వివేక్ మూర్తిని ప్రశంసలతో ముంచెత్తిన కమలా హ్యారిస్

ABN , First Publish Date - 2021-04-02T18:56:41+05:30 IST

అమెరికా సర్జన్ జనరల్, భారత సంతతి వైద్య నిపుణుడు డా. వివేక్ మూర్తిని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రశంసలతో ముంచెత్తారు.

వివేక్ మూర్తిని ప్రశంసలతో ముంచెత్తిన కమలా హ్యారిస్

వాషింగ్టన్: అమెరికా సర్జన్ జనరల్, భారత సంతతి వైద్య నిపుణుడు డా. వివేక్ మూర్తిని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రశంసలతో ముంచెత్తారు. అగ్రరాజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిన కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో వివేక్ మూర్తి చేసిన కృషిని ఆమె ప్రశంసించారు. 'సర్జన్ జనరల్ వివేక్ మూర్తికి ధన్యవాదాలు. మహమ్మారిపై పోరులో భాగంగా ఆయన నెలల తరబడి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు.' అని కొవిడ్-19పై ప్రజలకు అవగాహన కల్పించే విషయమై గురువారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఉపాధ్యక్షురాలు అన్నారు. కనుక మీ అందరి ముందు వివేక్ మూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పారు.


కరోనా సమయంలో ఆయన సేవలు అమోఘం. ఇంకా చెప్పాలంటే ఈ విపత్కర పరిస్థితిలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని కాపాడాయి. మహమ్మారి సమయంలో అలుపెరుగని పోరుతో దేశ ప్రజలను కాపాడిన వివేక్ మూర్తికి మనం ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పిన తక్కువేనని కమలా చెప్పుకొచ్చారు. కాగా, గత నెలలో భారతీయ అమెరికన్ అయిన 43 ఏళ్ల వివేక్ మూర్తి అమెరికా 21వ సర్జన్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పదవి చేపట్టడం ఆయనకు ఇది రెండోసారి. ఇంతకుముందు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కూడా ఆయన అమెరికా సర్జన్ జనరల్‌గా విధులు నిర్వహించారు.       

Updated Date - 2021-04-02T18:56:41+05:30 IST