'నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది': కమల భర్త

ABN , First Publish Date - 2020-11-11T23:55:19+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన, భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే.

'నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది': కమల భర్త

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన, భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే. భారతీయ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్, నల్ల జాతీయురాలు, తొలి మహిళ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికై కమల చరిత్ర సృష్టించారు. కమల తల్లి శ్యామల గోపాలన్ తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన వారు. దీంతో ఆమె స్వస్థలంలో కమల విజయం పట్ల ఆనందం వ్యక్తం అవుతోంది. అలాగే ఆమె తండ్రిది జమైకా కావడంతో అక్కడ కూడా మా ఆడపడచు అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలు కాబోతుందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే... ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కమల భర్త డగ్లస్ ఎమ్హాఫ్ పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భార్య విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ డగ్లస్ గత వారం ఈ భావోద్వేగ పోస్ట్ చేశారు. కమలాను అప్యాయంగా కౌగిలించుకుని ఉన్న ఓ పాత ఫొటోను పోస్ట్ చేసిన డగ్లస్... దానికి "సో ప్రౌడ్ ఆఫ్ యూ" అనే క్యాప్షన్ జత చేశారు. ఈ భావోద్వేగ పోస్ట్‌కు ఇన్‌స్టాలో ఏకంగా 4,97,209 లైక్స్ వచ్చాయి. ఈ సందర్భంగా నెటిజన్లు కమల దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే... "మేడమ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెకండ్ జెంటిల్‌మన్" అంటూ కామెంట్ పెట్టారు.


ఇక తన 12.2 మిలియన్ల ఇన్‌స్టాగ్రాం ఫాలోవర్స్‌కు కమల తన భర్త డగ్లస్‌ను పరిచయం చేస్తూ అమెరికా ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో ఇద్దరు కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఫొటో కింద "మీట్ ద లవ్ ఆఫ్ మై లైఫ్, @DouglasEmhoff," అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ కూడా చాలా వైరల్ అయింది. దీనికి ఏకంగా 28 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 25 వేల మంది దంపతులకు అభినందనలు తెలుపుతూ కామెంట్స్ పెట్టారు. డగ్లస్ కూడా ఈ ఫొటోను రిపోస్టింగ్ చేసి... "లవ్ యూ మేడమ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్" అని కామెంట్ చేశారు. కాగా, డగ్లస్‌తో కమలాకు 2014లో వివాహమైంది. డగ్లస్‌కు ఇది రెండో వివాహం కాగా... కమలాకు మొదటిది. దంపతులిద్దరూ కూడా లాయర్లే. 

Updated Date - 2020-11-11T23:55:19+05:30 IST