దుర్గగుడి టెండర్లలో విస్తుపోయే విషయాలు

ABN , First Publish Date - 2021-04-03T22:06:40+05:30 IST

దుర్గగుడి టెండర్లలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెక్యూరిటీ టెండర్ల మాదిరిగా నిబంధనలకు విరుద్ధంగా..

దుర్గగుడి టెండర్లలో విస్తుపోయే విషయాలు

విజయవాడ: దుర్గగుడి టెండర్లలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెక్యూరిటీ టెండర్ల మాదిరిగా నిబంధనలకు విరుద్ధంగా.. శానిటరీ టెండర్లు కూడా ఖరారు చేసినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. శానిటరీ పనులను 2019 నుంచి ఒకే సంస్థ చేస్తున్నట్టు గుర్తించారు. కేఎల్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌కు టెండర్‌ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కమిషనర్ అనుమతి లేకుండా  ఈవో సురేష్‌బాబు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. టెండర్ రద్దు చేయాలని 2019లోనే అప్పటి కమిషనర్ పద్మ ఆదేశాలిచ్చారు. మార్చి 31తో గడువు ముగిసినా కొత్త టెండర్లను అధికారులు  ఫైనల్‌ చేయలేదు. ఇంద్రకీలాద్రిపై ఏడాదిన్నరగా శానిటేషన్‌ కాంట్రాక్టును సికింద్రాబాద్‌కు చెందిన కేఎల్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ సంస్థ నిర్వహిస్తోంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బినామీ సంస్థగా ఆరోపణలు ఉన్న ఈ సంస్థకు 2019, సెప్టెంబరులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో రూ.4 కోట్ల విలువైన కాంట్రాక్టును కట్టబెట్టారు. 


అప్పటి నుంచి వివాదాలు నడుస్తూనే ఉన్నా దుర్గగుడి ఈవో సురేష్‌బాబు ఈనెల 31వ తేదీ వరకు అగ్రిమెంట్‌ చేసుకుని ఆ సంస్థనే కొనసాగిస్తున్నారు. కరోనా సాకు చూపించి టెండర్‌ ప్రక్రియ నిర్వహించకుండా మరో ఏడాది కేఎల్‌ సంస్థను కొనసాగించేందుకు అనుమతించాలని ఆరు నెలల క్రితం ఈవో రాసిన లేఖను దేవదాయశాఖ కమిషనర్‌ తిరస్కరించారు. నిబంధనల ప్రకారం వెంటనే టెండర్లు పిలిచి తక్కువ కోట్‌ చేసిన సంస్థకే కాంట్రాక్టు ఇవ్వాలని ఆదేశించారు. అయితే తమ సంస్థతో చేసుకున్న అగ్రిమెంట్‌ గడువు మార్చి 31 వరకు ఉన్నందున కొత్తగా టెండర్లు పిలవడం అన్యాయమంటూ కేఎల్‌ సంస్థ కోర్టును ఆశ్రయించింది.

Updated Date - 2021-04-03T22:06:40+05:30 IST