తల్లడిల్లిన కమలాపురం

ABN , First Publish Date - 2021-10-18T05:18:41+05:30 IST

తల్లడిల్లిన కమలాపురం

తల్లడిల్లిన కమలాపురం
పల్టీకొట్టిన ట్రాక్టర్‌

ట్రాక్టర్‌ పల్టీ ఘటనలో నలుగురి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం 

కుటుంబాలకు సీఎల్పీ నేత, జడ్పీచైర్మన్‌, పలువురి పరామర్శ

ముదిగొండ, అక్టోబరు 17: తొమ్మిదిరోజులపాటు అమ్మ వారిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించి.. పదోరోజైన శనివారం నిమజ్జనం చేసేందుకు బయల్దేరారు. కానీ రోడ్డు ప్రమాదం వారిలోని నలుగురు ప్రాణాలను బలితీసుకుంది. దీంతో ముదిగొండ మండలం కమలాపురం గ్రామం తల్లడిల్లి పోయింది. కమలాపురం గ్రామంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి అమ్మ వారికి ఘనంగా వీడ్కోలు పలికే క్రమంలో శనివారం మధ్యాహ్నం 3:30గంటల నుంచి రాత్రి 9:30వరకు శోభా యాత్ర నిర్వహించారు. ఆ తర్వాత నిమజ్జనం కోసం గ్రామ సమీపంలోని మున్నేటికి వెళ్లాల్సి ఉండగా.. ఇంతలో ఉరుములు, మెరుపులతో కూడినవర్షం ప్రారంభం కావడం తో.. హడావుడిగా రాత్రి 10గంటల సమయంలో రెండు ట్రాక్టర్లలో నిమజ్జనానికి బయల్దేరారు. తొలుత ఓ ట్రాక్టర్‌లో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని కొందరు గంధసిరి మున్నేరు వైపు వెళ్లగా, 20 నిమిషాల తర్వాత మరో ట్రాక్టర్‌లో వెళ్లిన సుమారు 20 మంది.. స్నానా లు చేసేందుకు వల్లభి వద్ద సాగర్‌ కాలువకు వెళ్లాలని భావించారు. వారు వల్లభి వైపు వెళ్లే క్రమంలో గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఇసుక బావి వద్ద వారి ట్రాక్టర్‌ పల్టీకొట్టింది. దీంతో అవసాని ఉపేందర్‌(32), ములకలపల్లి ఉమ(38), చోడ బోయిన నాగరాజు(23), బిచ్చాల ఎలగొండస్వామి(54) ట్రాక్టర్‌ కిందపడి అక్కడికక్కడే మృతిచెందగా కొందరు ట్రాక్ట ర్‌పై నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. ట్రాక్టర్‌ కింద ఇరుకున్న వారిని మిగిలిన వారు బయటకు లాగారు. సంఘటనాస్థలానికి ఖమ్మం రూరల్‌ ఏసీపీ బస్వారెడ్డి, రూరల్‌ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ నరేష్‌ చేరు కొని సహాయచర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతిచెందిన అవసానిఉపేందర్‌, ములకలపల్లి ఉమ మృతదేహాలకు ఆదివారం సాయంత్రం అంతిమసంస్కారాలు నిర్వహిం చగా.. చోడబోయిన నాగరాజు, బిచ్చాల ఎలగొండస్వామి కుటుంబసభ్యులు మాత్రం ట్రాక్టర్‌ యజ మాని నుంచి పరిహారం డిమాండ్‌ చేస్తూ వారి వారి ఇళ్ల వద్దే మృతదేహాలను ఉంచి నిరసన తెలిపారు. చివరకు పోలీసులు, గ్రామపెద్దలు నచ్చజెప్పడంతో రాత్రి సమయంలో ఆ ఇద్దరి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు.

నలుగురిని కాపాడిన ఎల్లేశ్వరరావు

హైదరాబాద్‌లో చదువుతున్న ఎల్లేశ్వరరావు కరోనా కారణంగా గ్రామానికి వచ్చాడు. గ్రామస్థులతో కలిసి శనివారం రాత్రి శోభాయాత్రలో పాల్గొని నిమజ్జనానికి బయల్దేరాడు. ట్రాక్టర్‌ పల్టీకొట్టిన సమయంలో చాకచక్యంగా కిందకు దూకిన ఎల్లేశ్వరరావు.. ట్రాక్టర్‌ వెనుక డోర్‌ను తెరిచి నలుగురి ప్రాణాలు కాపాడాడు. ఎల్లేశ్వరరావు చేసిన సాహసాన్ని గ్రామస్థులు అభినం దించారు.

పలువురి పరామర్శ

ట్రాక్టర్‌ ప్రమాదంలో మృతిచెంది ఖమ్మం ప్రభుత్వ ఆసు పత్రిలో ఉన్న వారి భౌతికకాయాలను సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ సందర్శించి నివాళులర్పించారు. ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్‌రెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు రాయల నాగేశ్వరరావు మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. గాయపడి చికిత్సపొందు తున్న వారిని పరామర్శించి.. ధైర్యం చెప్పారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతాపం ప్రకటించారు.

మృతులు ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం.. 

అవసాని ఉపేందర్‌ డిగ్రీ పూర్తి చేసి మిషన్‌ భగీరథ లో ప్రైవేట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య రజిత, కుమార్తె పావని, కుమారుడు ప్రదీప్‌ ఉన్నారు. ఉపేందర్‌ తండ్రి వెంకటేశ్వర్లు కమలాపురం ఉపసర్పంచ్‌గా ఉన్నారు. 

ములకలపల్లి ఉమ గ్రేటర్‌ హైదరాబాద్‌లో మునిసిపల్‌ కార్మికురాలిగా పని చేస్తోంది. దసరా కోసమని భర్త పిల్లలతో కలిసి ఈనెల 13న తన సొంతూరైనా కమ లాపురం చేరుకుంది. గ్రామంలోని బతుకమ్మ, దుర్గమ్మ నిమ జ్జనం, ఊరేగింపుల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె.. మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపో యారు. ఉమకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

చోడబోయిన నాగరాజు తల్లి ఐదేళ్ల క్రితం మృతిచెందింది. కానీ చదువుకోవాలన్న తపనతో నాగరాజు రోజూ కూలి పనులకు వెళుతూ బీటెక్‌ పూర్తిచేశాడు. కానీ కరోనా, ఇతర కారణాలతో ఉద్యోగాశాలు దొరక్క ఏడాదిగా ఇంటి వద్దే ఉంటూ రోజువారీ కూలీ పనులకు వెళ్తున్నాడు. ఎలాగైనా ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకుంటాడని చెప్పిన తన కుమారుడు ఇలా కన్నుమూయడంతో తండ్రి అప్పారావు గుండెలవిసేలా రోదిస్తున్నాడు. 

బిచ్చాల ఎలగొండస్వామి దినసరి కూలీపనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎలగొండస్వామికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెల వివాహం జరిపించగా కుమారుడు ఆటో నడుపుతూ తండ్రికి అండగా ఉంటున్నాడు. తండ్రి మృతితో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.









Updated Date - 2021-10-18T05:18:41+05:30 IST