Abn logo
Sep 19 2020 @ 00:17AM

నేను సరిహద్దుకి వెళ్తా నువ్వు గోల్డ్‌ మెడల్‌ తీసుకురా

Kaakateeya

అనురాగ్‌ కశ్యప్‌పై కంగనా ఫైర్‌


కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ శుక్రవారం మరోసారి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. ‘‘నేనొక యోధురాలిని. అవసరమైతే తల నరుక్కుంటాను తప్ప శతృవుల ముందు తలవంచను. దేశం కోసం ఎప్పుడూ నా గళం వినిపిస్తూనే ఉంటాను. ఆత్మగౌరవంతో జాతీయవాదిగా జీవిస్తాను’’ అని ట్వీట్‌ చేశారు కంగన. జాతీయవాదిగా కంగన తనని తాను వర్ణించుకోవడంతో దర్శకనిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ వ్యంగ్యంగా స్పందించారు. ‘సోదరి మణికర్ణికా.. నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడగలవు! నలుగురైదుగురిని తీసుకొని చైనా సరిహద్దులకు వెళ్లి యుద్ధం చేయి. చొరబాటుదారులు దేశంలోకి ఎలా వస్తారో చూస్తాం! అక్కడ మా రక్షణ కోసం నువ్వు నిలబడి పోరాడినంత కాలం భారతీయులకు తమ దేశ రక్షణ గురించి ఎలాంటి చింత అవసరం లేదని చూపించు. మీ ఇంటి నుంచి ఒక రోజు ప్రయాణంతో సరిహద్దుకు చేరుకోగలవు. వెళ్లి సింహంలా పోరాడు. జైహింద్‌’’ అని అనురాగ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయ ట్వీట్‌కు కంగనా కూడా ఘాటైన సమాధానమిచ్చారు.


‘‘సరే.. నేను సరిహద్దులకు వెళ్తాను. మీరు ఒలింపిక్స్‌కు వెళ్లండి. దేశం గోల్డ్‌ మెడల్స్‌ కోరుకుంటోంది. గుర్తుంచుకోండి! ఇదేమీ బీ గ్రేడ్‌ సినిమా కాదు. గతంలో మనం స్నేహితులుగా ఉన్నప్పుడు కొంచెం తెలివిగలవాడిగా ఉండేవాడివి. ఇంత బుద్దిలేనివాడివి ఎప్పుడయ్యావు?’’ అని కంగన బదులిచ్చారు. తనంతట తాను పోరాటం మొదలుపెట్టలేదనీ, దాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాననీ కంగనా తెలిపారు. ‘‘గొడవ  పడే వ్యక్తిగా నన్ను చిత్రీకరిస్తున్నారు. ఏ గొడవైనా నేను ప్రారంభించినట్టు నిరూపిస్తే ట్విట్టర్‌ నుంచి వైదొలుగుతాను. ‘ఎవరైనా తనతో యుద్ధం చేయమని మిమ్మల్ని అడిగితే తిరస్కరించకూడదు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. నేను దాన్ని ఆచరిస్తాను’’ అని కంగన చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement
Advertisement