Abn logo
Sep 19 2021 @ 09:03AM

కండలేరు నుంచి కృష్ణా జలాల విడుదల నిలిపివేత

పెరంబూర్‌(చెన్నై): కండలేరు డ్యాం నుంచి విడుదల చేస్తున్న కృష్ణా జలాలను నిలిపివేశారు. నగరవాసుల దాహార్తిని పుళల్‌, పూండి, చోళవరం, చెంబరం బాక్కం జలాశయాలు తీరుస్తున్నాయి. వీటితో పాటు తేర్వాయ్‌ కండిగై పేరిట కొత్త జలాశయం నిర్మించడంతో, ఐదు జలాశయాల మొత్తం సామర్థ్యం 11.7 టీఎంసీలుగా ఉంది. వీటికి ఎగువన కురిసే వర్షాలతో పాటు కండలేరు డ్యాం నుంచి కృష్ణా జలాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, శనివారం ఉదయం 8 గంటల గణాంకాల ప్రకారం ఐదు జలాశయాల్లో 9.65 టీఎంసీల నీటి నిల్వలుండగా, ఈ నీటితో మరో ఏడాది వరకు నగరవాసులకు నీటిని అందజేయవచ్చు. త్వరలో ఈశాన్య రుతుపవనాల రాకతో జలాశయాలకు మరింత నీరు చేరే అవకాశముంది. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర అధికారుల విజ్ఞప్తి మేరకు కండలేరు డ్యాం నుంచి నీటి విడుదలను నిలిపేశారు. కండలేరు డ్యాం నుంచి గత జూలై 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 4.42 టీఎంసీల నీరు పూండి జలాశయానికి వచ్చి చేరింది.