అభివృద్ధి బాటలో కంది గ్రామం

ABN , First Publish Date - 2021-10-24T05:06:12+05:30 IST

సంగారెడ్డి జిల్లాలోని కంది గ్రామం అభివృద్ధి బాటలో దూసుకుపోతున్నది.

అభివృద్ధి బాటలో కంది గ్రామం
మొక్కలు నాటుతున్న సర్పంచ్‌ విమలావీరేశం (ఫైల్‌)

జిల్లాలోనే ఆదర్శవంతమైన పురోగతి

సర్పంచ్‌ సొంత నిధులతో కార్యక్రమాలు

కంది, అక్టోబరు 23 : సంగారెడ్డి జిల్లాలోని కంది గ్రామం అభివృద్ధి బాటలో దూసుకుపోతున్నది. సర్పంచ్‌ బుగ్గన్నగారి విమలావీరేశం చొరవతో జిల్లాలోనే ఆదర్శవంతమైన పురోగతి సాధించింది. అధునాతన డంపింగ్‌యార్డు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు, సీసీరోడ్లు, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, నర్సరీ, హరితహారంలో ఊరంతా మొక్కలతో గ్రామం కళకళలాడుతున్నది. ఆమె సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన రెండున్నరేళ్ల నుంచి గ్రామంలో నీటి సమస్య లేకుండా చేశారు. కరోనాను అరికట్టేందుకు పారిశుధ్య కార్మికులతో కలిసి అన్ని వీధుల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. సర్పంచ్‌ తన సొంత నిధులు రూ.5 లక్షలు ఖర్చుచేసి పాడుబడ్డ మంచినీటి బావిని పూడికతీయించి వినియోగంలోకి తెచ్చి ప్రశంసలు అందుకున్నారు. గ్రామ యువత కోసం తన మామ సంగప్ప జ్ఞాపకార్థం రూ.5 లక్షలతో గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నారు. కరోనా ఆపత్కాలంలో నిరుపేదలకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 

జిల్లాలోనే నెంబర్‌ వన్‌ పంచాయతీగా తీర్చిదిద్దుతా

కంది గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాను. జిల్లాలోనే ఆదర్శవంతమైన పురోగతి సాధించడానికి పాలకవర్గ సభ్యులతో కలిసి అహర్నిషలు కష్టపడుతున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారుల సూచనలు, పాలకవర్గ సభ్యుల సహకారం, గ్రామస్థుల ఆశీస్సులతో జిల్లాలోనే కందిని నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతా. 

- బుగ్గన్నగారి విమలావీరేశం, కంది సర్పంచ్‌

Updated Date - 2021-10-24T05:06:12+05:30 IST