కందుకూరి విద్యాసంస్థలను ప్రభుత్వం తీసుకోవడం హర్షణీయం

ABN , First Publish Date - 2021-10-24T05:43:20+05:30 IST

ఎయిడెడ్‌ విద్యాసంస్థలుగా ఉన్న కందుకూరి వీరేశలింగం విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ జారీ చేసిన ఉత్తర్వులు స్వాగతిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బి.పవన్‌, కార్యదర్శి ఎన్‌.రాజా పేర్కొన్నారు.

కందుకూరి విద్యాసంస్థలను ప్రభుత్వం తీసుకోవడం హర్షణీయం

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 23: ఎయిడెడ్‌ విద్యాసంస్థలుగా ఉన్న కందుకూరి వీరేశలింగం విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ జారీ చేసిన ఉత్తర్వులు స్వాగతిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బి.పవన్‌, కార్యదర్శి ఎన్‌.రాజా పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 11 ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ విద్యాసంస్థలుగా మారుస్తూ ఈనెల 21న ఉత్తర్వు లు జారీ కాగా ఇందులో ఐదు కందుకూరి విద్యాసంస్థలే అని పేర్కొన్నారు. ఇప్పటివరకూ రాజమహేంద్రవరంలో ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు 3 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు విద్యార్థులకు అందుబాటులోకి రావడం హర్షణీయమన్నారు. వందేళ్ల క్రితం వీరేశలింగం ఎంతో దూరదృష్టితో రాసిన వీలునామా ఈనాడు ఎందరో పేద విద్యార్థులకు విద్యాదానం చేయడానికి ఉపయోగపడిందన్నారు. కందుకూరి విద్యాసంస్థల పరిరక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నికరమైన ఉద్యమాన్ని సాగించిందన్నారు. ఈ ఉద్యమంలో ఆరుగురు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారని అన్నారు. కందుకూరి విద్యాసంస్థలను మరింత అభివృద్ధి చేయాలని, ఈ సంస్థల్లో పనిచేస్తున్న అన్‌ఎయిడెడ్‌ అధ్యాపకులకు ఉద్యోగభద్రత, మంచి వేతనాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాలని వారు కోరారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్‌, జిల్లా సహాయ కార్యదర్శి లోవరాజు, జిల్లా కమిటీ సభ్యులు రవి, లక్ష్మణ్‌, నగర నాయకులు రాజీవ్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:43:20+05:30 IST