కందుకూరులో టీడీపీ నిరసన దీక్ష భగ్నం

ABN , First Publish Date - 2021-10-28T04:32:06+05:30 IST

రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలను నిరసిస్తూ వైసీపీ ‘ఉగ్రవాదంపై పోరు’ పేరుతో కందుకూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు.

కందుకూరులో టీడీపీ నిరసన దీక్ష భగ్నం
పట్టణ పోలీసు స్టేషన్‌లో కూర్చుని ఉన్న శివరాం, ఇతర నేతలు, శివరాంను అరెస్టు చేస్తున్న సీఐ శ్రీరామ్‌, ఇతర పోలీసు అధికారులు


మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ముందస్తు అరెస్టు 

కందుకూరు, అక్టోబరు 27 : రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలను నిరసిస్తూ వైసీపీ ‘ఉగ్రవాదంపై పోరు’ పేరుతో కందుకూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని ప్రకటించిన పోలీసులు ముఖ్యనాయకులకు మంగళవారం హౌస్‌ అరెస్టు నోటీసులు జారీచేయటమే గాక బుధవారం ఉదయాన్నే మాజీ ఎమ్మెల్యే దివి శివరాంను అరెస్టు చేశారు. డీఎస్పీ కండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సబ్‌ డివిజన్‌ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది కందుకూరు చేరుకుని టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. సీఐ శ్రీరామ్‌ నేతృత్వంలో ఉదయం ఆరున్నరకే మాజీఎమ్మెల్యే దివి శివరాం ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను హౌస్‌ అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అయితే హౌస్‌ అరెస్టుకి తాను అంగీకరించబోనని, ఏమి నేరం చేస్తే హౌస్‌ అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించటంతో ఇంటెలిజెన్స్‌ నివేదికల ప్రకారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని చెప్పి ఆయనను అదుపులోకి తీసుకుని పట్టణ  పోలీసు స్టేషన్‌కి తరలించారు. శివరాం అరెస్టు అనంతరం టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు 70 మందికి పైగా ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధపడటంతో వారందరినీ  అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించారు. దీక్ష కోసం పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చినప్పటికీ దీక్షను పోలీసులు భగ్నం చేసి ముఖ్య నాయకులను అరెస్టు చేయటంతో వారంతా పోలీసు స్టేషన్‌లలోని నాయకులను పరామర్శించి వెనుదిరిగారు. మధ్యాహ్నం తర్వాత వారందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.


పోలీసు తీరు అన్యాయం : దివి శివరాం 

ఈ సందర్భంగా మాజీఎమ్మెల్యే దివి శివరాం మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని, శాంతియుతంగా ఆందోళన చేసే హక్కు కూడా ప్రతిపక్షాలకు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. తమ నిరసన దీక్షను జరగనివ్వకుండా చేసేందుకు ఇంత పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయటం ద్వారా ఈ దీక్షకు ఉన్న ప్రాధాన్యతను వారు తెలియజేశారని, పోలీసులకు ధన్యవాదాలని శివరాం పేర్కొన్నారు.

Updated Date - 2021-10-28T04:32:06+05:30 IST