయితే, నిధుల సమీకరణలో వెనుకబడి 2019, డిసెంబర్‌లో అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. అనంతరం మూడు నెలల తర్వాత అనూహ్యంగా బైడెన్ నుంచి ఆమెకు పిలుపు రావడం... ఉపాధ్యక్ష పదవికి పోటీపడి గెలవడం జరిగింది. దీంతో కమలా అగ్రరాజ్యం తొలి మహిళ ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. ఇక అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవడంపై భారత్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ కూడా ఆమెకు ట్విట్టర్ అభినందనలు తెలిపారు.  

Updated Date - 2020-11-08T15:09:00+05:30 IST