మానవ నిర్మిత మహాద్భుతాలు

ABN , First Publish Date - 2021-09-15T05:02:48+05:30 IST

అక్షయపాత్ర, ఆధునిక..

మానవ నిర్మిత మహాద్భుతాలు
కండలేరు డ్యాం అతి పొడవైన మట్టికట్ట ఇదే! (ఫైల్‌)

నెల్లూరు జిల్లా జలప్రసాదిని సోమశిల, కండలేరు

లక్షలాది మంది గొంతు తడుపుతూ.. మెట్టను సస్యశామలం చేస్తూ..

నేడు ఇంజనీర్స్‌ డే!


రాపూరు(నెల్లూరు): జలాశయాలు, ఆనకట్టలు, రైల్వే వంతెనలు, సొరంగ మార్గాలు ఇలా ఎన్నో పేరెన్నికగల నిర్మాణాలు దేశ ప్రగతికి ప్రతీకలు. ఇంజనీరింగ్‌ ప్రతిభకు ఇలాంటి కట్టడాలు చిహ్నాలు. మనదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఇంజనీరు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన జన్మదినం సెప్టెంబరు 15న ఇంజనీర్సు డేగా జరుపుకుంటున్నాం. ఈయన స్ఫూర్తితో జిల్లాలో ఎంతోమంది ఇంజనీర్లు విధులు నిర్వహించారు. సోమశిల, కండలేరు జలాశయాలతోపాటు ఎన్నో చారిత్రక కట్టడాలు ఇంజనీర్ల మేథోసంపత్తికి దర్పణంగా నిలుస్తున్నాయి. ఎంతోమంది ఇంజనీర్లు, శ్రామికులు రేయింబవళ్లు కష్టపడి భావితరాలకు ఈ ప్రాజెక్టులు అందించారు. లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలతోపాటు చెన్నైవాసుల దాహం తీరుస్తున్న ఈ ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం..

 

వండర్‌ డ్యాం కండలేరు!

అక్షయపాత్ర, ఆధునిక దేవాలయం, బహుళార్థక సాగర ప్రాజెక్టుగా మానవ నిర్మిత మహాద్భుతం కండలేరు జలాశయం. నెల్లూరు, చిత్తూరు జిల్లాలతోపాటు తమిళనాడులోని చెన్నై వాసుల జలప్రసాదినిగా ఈ డ్యాం నిలిచింది. పూర్తిస్థాయి సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లో ఆనాటి సివిల్‌ ఇంజనీరింగ్‌ అద్భుతాలతో ఈ డ్యాం పురుడుపోసుకుంది. వేలాది మంది కూలీలు, రకరకాల యంత్రాలతో, ఇంజనీరింగ్‌ నిపుణుల పర్యవేక్షణలో స్థానిక టెక్నికల్‌, నాన టెక్నికల్‌ అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి ఈ అద్భుత నిర్మాణాన్ని పూర్తిచేసి వహ్వా అనిపించే నీటి అందాలను సృష్టించారు. రాపూరు మండలం చెల్లటూరు గ్రామం వద్ద పెంచలకోన నుంచి వచ్చే కండ్లేరు వాగు మీద నిర్మించిన ఈ డ్యాం సామర్థ్యం 68 టీఎంసీలు. 


1983లో భూమిపూజ..

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు మానస పుత్రికగా పేరు గడించిన ఈ జలాశయం నిర్మానానికి 1983, డిసెంబరులో భూమిపూజ జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ చొరవచూపగా, భూమిపూజ కార్యక్రమానికి అప్పటి ఆంధ్ర, తమిళనాడు ముఖ్యమంత్రులు స్వర్గీయ ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ పాల్గొన్నారు. 1996లో తొలిదశ పనులు పూర్తిచేసి తొలిసారిగా చెన్నైవాసులకు నీరందించారు. సుమారు రూ.150 కోట్ల అంచానాతో ప్రారంభమైన పనులు డ్యాం పూర్తయ్యేనాటికి రూ.400కోట్లకు చేరింది. 


11 కి.మీ పొడవైన మట్టికట్ట

సహజంగా రెండు కొండల మధ్య ప్రాజెక్టును నిర్మిస్తారు. అయితే, కండలేరు నిర్మాణం మాత్రం అలా జరగలేదు. వండర్‌ డ్యాంగా రికార్డులకెక్కిన ఈ కండలేరు ఆసియా ఖండంలోనే ఎక్కడా లేని విధంగా 11 కి.మీ పొడవు, 49 మీటర్ల ఎత్తుతో నీటి అలలను తట్టుకునేలా వంకర్లు తిరిగే విధంగా మట్టికట్టను నిర్మించారు. ఇందుకోసం 162 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని వినియోగించారు. జిల్లాకు చెందిన కూలీలతోపాటు పాలమూరుకు చెందిన కూలీలు పనుల్లో భాగస్వామ్యులయ్యారు. అప్పటి ప్రభుత్వ ఓఎ్‌సడీ, తెలుగుగంగ రూపకర్త రామకృష్ణయ్య సారథ్యంలోనే డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించారు. తొలి ఎస్‌ఈగా కృష్ణమూర్తి, ఈఈగా వెంకట నరసయ్యలు పని చేశారు.


ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌, సత్యసాయిగంగ కాలువ

కండలేరు డ్యాంకు సోమశిల నుంచి గంగను తీసుకువచ్చేందుకు 42 కి.మీ పొడవైన సోమశిల-కండలేరు ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ నిర్మించారు. అలాగే డ్యాం నుంచి నీరు నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా వెళ్లేందుకు 156 కి.మీ పొడవైన సత్యసాయి గంగ కాలువను నిర్మించారు. చెన్నైలో రెడ్‌హిల్స్‌ సమీపంలోని పూండి వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించారు. ఈ ప్రాంతం నుంచి వచ్చే వరదల ద్వారా ఏడాదికి 3 టీఎంసీల నీరు జలాశయంలోకి వస్తుంది. దీంతో సోమశిల నుంచి వరద నీరు, కృష్ణా జలాలతో డ్యాంను నింపుతారు. ఈ డ్యాం సామర్థ్యం 68 టీఎంసీలు కాగా, గతేడాది అత్యధికంగా 61టీఎంసీలు నిల్వ చేశారు.


బహుళార్థక సాగర ప్రాజెక్టు

కండలేరు డ్యాం బహుళార్థకసాగర ప్రాజెక్టుగా వినతికెక్కింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మంది ప్రజలకు  మంచినీరు అందిస్తోంది. అలాగే పొరుగురాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై నగరవాసులకు ఏడాదికి 15టీఎంసీలు నీటిని అందిస్తోంది. అంతేగాక హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద 9 మెగావాట్ల విద్యుత సామర్థ్యం ఉన్నా తాజాగా  6 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

 

చెన్నైకి నీళ్లిస్తారంట అంటూ నవ్వుకున్నారు!

తొలి రోజుల్లో ఇక్కడ నుంచి చెన్నైకు నీళ్లిస్తారంట అంటూ నవ్వుకునేవాళ్లు. నాడు నవ్వినవాళ్లే నేడు మెచ్చుకుంటున్నారు. రేయింబవళ్లు అందరం కలసి కట్టుగా పనిచేసి ప్రాజెక్టును పూర్తిచేశాం. కొన్ని రోజులు పనులు చేసేచోటే కూలీలతో నిద్రించేవాళ్లం. ప్రాజెక్టు పూర్తయి ఆ ఫలాలు అందరికీ అందడం ఎంతో సంతోషంగా ఉంది.  

- వెంకటసుబ్బయ్య, జేఈ, రిటైర్డ్‌ ఎస్‌ఈ 



సోమశిల..

అనంతసాగరం: సోమశిల జలాశయం నిర్మాణానికి రూ.17.20 కోట్ల అంచనాలతో కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. పెన్నానదిపై సోమశిల గ్రామం వద్ద 1975లో పనులు ప్రారంభించగా,  1985 నాటికి తొలిదశ పనులు పూర్తయి, 1989 నుంచి నీటినిల్వ ప్రారంభించారు. 78 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు 12 క్రస్ట్‌గేట్లు అమర్చి సుమారు 7 నుంచి 8 లక్షల క్యూసెక్కులు వరద కిందకు వదిలేలా డిజైన చేశారు. జలాశయం కాంక్రీట్‌ కట్టడాల ఎత్తు 39 మీటర్లు, పొడవు 760 మీటర్లతో నిర్మించారు. జలాశయ పరిధిలో 5,84,500 ఎకరాలకు నీరందించే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతోపాటు వరద జలాలను తెలుగుగంగ కాలువ ద్వారా కండలేరుకు తరలించి అక్కడ నుంచి చైన్నె, చిత్తూరు ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తున్నారు. ఈ రిజర్వాయరు నిర్మాణం కోసం కడప జిల్లాలో 108 గ్రామాలు ముంపునకు బాధితులకు పరిహారం పంపిణీ ప్రక్రియ పూర్తిచేశారు. అంతేగాక 23 మెగావాట్ల విద్యుత ఉత్పత్తి జలాశయం వద్ద జరుగుతోంది. 


Updated Date - 2021-09-15T05:02:48+05:30 IST