Kamal రాజకీయాలకు ఇంటర్వెల్‌ ?

ABN , First Publish Date - 2021-12-03T13:58:01+05:30 IST

మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ రాజకీయాలకు విరామం ప్రకటించనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీకి పెరిగిన ఓటు బ్యాంకు అసెంబ్లీ ఎన్నికల్లో బాగా తగ్గిపోవటం, ఇటీవల తొమ్మిది జిల్లాల్లో జరిగిన స్థానిక

Kamal రాజకీయాలకు ఇంటర్వెల్‌ ?

- ఓటుబ్యాంకు తగ్గుముఖం

- అనుకూలించని ఆరోగ్యం


చెన్నై: మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ రాజకీయాలకు విరామం ప్రకటించనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీకి పెరిగిన ఓటు బ్యాంకు అసెంబ్లీ ఎన్నికల్లో బాగా తగ్గిపోవటం, ఇటీవల తొమ్మిది జిల్లాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సత్తా చూపలేకపోవడం, వీటన్నింటికీ తోడు తాజాగా కరోనా వైరస్‌ తాకిడికి గురై ఆరోగ్యం దెబ్బతినటం వంటి కారణాలతో ఆయన రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారు. కరోనా తాకిడికి గురై పోరూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు పొంది కోలుకున్న కమల్‌హాసన్‌ ఈ నెల నాలుగున డిశ్చార్జి అవుతున్నారు. ఆ తర్వాత కనీసం పదిహేను రోజుల పాటు ఆయన ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకోనున్నారు. శని, ఆదివారాలు మాత్రం ఎప్పటివలెనే తమిళ బిగస్‌బాస్‌ వ్యాఖ్యాతగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్‌ అస్వస్థత కారణంగా సినిమాల్లోనూ సక్రమంగా నటించలేకున్నారు. స్వంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ‘విక్రమ్‌’ సినిమా షూటింగ్‌ కూడా అర్థాంతరంగా ఆగిపోయింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక కమల్‌హాసన్‌ రాజకీయాలకు గుడ్‌బై చెబుతారని ఊహా గానాలు చెలరేగుతున్నాయి. వచ్చే యేడాది జనవరిలోగా రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనువుగా కమల్‌హాసన్‌ పార్టీ శ్రేణులను సిద్ధం చేయలేకపోతు న్నారు. గత నెల రోజులుగా పార్టీ కార్యక్రమాలేవీ నిర్వహించకపోవడంతో కార్యకర్తలు నిరాశచెందుతున్నారు. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్‌ రాజకీయాలకు దూరమవు తారా? లేక రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించనున్నారా? అనే ప్రశ్నలకు మక్కల్‌ నీదిమయ్యం ప్రచార విభాగం నాయకుడు మురళీ అబ్బాస్‌ సమాధానమిచ్చారు. కమల్‌హాసన్‌ పార్టీని ప్రారంభించనప్పుడే తానికపై ప్రజాసేవకే అధిక ప్రాధాన్యతనిస్తానని సుస్పష్టంగా ప్రకటించారని, ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనప్పుడు కూడా ప్రజలకు దూరమయ్యే ప్రసక్తేలేదని తెలిపారని ఆయన చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రంలో రెండు ద్రవిడ పార్టీలలో ఒకదానితో పొత్తుకుదుర్చుకుని ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా అని సన్నిహితులు చెప్పినప్పుడు ఆ రెండు పార్టీలూ అవినీతి పార్టీలని తాను ప్రకటించిన తర్వాత ఎలా ఆ పార్టీలతో పొత్తుపెట్టుకుంటానని ప్రశ్నించారని చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో గెలిస్తే కుటుంబ పోషకురాలైన మహిళకు ప్రతినెలా వెయ్యిరూపాయలు చెల్లిస్తానని కమల్‌ ప్రకటించారని, ఆ ప్రకటనను రెండు ద్రవిడ పార్టీలు తమ మేనిఫెస్టోలలో ప్రకటించాయని చెప్పారు. ఇలా ప్రజల కోసం మంచి చేయాలనే తపించే కమల్‌హాసన్‌ ఉన్నట్టుండి రాజకీయాలకు దూరం అయ్యే ప్రసక్తి లేదని, ఒక వేళ ఆరోగ్య కారణాల వల్ల పార్టీ రాజకీయాలకు కాస్త విరామం ప్రకటించే అవకాశమే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కమల్‌ ఈ ఊహాగానాలకు పుల్‌స్టాప్‌ పెట్టేలా అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.

Updated Date - 2021-12-03T13:58:01+05:30 IST