Abn logo
Aug 5 2020 @ 04:38AM

ముగిసిన పవిత్రోత్సవాలు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ):  కనకదుర్గమ్మ దేవాలయంలో ఆదివారం ప్రారంభమైన శ్రావణ మాస పవిత్రోత్సవాలు మంగళవారంతో విజయవంతంగా ముగిశాయి. ఉదయం 10.30 గంటలకు వేదపండితులు మహా పూర్ణాహుతి నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలికారు. అమ్మవారి ఆలయంలో జరిగే సర్వ వైదిక క్రతువులు, ఉత్సవాలు సంపూర్ణ ఫలితాలను ఇవ్వాలని, సర్వదోషాల నివారణ కోసం ప్రతి ఏటా ఆలయ ఆగమ నియమ నిబంధనల ప్రకారం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ప్రదోషకాల సమయంలో వేదపండితులు ఉదకశాంతి నిర్వహించి.. ఆ కుంభంతో ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి అభ్యంగన స్నానం, స్నపనాభిషేకం, ప్రాతఃకాలార్చన, అగ్నిప్రతిష్టాపన, అఖండ దీపస్థాపన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.


అనంతరం 108 పోగులు, 108 ముళ్లు కలిగిన పట్టు పవిత్రాలను అమ్మవారికి, ఆలయంలోని ఇతర ఉత్సవమూర్తులకు ధారణ చేశారు. ఆ పవిత్రాల అలంకరణలోనే ఈ మూడు రోజులు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకించి ఆలయ శుద్ధి కోసం శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు నిర్వహించడంతో ఈ మూడు రోజులు భక్తులకు ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశారు. మంగళవారంతో పవిత్రోత్సవాలు ముగిసినందున బుధవారం నుంచి యథావిధిగా భక్తులకు ఆర్జిత సేవలను పునరుద్ధరిస్తామని దేవస్థానం స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ తెలిపారు. 


రామమందిర నిర్మాణం త్వరగా పూర్తికావాలని నేడు రుద్రహోమం 

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ ఇంద్రకీలాద్రిపై యాగశాలలో బుధవారం ఉదయం 11 గంటలకు రుద్రహోమం నిర్వహించనున్నట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement