ఇదేం భద్రత?.. ఆరు నెలల సీసీ ఫుటేజీ భద్రంగా ఉండాల్సిందే..

ABN , First Publish Date - 2020-09-25T15:22:53+05:30 IST

ఇంద్రకీలాద్రిపై భద్రత ఏర్పాట్లపై సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ కమిటీ అసంతృప్తిని..

ఇదేం భద్రత?.. ఆరు నెలల సీసీ ఫుటేజీ భద్రంగా ఉండాల్సిందే..

డీఎఫ్‌ఎండీ, హెచ్‌హెచ్‌ఎండీల వద్ద నైపుణ్యం అవసరం

లేకపోతే శిక్షణ ఇప్పించండి

దుర్గగుడి అధికారులపై సెక్యూరిటీ, సేఫ్టీ కమిటీ అసంతృప్తి


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై భద్రత ఏర్పాట్లపై సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆలయ అధికారులకు అక్షింతలు వేసింది. పలు విషయాలపై కీలక సూచనలు చేసింది. ఈ కమిటీ ఇంద్రకీలాద్రిపై గురువారం సెక్యూరిటీ ఆడిట్‌ నిర్వహించింది. ప్రతి ఏడాదీ నిర్వహించే ..... ఈ ఆడిట్‌ను ఈసారి దసరా ఉత్సవాల ప్రారంభానికి ముందుగానే నిర్వహించారు. శాంతిభద్రతల విభాగ పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఇంటెలిజెన్స్‌, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌, ఇరిగేషన్‌, ఇంజనీరింగ్‌, ట్రాఫిక్‌ విభాగాల అధికారులతో కూడిన కమిటీ ఆలయ అధికారులతో భేటీ అయ్యింది. ఘాట్‌ రోడ్డు, మహామండపం మార్గాల్లో వెళ్లి ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రతి ప్రదేశాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.


ఆలయానికి ఉన్న ప్రవేశ మార్గాలు, బయటకు వచ్చే మార్గాలను తనిఖీ చేశారు. మొత్తంగా ఐదారు అంశాలపై అధికారులకు క్లాస్‌ తీసుకున్నారు. వచ్చే ఏడాది నిర్వహించబోయే సెఫ్టీ అండ్‌ సెక్యూరిటీ కమిటీ సమావేశం నాటికి వాటిని అమలు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సీసీ కెమెరాల ఫుటేజీ విషయంలో తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితమే అమ్మవారి రథానికి ఉన్న నాలుగు వెండి సింహం ప్రతిమల్లో మూడు మాయమవ్వడం, దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ భద్రపరచకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫుటేజీ కనీసం ఆరు నెలలపాటు భద్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. మహామండపం వద్ద అగ్నిప్రమాదాలను నియంత్రించడానికి ఫైర్‌ ఫైటర్లు, ఎగ్జాస్టర్లు, పైపులైన్‌ ఏర్పాటు చేసినప్పటికీ వాటికి కనెక్షన్లు లేవు. తక్షణం వాటికి కనెక్షన్లను ఇవ్వాలని ఇంజనీరింగ్‌ శాఖ అధికారులను ఆదేశించారు.


అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను డీఎఫ్‌ఎండీ (డోర్‌ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌), హెచ్‌హెచ్‌ఎండీ (హ్యాండ్‌ హోల్డ్‌ మెటల్‌ డిటెక్టర్‌)తో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వారికి ఎలాంటి నైపుణ్యం లేదని కమిటీ నిర్ధారించింది. వాటిని ఉపయోగించే విధానం తెలిసిన వారిని మాత్రమే నియమించాలని సూచించింది. ఒకవేళ నైపుణ్యం లేకపోతే ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాలని సూచించింది. అదేవిధంగా దర్శనానికి వెళ్లడానికి రెండు ప్రవేశ మార్గాలున్నాయి. ఘాట్‌రోడ్డు, మహామండపం నుంచి దర్శనానికి వెళ్లొచ్చు. దర్శనం అనంతరం భక్తులు కిందికి రావడానికి ఆరు పాయింట్లు ఉన్నాయి.


వాటిలో ఒకటి, రెండు మాత్రమే తెరుచుకుని ఉన్నాయి. మొత్తం బయటకు వచ్చే మార్గాలను (ఎగ్జిట్‌ పాయింట్ల)ను తెరిచి ఉంచాలని కమిటీ స్పష్టం చేసింది. కొండపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో జరగరాని ప్రమాదం జరిగితే భక్తులు సులువుగా కిందికి వెళ్లడానికి ఈ మార్గాలు ఉపయోగపడతాయని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ సూచనలను వచ్చే ఏడాది జరగబోయే సమావేశం నాటికి పూర్తిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. 



Updated Date - 2020-09-25T15:22:53+05:30 IST